Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె ఆడుతుంది! మీరు జరుపుకోండి!… మీ భాషల మన్నువడ…!

March 11, 2024 by M S R

ఆమె ఆడుతుంది! మీరు జరుపుకోండి!

భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి. యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే ఉండాలి.
కంపెనీల నిర్లక్ష్యమో, యాడ్ ఏజెన్సీల చేతగానితనమో, అనువాదకుల అజ్ఞానమో లేక వీటన్నిటి కలగలుపో తెలియదు కానీ-ఇప్పుడొస్తున్న ప్రకటనలు చూడ్డానికే తప్ప చదవడానికి పనికి రావు.

సాధారణంగా ప్రకటనలు ఎవరూ చదవరు. ఒకవేళ సాహసించి ఎవరయినా చదివినా అర్థం కావు. అలా అర్థం కాకుండా రాయడం, యాడ్ ను ఇనుప గుగ్గిళ్లతో దుర్భేద్యమయిన విషయంగా తయారు చేయడం దానికదిగా ఒక విద్య. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మంది మనసు గెలవాలని చేసే ప్రకటనల్లో అనువధ జరిగి పాఠకులకు కడుపులో ఎలా దేవినట్లు ఉంటుందో ప్రకటనకర్తలకు తెలియదు. లేక తెలిసినా పగబట్టి పాఠకులను హింసిస్తూ అజ్ఞానానందంలో మునిగితేలుతున్నారేమో!

Ads

విశ్రుత సురక్షిత కలుపు
——————–
ఈమధ్య రోజూ ఒక రంగుల ప్రకటన వస్తోంది. పది రోజులు వరుసగా చదివినా అర్థం కాలేదు. చివరకు అది పొలాల్లో కలుపు మొక్కలను నాశనం చేసే మందు అని- అదే ప్రకటన హిందీ టెక్స్ట్ చదివితే అర్థమయ్యింది. తాటికాయంత అక్షరాలతో ఉన్న తెలుగు అనువాదమిది-
“స్వీప్ పవర్, విశ్రుత చర్య గల ఎంపిక చేయబడని సురక్షిత కలుపు నాశిని”.

నాకున్న కొద్దిపాటి తెలుగు వ్యాకరణ పరిజ్ఞానంతో ఈ ప్రకటనలో వికటానువాదం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. విస్తృత చర్య రాయబోయి విశ్రుత చర్య రాసి ఉండాలి. విశ్రుత అంటే బాగా ప్రసిద్ధికెక్కిన అని అర్థం. ఒక వేళ అది తెలిసి రాసి ఉంటే- బాగా ప్రసిద్ధి పొందిన చర్యగల కలుపు తీసే మందు అని చదువుకోగలరు. అదికాకపొతే “బాగా పనిచేసే” అన్న మాట తట్టక అనువాదకుడు/రాలు/యంత్రమయితే అది విశ్రుత వాడి ఉండాలి. అయినా చితిలో స్మృతిగా మిగిలిన అనువాద అయోజనిత విస్మృతులను “విశ్రుత చర్య” గా వెలికి తీశారంటే ఖచ్చితంగా గూగుల్ అనువాద యంత్రమే అయి ఉండాలి. అంతమాత్రం చేత మనుషులకు ఇలాంటి పంటికింద ఇనుప గోళాలు తయారు చేసే శక్తి, అధికారం, జ్ఞానం, హక్కు లేవని అనుకోకూడదు.

ఈ స్వీప్ పవర్ ఒక లీటర్ పరగడుపునే తాగితే తప్ప-
“ఎంపిక చేయబడని సురక్షిత కలుపు నాశిని”
అర్థం కాదు. కలుపు మొక్కలు నాశనం కావడానికి ఈ మందు చల్లితే, అసలు మొక్కలకు/పంటకు ఎలాంటి నష్టం ఉండదు- అన్నది చెప్పలేక ఇలా అఘోరించినట్లుంది. ప్రకటనలో ఉన్న ఎంపిక చేయబడని మాటను తెలిసే వాడి ఉంటే- ఏ కలుపు మొక్కనూ ఈ విశ్రుత చర్య ఎప్పటికీ నాశనం చేయలేదు. కలుపు మొక్కలు సురక్షితంగా అలాగే ఉండి రైతు నాశనమయిపోతాడు. ప్రకటన రాసిందెవరో? చేసిందెవరో? చూసిందెవరో? వేసిందెవరో? అర్థమేమిటో? ఇలాంటి ప్రకటనల కలుపు మొక్కలను విస్తృతంగా, విశ్రుతంగా నాశనం చేయడానికి ఎంత స్వీప్ పవర్ కావాలో? ఈ కలుపు మొక్కలను ఎప్పటికీ తొలగించలేం. ఎంపికచేయబడని సురక్షిత సర్వ నాశిని ఇది!

ప్రతి ఆర్డర్ తో ఉచిత తాగుడు
——————-
“రుచికరమయిన తాగుడు చాక్లెట్
ప్రతి ఆర్డర్ తో ఉచిత కొబ్బరి కప్పు
చాలా రుచికరమయినది”
ఇది కరిగించి ద్రవంగా అందుబాటులో ఉంచిన మరో అనువాద ఇనుప రసం. తెలుగులో “తాగుడు” మాట అర్థం దేనికి స్థిరపడిందో ఇక్కడ అనువాద యంత్రానికి తెలియదు. తెలిసే అవకాశమూ లేదు. డ్రింకింగ్ చాక్లెట్ అంటే తాగుడు చాక్లెట్ అని మక్కికి మక్కి దించింది. ప్రతి ఆర్డర్ తో రుచికరమయిన కొబ్బరి చిప్ప చేతికి ఇస్తున్నారు కాబట్టి ఆకలయితే ఆ చిప్పను కొరికి తినవచ్చు. కొరకగా ఇంకా చిప్ప చిప్పగానే మిగిలి ఉంటే అడుక్కుతినవచ్చు. ఇంకా మిగిలితే కడిగి ఇంటికి తీసుకెళ్లి చిప్ప కాఫీ తాగడానికి ఉపయోగించుకోవచ్చు.
కాఫీ చిప్ప!
చిప్ప కాఫీ!
చిప్ప కూడు!

మహిళకు అవమాన ప్రకటన
————————-
“ఆమె ఆడుతుంది
మీరు జరుపుకోండి”
అని మహిళా క్రికెట్ పోటీల హోర్డింగ్స్ తెలుగు నగరాలు, పట్టణాల నిండా వెలిశాయి.

దీనికి మూలమైన ఇంగ్లిష్ హోర్డింగ్ లో
“She plays
You win”
అని ఉంది. వారు ఆడుతుంటే ప్రేక్షకులుగా మనం గెలుస్తామని కవి హృదయం. కవితాత్మక వ్యక్తీకరణ కాబట్టి పరోక్షంగానే ఉంటుంది. అప్పుడది తెలుగులో-

“ఆమె ఆడుతుంది
మీరు గెలుస్తారు”

“ఆడేది ఆమె
గెలిచేది మీరు”

“ఆట ఆమెది
గెలుపు మీది”

అని సహజమైన తెలుగులో రకరకాలుగా చెప్పవచ్చు.

మధ్యలో జరుపుకోవడం ఏమిటో?
బహుశా-
“ఆమె ఆడుతుంది
విజయోత్సవాలు మీరు జరుపుకోండి”
అన్నది రాయబోయి ఏదో ప్రధానమైన మాటను మరచిపోయినట్లున్నారు.

నిజంగానే ఏమి మరచిపోకుండా ఉన్నది ఉన్నట్లు అనువాదం చేసి ఉంటే-
రాసినవారికి మనమీద అంతులేని పగ, ప్రతీకారాలున్నట్లే భావించాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముంగిట్లో ఈ హోర్డింగ్ కు ఆ రెండు లైన్లు రాసినవారు…తప్పు దిద్దుకుని…సవరించి ఏమి జరుపుకోవాలో! ఎందుకు జరుపుకోవాలో! ఎవరు జరుపుకోవాలో! ఎప్పుడు జరుపుకోవాలో! ఎన్ని అడుగులు జరుపుకోవాలో! జరుగుబాటు లేనివారు జరుపుకోవాలంటే ఏమి చేయాలో! స్పష్టంగా చెబితే బాగుంటుంది!

పాత కాల్గేట్ యాడ్ లో అందమయిన తెలుగు
——————–
ఇప్పుడు అరవై ఏళ్లు వెనక్కు వెళదాం. కాల్గేట్ టూత్ పేస్ట్ ఒక పత్రికలో ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో తెలుగు ఎంత అందంగా, హుందాగా, చక్కని వాక్యాలతో ఉందో చూడండి. నిజానికి కాల్గేట్ అమెరికా కంపెనీ. 150 ఏళ్ల చరిత్ర దానిది. ఇది కూడా ఖచ్చితంగా అనువాదమే అయి ఉంటుంది. అయినా ఎక్కడా అక్షర, అన్వయ దోషాల్లేవు. సూటిగా, స్పష్టంగా ఉంది. నోటినుండి దుర్వాసన రాకుండా, దంతక్షయం కాకుండా కాల్గేట్ పేస్టుతో పళ్లు తోముకోండి. ఒక్కసారి తోముకుంటే నోటిలో సూక్ష్మ క్రిములను 85 శాతం వరకు పోగొడుతుంది. పళ్లను మెరుస్తూ ఉండేలా చేస్తుంది. కాల్గేట్ ఇవన్నీ చేస్తుందో చేయదో తెలియదు కానీ- ప్రకటనలో భాష, భావం మాత్రం మనసు దోచేస్తోంది.

పాఠకులుగా మనమిప్పుడు ఎంపికచేయబడని విశ్రుత కలుపు మొక్కలం అనుకుని యాడ్ ఏజెన్సీలు మనపై భాష నాశిని మందులు చల్లుతున్నాయి. చిప్పల్లో మర్యాదలేని భాషతో అరుచికరమయిన కాఫీలు పోస్తున్నాయి. దాంతో గంజాయి వనాల మధ్య అక్కడక్కడా భయం భయంగా పెరుగుతున్న తులసి మొక్కలు కూడా మాడి మసై పోతున్నాయి… -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions