కృష్ణమూర్తి గారు ఈ రోజు గుర్తొస్తున్నారు అందుకే ఈ పాత ఆర్టికల్ మళ్లీ …. Moving tales of Telangana…
………………………………
రిటైరైపోయాడు… ఇరవయ్యేళ్ల క్రితం.
Ads
ఊపిరి సలపని ఉద్యోగం నుంచి విముక్తి.
పిల్లలు సెటిలైపోయారు.
ఎమ్మార్వో పని గనుక ఏ లోటూ లేదు.
సొంత ఇల్లు. నెల చివరి వారం
గడవడం ఎలా అనే బాధల్లేవు. మానసికమైన ఒంటరితనం మాత్రం పేరుకుపోతోంది.
తలుపు తట్టినట్టయింది.
పెద్దాయన దేవులపల్లి కృష్ణమూర్తి లేచి,
తలుపు తీసి, గుమ్మంలో నిలుచుని చూస్తే, జీవితానుభవం పలకరించింది.
‘ నేను లేనూ ‘ అంటూ కలం కాగితం చేతికిచ్చింది.
ఆ క్షణంలోనే ఒంటరితనం నీరై పారిపోయింది. కృష్ణమూర్తి కథగా మారిపోయాడు.
తెలంగాణ కథల కొమ్మలతో ఊగే తంగేడు చెట్టుగా విరబూశాడు. మాజీ తాశీల్దారు తెలంగాణ జీవనరాగాన్ని పొందికైన అక్షరాలుగా గుదిగుచ్చే రచయితగా వికసించాడు. పరిణతి చెందిన రచనలని ఈ తరానికి కానుకగా ఇచ్చాడు.
*** *** ***
ఒక ఉదయమో, సాయంకాలమో…
20 ఏళ్ల క్రితమేమో… చడీచప్పుడు లేకుండా, చాపకింద చల్లని బీరులా వచ్చాడు…
ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసుకి.
‘దేవులపల్లి కృష్ణమూర్తి’ని అన్నాడు.
‘ కూర్చోండి ‘ అన్నాడు మోహన్. 2017 లో మోహన్ చనిపోయేదాకా, అలా మాతో కలిసి ఆ కుర్చీలో కూర్చునే ఉన్నారు కృష్ణమూర్తి!
నిజమైన స్నేహం అది.
బతికిన క్షణాలవి.
తొలి పెగ్గులో – మంచి పుస్తకాలు,
సాహిత్యం కబుర్లు…
రెండో పెగ్గులో – కొత్త కథలు, నవలలపై విసుర్లు, వెటకారాలు …
మూడో పెగ్గులో – అలనాటి అపురూప సాహిత్యాన్ని, మహా రచయితలనీ ఇష్టంగా తలుచుకోవడం…
నువ్వు గొప్పోడివి మోహన్ అంటే,
మీకేం కథలు భలే రాస్తున్నారుగా అని మోహన్… పొగుడుకోవడం… నవ్వుకోవడం –
అక్కడ మందు నిషా కాదు, మిష!
నెపం తాగుడు మీదికి నెట్టేస్తే – అవన్నీ లిటరల్ గా… లిరికల్ లిటరరీ గేదరింగ్స్.
దాశరథి రంగాచార్య, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, శీలా వీర్రాజు, కాళోజి, జ్వాలాముఖి, నగ్నముని, మక్ధూమ్, భాగ్య రెడ్డి వర్మ… ఇలా ఎందరెందరి రచనలో, కవిత్వాలో…
ఒక్కోసారి పతంజలి, తల్లావఝుల శివాజీ, గోరటి వెంకన్న, శిఖామణి, జి ఎస్ రామ్మోహన్, ఖదీర్ బాబు, సూరాడ ప్రసాద్ మా పార్టీలో చేరే వాళ్ళు. నల్గొండ టీమ్ వేముల ఎల్లయ్య, ఆర్టిస్ట్ శంకర్, టీచర్ తిప్పర్తి వెంకన్న ఎలాగూ ఉండే వారు.
అవి సాహిత్యం గుబాళించిన సాయంకాలాలు.
*** *** ***
1940 జూన్ 14న నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, అనంతారంలో పుటుక్కున తెగిపోయే నూలు దారాల పద్మశాలీల కుటుంబంలో జన్మించాడు. దేవులపల్లి వారంటే సద్బ్రాహ్మలేమోనని కొత్తలో భ్రమించాను.
బీసీలని తెలిశాక వీజీగా తీసుకున్నాను. అనగా రిలాక్స్ కావడం అన్నమాట.
కృష్ణమూర్తి గారికి క్రాంతి, కిరణ్ – ఇద్దరబ్బాయిలు. కూతురి పేరు కవిత. నకిరేకల్ కే చెందిన ఆయన భార్య కమల, ఆమె ఇంటి పేరు ‘ చిక్కు ‘. మూడు నాలుగుసార్లు నకిరేకల్ వెళ్ళాం మోహన్, నేనూ. విజయవాడ నించి వస్తూ, ఖమ్మం నించి కారులో వస్తూ కృష్ణమూర్తికి ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళం.
దాదాపు ఎకరం స్థలంలో, ఒక మూల చెట్ల నీడల్లో ఓ మధ్యతరగతి ఇల్లు. పద్ధతిగా, ప్రశాంతంగా, నీట్ గా ఉంటుంది.
కమల, కృష్ణమూర్తి తర్వాత, ఆ ఇంట్లో మేజర్ ఎట్రాక్షన్ ఆయన లైబ్రరీ.
అందంగా పేర్చిన వందల పుస్తకాలు.
రిటైరవ్వడం అంటే ఆయనకు లగ్జరీ కామోసు. పుస్తకాలన్నిటికీ శ్రద్ధగా అట్టలు వేసుకున్నారు. కొన్నిటి మీద పుస్తకం, రచయితల పేర్లు రాసి ఉన్నాయి.
కళ్ళు చెదిరే కలెక్షన్ అది. పుస్తకాన్ని దొంగిలించాలని పెద్దలు ఎందుకన్నారో ఇక్కడ అర్థం అవుతుంది.
ఒక గోడకి వైకుంఠం పెయింటింగ్ – ఒరిజినల్.
మరోవైపు ఏలే లక్ష్మణ్ రంగుల బొమ్మల ఫ్రేమ్.
ఇటు చూస్తే లక్ష్మగౌడ్ కలల చిత్రం.
మూడు కథా సంకలనాలు, మూడు నవలలూ రాశారు కృష్ణమూర్తి. ‘ నా యాత్ర ‘ అని ఒక యాత్రా కథనమూ తెచ్చారు. 80 కథలు దాకా రాసిన రచయితగానే అందరికీ తెలుసు. ఆయన ఆర్టిస్ట్ అని మాత్రం అతి కొద్దిమందికే తెలుసు. ఆర్ట్ కలక్టర్ కూడా. పెన్సిల్ తో, ఇండియన్ ఇంకుతో ఆయన వేసిన బొమ్మలు చూశాను. శ్రద్ధ పెట్టి ఉంటే
ఎం. ఎఫ్. హుస్సేన్ కాకపోయినా, నల్గొండ హుస్సేనన్నా అయి ఉండేవాడు. కె. సి. డే, సైగల్, సిహెచ్ ఆత్మ లాంటివాళ్ళ పాత పాటలు వింటూండేవాడు. చదవడం – రాయడం – పాటలు – బొమ్మలు – పుస్తకాలు అచ్చేయించడం – బాగా బిజీ…
ఇంకెక్కడి ఒంటరితనం!
అయితే 83 ఏళ్ల వయసుతో పాటు కొద్దిపాటి అనారోగ్యం కూడా కృష్ణమూర్తిని కమ్ముకుంది.
*** *** ***
ఎవరన్నా సరుకున్న రచయితో, ఆర్టిస్టో అయితే కృష్ణమూర్తే వెళ్లి కలుస్తారు. మాటలతోనే మిత్రుడైపోతాడు. కృష్ణమూర్తి హైదరాబాద్ వస్తే ఒక టైట్ షెడ్యూల్ ఉండేది. కాండ్రేగుల నాగేశ్వరరావు, ఏలే లక్ష్మణ్, కొందరు దమ్మున్న రచయితలని కలుసుకునీ, మాట్లాడీ, చివరికి మోహన్ ఆఫీస్ కి చేరుకునేవాడు.
రాత్రి లేటయితే నిద్రపోయి, పొద్దున్నే టీ, కబుర్లూ ముగించి, హేపీగా వెళ్ళిపోయేది!
*** *** ***
పుస్తకాలు కొనుక్కోడం, బస్సుల్లోనే తిరగడం, నడవగలిగితే నడవడం, విసుగూ, విశ్రాంతీ లేకుండా తిరిగే ఓపిక… ముచ్చట వేసే క్రమశిక్షణ ఆయనది. భేషజాలు, ఓవర్ యాక్షన్ లేని down to earth మానవుడు. పది పదిహేనేళ్ల క్రితంలా ఇప్పుడు తిరగలేడు. చూపు తగ్గింది. తెలంగాణలో పేద, బడుగు, దిగువ మధ్యతరగతి, సంచార జీవుల బతుకుల్ని నిశితంగా చూసి, అధ్యయనం చేసి…
ఒక విషాదగీతిక లాంటి ఆ నేరేటివ్ ని మనల్ని వెన్నాడే కథలుగా మలిచిన – ఆ చూపు తగ్గుతోందంటే మనసు చివుక్కుమనింది.
*** *** ***
దేవులపల్లి కృష్ణమూర్తి కథలు చదువుతుంటే కొన్నిసార్లు మహీధర రామ్మోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు లాంటివాళ్ళ రచనలు గుర్తొస్తాయి. అంతే నిరపేక్షగా, రాగద్వేష భావరహితంగా
ఒక డాక్యుమెంటరీలా కథని నడిపిస్తాడు.
నునులేత ఆకుల మీంచి తొలి కిరణాలు తొంగి చూడడమూ, పిండారబోసిన వెన్నెల తెలినవ్వుల పిలుపూ… లాంటి ఊరించే వర్ణనలకి అస్సలు పాల్పడడు. మానసికోద్వేగాన్ని అదుపు చేసుకోగలిగే పరిణతి ఆయనది.
ప్రజల నోటిమాట పాటియై ధరజెల్లు … అనుకున్నాడేమో! జీవితాన్ని సుఖవంతం చేయని సౌందర్యం ఎందుకనుకున్నాడేమో! నిస్సారమైన బతుకుని ఉన్నది ఉన్నట్టుగా, అలా పొడిగా రాయడంలోనే ఒక బిగువైన అల్లికతో, జనజీవన చిత్రణే లక్ష్యంగా కృష్ణమూర్తి రచన సాగిపోతుంది.
వూగించే ఉపన్యాసాలు, హోరెత్తించే నినాదాలు ఉండనే ఉండవు. ఊరవతల, చెట్లకావల నీరింకిన కళ్ళతో నీడల్లా తిరుగాడుతున్న మనుషులున్న గుడిసెల ముందు కెమెరా ఫిక్స్ చేసి, సత్యజిత్ రే లాగో, మృణాల్ సేన్ లాగో తాపీగా నడుచుకుంటూ వెళిపోతాడు దేవులపల్లి కృష్ణమూర్తి.
ఆ దీన జనజీవన చిత్రమే కథ.
పూట గడవని పేదవాడి చరిత్ర.
*** *** ***
అందరూ మర్చిపోయిన గతకాలపు కమ్యూనిస్ట్ నాయకుడు, కథా రచయిత ఆవుల పిచ్చయ్య చిరునామా కోసం కృష్ణమూర్తి పడిన కష్టం అంతాఇంతా కాదు. పిచ్చయ్య మనవడి సాయంతో ఆయన ఫొటో కోసం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేసినంత పని చేశాడు. సాధించాక… ‘ ఆవుల పిచ్చయ్య దొరికిండు ‘ అని ఒక ఉద్వేగభరితమైన కథ రాశాడు. అది చదవడమే ఆయనపై తొలిప్రేమ. పెన్సిల్ తో పిచ్చయ్య పోర్ట్రైట్ వేశారు కృష్ణమూర్తి.
*** *** ***
2017 ఆగస్టులో, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆర్టిస్ట్ మోహన్ సంతాప సభ జరిపాను. హైదరాబాద్ లోని కవులు, రచయితలు, ఆర్టిస్టులు, జర్నలిస్టులూ తరలివచ్చారు.
“నేనూ వస్తున్నా” అని ముందే చెప్పారు కృష్ణమూర్తి.
నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే మోసం, దగా గురించి ఒక నవల రాశారాయన.
పేరు ‘ మూడుముక్కలాట ‘. దాన్ని గబగబా అచ్చు వేయించి మోహన్ సభ రోజుకి తీసుకుని వచ్చారు. “కనిపించకుండా పోయిన మోహన్ కు” అని
ఆ పుస్తకం అంకితం యిచ్చారు కృష్ణమూర్తి.
ఆ నవల్లో జాన్ ఖాన్ అనే అతన్ని తప్పుడు కేసులో ఇరికించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఖాన్ పెద్ద కూతురి భర్త యాక్సిడెంట్ లో చనిపోతాడు. నలుగురు పిల్లలతో ఆమె తల్లి దగ్గరికి వచ్చేస్తుంది. “కేసు ఇప్పట్లో తేలదు. ఖాన్ రావడం జరగదు అని వకీలు చెప్పడంతో, హైదరాబాదులో ఇంటి కిరాయి కట్టలేక జాన్ ఖాన్ భార్య, బిడ్డను, చిన్న కొడుకుని తీసుకుని నల్గొండ చేరింది.” అనే వాక్యంతో ముగుస్తుంది నవల. ఆ తర్వాత ఆమె, బిడ్డలూ ఎంత దుర్భరంగా బతికి ఉంటారో మనం ఊహించుకోగలం.
*** *** ***
ఊరువాడ బతుకు, కథలగూడు, బయటి గుడిసెలు, తారుమారు, యక్షగానం, మా యాత్ర… ఆయన పుస్తకాల పేర్లివి. కృష్ణమూర్తి లాగే straight గా, simple గా వుంటాయి.
ఆయన perfect family man (of course unlike Manoj Bajpai). మా చెల్లెళ్లు శకుంతల, సరళ, శుభ – వాళ్ళ పిల్లలు దీక్షిత, దివ్య, వంశీప్రియ – కృష్ణమూర్తి గారికి మంచి స్నేహితులు. వాళ్లతో కలిసి కబుర్లు కొట్టేవాడు. మా ఆవిడ నళిని బాగా తెలుసు. ఫోన్లో కూడా పలకరిస్తుంటాడు. వాళ్లందరికీ దేవులపల్లి కృష్ణమూర్తి అంటే ఒక తండ్రి లాగా, ఒక పెద్దనాన్న లాగా. వీళ్లంతా ఇష్టపడే మోహన్ కోసం నవ్వుతూ వచ్చే ఒక వెండిమబ్బు లాగా. దూరంగా పంట చేలల్లోంచి వినవచ్చే ఒక జానపద గీతం లాగా…
*** *** ***
ఇప్పుడేం చేస్తున్నారు? అని ఆ మధ్య పలకరిస్తే, “కథలు రాస్తున్నాను” అని చెప్పారు.
శ్రీశ్రీ ‘ అవతలి గట్టుకు ‘ కవితలో ఏడు పాదాలనీ, ఏడు కథలకి శీర్షికలుగా పెట్టి రాస్తున్నారు.
శ్రీశ్రీ కవిత ‘ అవతలి గట్టుకు ‘ (1934)
ఇవేమిటీ వింత భయాలు
ఇంట్లో చీకటి
ఇవేమిటీ అపశ్వరాలు?
తెగింది తీగ
అవేమిటా రంగుల నీడలు
చావూ బతుకూ
ఎచటికి పోతావీరాత్రి?
అవతలిగట్టుకు.
*** *** ***
అపారమైన జ్ఞానోత్సుకతతో తపించే నిత్య సాహిత్య అధ్యయనశీలి కథల కృష్ణమూర్తి గారికి శుభాకాంక్షలు.
*
కబుర్లు చెప్పి, కృష్ణమూర్తి గార్ని నవ్వించి,
నాలుగు పుస్తకాలు తెచ్చేసుకుందాం!
– TADI PRAKASH 9704541559
(కృష్ణమూర్తి గారు అడగ్గానే బాపు వేసి ఇచ్చిన బొమ్మ ఇది. ఊరు, వాడా, బతుకు చదివానని నచ్చిందని బాపు ఉత్తరం రాశారు)
Share this Article