ఆయ్ఁ ఎన్నికల వేళ కావాలని దురుద్దేశంతో ఈడీల్ని, సీబీఐల్ని ఉసిగొల్పుతారా..? ఎంత దుర్మార్గం..? మోడీ, నీ పని సరి… ఏమనుకుంటున్నావో… అన్నట్టుగా బోలెడు ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి మోడీ ప్రత్యర్థి క్యాంపుల నుంచి… ప్రత్యేకించి శుద్దపూసల్లాగా బయటికి కనిపించే మార్క్సిస్టుల నుంచి మరీనూ…
పేరుకు ఇండి కూటమి అంటారు… మిగతాచోట్ల పొత్తు అట, కేరళలో చిత్తు అట… అన్నట్టు పినరై విజయన్ బిడ్డ మీద ఈడీ కేసు నమోదు చేసింది కదా… ఇంకేముంది..? అందరూ ఆ పాట అందుకున్నారు, రాజకీయ కక్ష అంటూ..! నిజానికి ఆయన బిడ్డ వీణ విజయన్ మీద కేసు ఇప్పటిది కాదు… ఆయన గారి ఎర్ర చొక్కా మీద పాత మరకే ఇది…
బెంగుళూరులో ఓ సొంత కంపెనీ పెట్టిన ఆమెకు కేరళలోని ఓ సంస్థ ఏ సేవలూ పొందకుండానే 1.72 కోట్లు చెల్లించిందనేది ఆరోపణ… కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ విభాగం గతంలోనే దర్యాప్తు ప్రారంభించింది… అబ్బే, అనవసరంగా బురద జల్లుతున్నారు, నా భార్య రిటైర్‌మెంట్ డబ్బుతో నా బిడ్డ కంపెనీ పెట్టుకుంది అన్నాడు పినరై విజయన్ అసెంబ్లీలోనే..!
Ads
ఆ దర్యాప్తు నిలిపేయాలని సదరు కంపెనీ క్వాష్ పిటిషన్ వేస్తే బెంగుళూరు హైకోర్టు ఈమధ్యే తోసిపుచ్చింది… దాంతో ఈడీ కేసు నమోదు చేసింది… అసలు పినరై బంధుప్రీతి మీద చాలా ఆరోపణలున్నయ్, ఇతరత్రా కూడా..! ఆమధ్య బిడ్డ వీణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు రియాజ్ పెళ్లి జరిగింది… ఇద్దరికీ రెండో పెళ్లే… తరువాత ఎమ్మెల్యే టికెట్టు, సీనియర్లను కాదని అల్లుడిని ఏకంగా కేబినెట్‌లోకే తీసుకున్నాడు… (కట్నం అన్నమాట…)
అంతేనా..? అల్లుడి కోసం అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న శైలజ టీచర్‌ను పక్కన పెట్టేశారు… అంతెందుకు..? సీఎంవోలోని ఓ ఉన్నతాధికారితో బంధం పెట్టుకున్న స్వప్నా సురేష్ అనే మహిళ ఏకంగా దుబయ్ నుంచి ‘విదేశాంగ పార్శిళ్ల’ ద్వారా బంగారం స్మగ్లింగ్ చేసింది… ఆ కేసు ఇంకా అలాగే ఉంది… అవినీతి బురదకు పినరై ఆఫీసు ఏమీ అతీతం కాదు…
కేజ్రీవాల్ మద్యం కుంభకోణం పాతదే… కవిత అరెస్టు కూడా ఆ స్కాంలోనిదే… హేమంత్ సోరెన్ అరెస్టు కేసు కూడా పాతదే… ఇప్పటికిప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన కేసేమీ కాదు… డీఎంకే కనిమొళి, మాజీ మంత్రి రాజాలపై ఉన్న టూజీ స్కాం కూడా చాలా చాలా పాతది… కాకపోతే ఇన్నాళ్లూ సైలెంటుగా ఉండి మళ్లీ ఇప్పుడు ఆ కేసుకు ప్రాణం పోయడం మాత్రం కాస్త పొలిటికల్ టచ్ ఉన్నదే… కానీ అది అవసరమైన కేసే…
గోవా ఆప్ అధ్యక్షుడికి సమన్లు, ఢిల్లీ నేత ఇంట్లో సోదాలు, ఆప్ పాలిత పంజాబ్‌లో కీలకాధికారుల ఇళ్లల్లో సోదాలు కూడా మద్యం కుంభకోణానికి లింక్ ఉన్నవే… ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత హరక్ సింగ్‌కు సమన్లు కూడా ఓ పాత కేసు బాపతే… సరిగ్గా లోకసభ ఎన్నికల వేళ ఇవన్నీ ముదురుతున్నాయనేది నిజమే… కానీ వీటిల్లో ఏవీ కొత్తగా పెట్టిన కేసులైతే కాదు… పొలిటికలా, ఎన్నికల వేళ సాధింపులా అనే చర్చ వదిలేస్తే… ఈ కేసుల్లో ఉన్నవాళ్లెవరూ శుద్ధపూసలు కాదు, పోనీ, ఇలాగైనా సరే జనానికి వాళ్ల నిజస్వరూపాలు తెలుస్తున్నాయి కదా…!!
Share this Article