కేరళలో ఆర్‌ఎల్‌వి రామకృష్ణన్ అనే దళిత మోహినీయాట్టం కళాకారుడని చిన్నబుచ్చుతూ సత్యభామ జూనియర్ చేసిన ద్వేష వ్యాఖ్యల గురించి చెప్పుకున్నాం కదా… ఇదేమో తమిళనాడులోని వివాదం… ఇది కర్నాటక సంగీతం గురించి… ఈ వివాదం ఆ సంగీత పరంపరలో ధిక్కారిగా పేరొందిన టీఎం కృష్ణకు సంబంధించింది…
పెద్దగా మీడియా ఫోకస్ చేయడం లేదు, తెలుగు మీడియాకు అసలు ఇలాంటి వాటిపై అసలు ఆసక్తే ఉండదు, కానీ తమిళనాడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నయ్… కృష్ణకు మద్దతుగా, వ్యతిరేకంగా నెటిజనం చీలిపోయారు… మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కర్నాటక సంగీత విద్యాంసుడు కృష్ణకు ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడంతో మొదలైంది ఓ రచ్చ…
ఈ అవార్డు ప్రకటనను సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు… కర్నాటక సంగీతంలో అపసవ్య పోకడలకు పాల్పడే కృష్ణకు ఆ అవార్డు ఇవ్వడం ఏమిటనేది వాళ్ల రుసరుస… మ్యూజిక్ అకాడమీ నిర్ణయాన్ని నిరసిస్తూ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో విదుషీ సిస్టర్స్ గా పేరొందిన రంజని, గాయత్రి తాము అకాడమీ సభని బహిష్కరిస్తున్నామని, ఆ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వబోవడం లేదని ప్రకటించారు.
Ads
ప్రముఖ హరికథా కళాకారుడు దుష్యంత్ శ్రీధర్ వంటి వారు చేరారు. వైణిక విద్వాంసుడు చిత్రవీణ రవికిరణ్ తనకి 2017లో వచ్చిన అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. గ్రామీ అవార్డు గ్రహీత ఒకాయన కూడా ఈ నిరసనల జాబితాలో చేరాడు… వీళ్లెవరూ కృష్ణలో సంగీత ప్రతిభ లేదని అనడం లేదు… వచ్చిన ఇష్యూ తన సోషల్ ధోరణుల మీద, సంప్రదాయవాదం మీద…
ఈ 48 ఏళ్ల తోడూర్ మాడభూషి కృష్ణ తెలుగు రూట్స్ ఉన్న కుటుంబంలో పుట్టాడు… న 12వ ఏట నుండే కర్ణాటక సంగీతంలో ప్రదర్శనలు ఇస్తున్నాడు… ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని తీవ్రంగా ద్వేషించి, నిరసించి, దాని మీద పోరాడిన పెరియార్ భావజాల సమర్ధకుడు… పెరియార్ చేసిన సాంఘిక కృషి మీద ఓ పాట కూడా రాశాడు… తను సంగీత విద్వాంసుడే కాదు, ఓ రచయిత, ఓ యాక్టివిస్టు… హిందూ ధర్మం మీద, అయోధ్య మీద, రాముడి మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద కూడా కర్నాటక సంగీత ప్రపంచం నుండి ఎన్నో విమర్శలు వచ్చాయి…
తన విమర్శ ఏమిటంటే..? సంగీతం ఇంక్లూజివ్‌గా ఉండాలి, కానీ కర్నాటక సంగీత వాతావరణంలో బ్రాహ్మణ ఆధిపత్యవాదం ఎక్కువ, అందుకే అన్ని వర్గాల ప్రజలనీ కలుపుకుపోవడం లేదని..! సాధారణంగా కర్నాటక సంగీత పితామహుడు అంటారు కదా త్యాగరాజును… తన మీద కూడా వ్యాఖ్యలు చేశాడు కృష్ణ… ‘‘త్యాగరాజు కంపోజిషన్‌కి అనుగుణంగా పాడుతుంటే రోమాంచితమైన అనుభవం అవుతుంది, కానీ త్యాగరాజు కృతులు ఆయన కంపొజిషన్ స్థాయిలో వుండవు, కంపోజిషన్‌కి అనుగుణంగా పాడినప్పుడు కొన్ని గీతాల భావార్ధం ధ్వంసమవుతుంది, ముక్కలు ముక్కలుగా పాడాల్సి వస్తుంది… అంతేకాదు, త్యాగరాజు కృతులలో కుల, జెండర్ ఆధిపత్య ధోరణులున్నాయి…’’ అంటాడు తను… వామ్మో, అంతటి త్యాగరాజునే విమర్శిస్తావా అనేది సంప్రదాయవాదుల ఆగ్రహం…
Share this Article