దీపాదాస్ మున్షీ… సగటు బెంగాలీ మహిళలు పెట్టుకునే పెద్ద బొట్టుతో నిండుగా కనిపించే కాంగ్రెస్ మహిళా నాయకురాలు… గత డిసెంబరు నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి… స్వరాష్ట్రం బెంగాల్… తాజాగా వార్త ఏమిటంటే..? ఆమె అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది, పార్టీ ప్రతి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటోంది, నామినేటెడ్ పదవుల్లోనూ కండిషన్లు పెడుతోంది, అభ్యర్థుల ఎంపికలోనూ ప్రమేయం ఉంటోంది, పార్టీ చేరికల్లో తొలి కండువా ఆమే వేస్తోంది… దీంతో పార్టీ లీడర్లు నారాజ్ అవుతున్నారు… ఇదీ ఓ వార్త సారాంశం…
అంటే ఏమిటి..? గాంధీభవన్ నుంచి ఓ గవర్నర్‌గా వ్యవహరిస్తోంది అన్నట్టు..! సరే, కొంత ఉత్సాహం, జోక్యం, చురుకుగా పాత్ర సరే… అలా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టించుకుంటారు మరి..? ఎప్పుడూ తెర మీద కనిపిస్తూ ఉండాలి కదా… నిజమేమిటి..?
Ads
చాలామంది సీనియర్లను రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జులుగా నియమించడం కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లో పరిపాటే… ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో అధినేత కుటుంబ సభ్యులే మొత్తం వ్యవహారాల్ని చూసుకుంటూ ఉంటారు… మరి జాతీయ పార్టీల ఇన్‌చార్జులు ఏం చేయాలి..? ఏమీ లేదు పెద్దగా… అప్పుడప్పుడూ ఆ రాష్ట్రాలకు వెళ్లాలి, పార్టీ ముఖ్యులను కలవాలి… రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో హైకమాండ్‌కు రిపోర్ట్ చేయాలి…
వైఎస్ హయాంలో పార్టీ ఇన్‌చార్జులే స్వయంగా ఢిల్లీకి సూట్‌కేసులు మోసుకుపోయేవారనీ, అందులో కొంత దాచుకునేవారనీ ఆరోపణలు ఉండేవి… సరే, అదంతా పార్టీ అంతర్గత యవ్వారం… దాన్ని వదిలేస్తే నిజానికి తెలంగాణ మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలకు కర్నాటక డీకే శివకుమారే ఇన్‌చార్జి… పాత అహ్మద్ పటేల్ పాత్ర పోషిస్తున్నాడు ఆయన ఇప్పుడు… తను చెప్పిందే జరుగుతుంది… లేదంటే రాహుల్ కోర్ కమిటీ అభిప్రాయాలు, సునీల్ కనుగోలు వంటి స్ట్రాటజిస్టు ఒపీనియన్స్, సర్వే రిపోర్టులు గట్రా ప్రభావం చూపిస్తుంటాయి… అంతే…
రేవంత్ తరహా వేరు… తనకు రాహుల్‌తోనే నేరుగా సంబంధం… ఎఐసీసీలు, సీడబ్ల్యూసీలు సమావేశం అవుతుంటాయి, ఏదో చర్చిస్తుంటాయి, వాటి దారి వాటిది… సరే, ఈ గాంధీభవన్ గవర్నర్ విషయానికొద్దాం… Dramatics లో పీజీ చేసిన 63 ఏళ్ల ఈ గోల్డ్ మెడలిస్ట్ చాన్నాళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్… బెంగాల్ ఎమ్మెల్యేగా, తరువాత ఎంపీగా గెలిచి, ఓ టరమ్ కేంద్ర మంత్రిగా కూడా చేసింది… కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు…
ఆమె గురించి ప్రస్తావన వచ్చినప్పుడు… ఆమె భర్తకు సంబంధించిన ఓ పాథటిక్ స్టోరీ గుర్తొస్తుంది… ఆయన పేరు ప్రియరంజన్ దాస్ మున్షీ… ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిరిర్‌బందర్‌లో పుట్టాడు… (ఇప్పుడది దినాజ్‌పూర్)… బెంగాల్ కాంగ్రెస్‌కు సంబంధించిన సీనియర్ నాయకుడే… ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రిగా ఉన్నాడు… కానీ డయాబిటీస్, బీపీలతో బాధపడేవాడు… ఓసారి తన పూర్వీకుల ఊరు కాళియాగంజ్‌లో దుర్గాపూజ చేసుకున్నాక స్ట్రోక్… పక్షవాతం… 2008లో…!
ప్రాణముందీ అంటే ఉంది అన్నట్టుగా… ఎయిమ్స్‌లో చేర్చారు, తరువాత ఢిల్లీలోనే అపోలోలో చేర్చారు… సేమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీదే బతుకు… 2009లో Düsseldorf తరలించి, stem cell therapy చేయించారు… ప్చ్, ఫలితం లేదు… అదే సంవత్సరం ఆయన భార్య తన రాజకీయ వారసత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది… తరువాత కొన్నాళ్లకే లాభం లేదు, మీ ఇంటికి తీసుకెళ్లండి అన్నారు అపోలో డాక్టర్లు… ఇంటికి తీసుకెళ్లిన ఆయన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లోనే కొనసాగిస్తూ 2017 దాకా చూసుకున్నారు కుటుంబసభ్యులు… స్ట్రోక్ తరువాత తొమ్మిదేళ్లు కోమాలో ఉండి, చివరకు 72 బర్త్‌డే జరుపుకున్న వెంటనే ప్రాణాలు వదిలాడు…!
Share this Article