షరతులు వర్తిస్తాయి… సినిమా పేరు… నో, షరతులేమీ అక్కర్లేదు, చూడొచ్చు… కొన్నాళ్లుగా దర్శకుడు కుమారస్వామి అలియాస్ అక్షర ప్రమోషన్ వర్క్ డిఫరెంటుగా జరిపాడు… ఒక్కో పాటను ఒక్కో సెలబ్రిటీతో రిలీజ్ చేస్తూ, సినిమా మీద ఆసక్తిని పెంచాడు… మంచి టేస్టున్న పాటలు రాయించుకున్నాడు… సోషల్ మీడియాలో ఎప్పుడూ సినిమా ప్రస్తావన ఉండేలా జాగ్రత్తపడ్డాడు… అయితే…
సినిమా రిలీజు తేదీని మార్చుకుని ఉంటే బాగుండేదేమో… రెండూ తెలంగాణ కనిపించే సినిమాలే… ఒకటి రజాకార్, రెండు షరతులు వర్తిస్తాయి… రజాకార్ నాటి తెలంగాణ దుస్థితిని కళ్లకు కడితే, షరతులు వర్తిస్తాయి ప్రస్తుత తెలంగాణ సమాజం స్థితిగతులు… నిజానికి రెండూ తెలంగాణకే పరిమితం కావు… రజాకార్, హైదరాబాద్ స్టేట్ ఇష్యూ మొత్తం దేశానిది… షరతులు వర్తిస్తాయి సినిమా ఈ దేశంలోని సగటు మధ్యతరగతి జీవితానిది…
ప్రేక్షకుల దృష్టి రజాకార్ మీదికే అధికంగా వెళ్తుంది… ఆ సినిమా మీద సాగుతున్న రచ్చ, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఎట్సెట్రా అందరి దృష్టినీ అటు డైవర్ట్ చేసింది… సరే, షరతులు వర్తిస్తాయి సినిమా దర్శకుడి గురించిన కథనాలు, ప్రోత్సహించే పోస్టులు కూడా చాలా కనిపించాయి… ఐతే లారీ క్లీనరా, సింగరేణి వర్కరా, నర్సింగ్ ఆఫీసరా, ఇప్పుడు డైరెక్టరా అనేది తన వ్యక్తిగతం… సినిమా చూసే ప్రేక్షకుడు అవి దృష్టిలో పెట్టుకుని రాడు… వాడికి సినిమా కనెక్ట్ కావాలి…
Ads
ఈ దిశలో దర్శకుడు దాదాపు సక్సెసయ్యాడు… ఎందుకంటే..? ఈ సినిమా మధ్యతరగతి ఆశలు, అవసరాల నడుమ ఆరాటానిది… మన సొసైటీలో మనం ఎప్పుడూ చూసేదే… మధ్యతరగతి ఆశల్ని మాయతో సొమ్ముచేసుకునే చెయిన్ సిస్టమ్స్ ఎన్నో చూశాం… అలాంటి ఓ రియల్ కథను దర్శకుడు తనదైన శైలిలో తెర మీద ఆవిష్కరించాడు… హీరో చైతన్య మెప్పించాడు, తోడుగా కన్నడ నటి భూమిశెట్టి కూడా ఒప్పించింది… ఎక్కడా సగటు తెలుగు సినిమా కమర్షియల్ దుర్వాసనలేమీ లేవు సినిమాలో… వెగటు పాటలు, వెకిలి సీన్ల జోలికే పోలేదు… ఫెయిర్ అండ్ స్ట్రెయిట్…
సినిమా కథ ఎక్కడా పక్కదోవ పట్టదు… తెలంగాణ అనగానే తాగుడు చూపించేసి, అదే తెలంగాణ కల్చర్ అన్నట్టుగా చూపించారు కొందరు దర్శకులు ఈమధ్య… తెలంగాణ కల్చర్ ఏమిటో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు… ప్రత్యేకించి పన్నెండు గుంజాల పాటలో… అయితే పాటల్ని వేర్వేరు రచయితలతో బాగానే రాయించుకున్నా పన్నెండు గుంజాల పాట బాగా వచ్చింది తప్ప మిగతావి ఇంత ఇంప్రెసివ్‌గా ఏమీ లేవు…
కథను నిజాయితీగా తెరకెక్కించిన తీరు మాత్రం కనిపిస్తుంది… ఉత్తర తెలంగాణ లొకేషన్లు బాగున్నయ్… క్లైమాక్స్ సీన్లు ఇంకాస్త జాగ్రత్తగా రాసుకుని ఉండొచ్చు అనిపించింది… అలాగే పెద్దింటి డైలాగ్స్ బాగున్నయ్, కానీ మరీ అందరికీ హీరో హితబోధలు చేస్తున్నట్టు రాసిన డైలాగ్స్ కాస్త ఆడ్‌గా ఉన్నయ్… ఓవరాల్‌గా ఎంచక్కా ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి చూడొచ్చు… అశ్లీలం, అసభ్యతలకు తావివ్వని క్లీన్ సినిమా, మన జీవితాల సినిమా… రెగ్యులర్ తెలుగు సినిమా ట్రాక్‌లో పడకుండా సాగే సినిమా…
Share this Article