Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మల్టీస్టారర్..! యండమూరి, యర్రంశెట్టి ఉమ్మడి కథ… కొంగుచాటు కృష్ణుడు…

March 28, 2024 by M S R

తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పెద్ద పేరు Veerendranath Yandamoori…   విశేషంగా అనిపించింది ఏమిటంటే… ఆయన, తన సమకాలీనుడు యర్రంశెట్టి శాయి కలిసి రాసిన కథ ఇది… అనగా తెలుగు పుస్తక ప్రపంచంలో ఓ మల్టీస్టారర్ అన్నమాట… మరీ విశేషం ఏమిటంటే… ఎవరెవరి పుస్తకాల్నో, మరేవో భాషల్లో తన పేర్ల మీద అచ్చేయించుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, తన ఫేస్ బుక్ వాల్ మీద ఈ పుస్తకంలోని కొంతభాగాన్ని పోస్ట్ చేసి, సేల్స్ ప్రమోట్ చేయడం, పుస్తకంపైనే నిజాయితీగా సహరచయిత పేరు పేర్కొనడం… గుడ్… పోస్టు బాగుందీ, పోస్టు స్పిరిటూ బాగుంది… ఇదుగో ఆ పోస్టు…



ఈ పుస్తకంలో యర్రంశెట్టి శాయి వ్రాసిన పార్టు:

“శివశివా! అలా అనకు నాయనా. నేను నిజంగానే మన్మథుడను.”

“అలాగా! అయితే నాకేమిటి నమ్మకం?”

Ads

ఓ క్షణం కళ్ళు మూసుకుని చేయి పైకెత్తి పిడికిటి లో౦చి గాలిలోకి చేయి ఎత్తి “ఓం” అని అరిచి గులాబ్ జామ్ తెచ్చాడు.

దాన్ని తీసుకుని తిని “ఇది మా పి.సి. సర్కార్ జూనియర్ కూడా చేస్తాడు. పోతే గులాబ్ జామ్ లో ఇంగువ వెయ్యటం మొదటి సారి చూసాను” అన్నాడు.

రతీదేవి మొగుడి వైపు జాలిగా చూసింది. మదనుడికి పిచ్చెక్కి, టేబుల్ మీదున్న అట్టపెట్టె మూత తెరిచాడు. అందులో అంతకు ముందు రోజే రాధ కొన్న సిల్క్ చీర ఉంది. కళ్ళు మూసుకుని పెట్టెను మూసి గాలిలో పైకెత్తి “ఓం. క్రీం. భ్రీం” అని మూత తెరిస్తే లోపల చీర మాయమయి దాని స్థానంలో నాలుగు రాళ్ళు కనిపించాయి.

సాత్వికరావు చిరాకుపడి, “ఇవన్నీ మా రైళ్ళూ, పోస్టల్ డైపార్ట్‌మెంట్లవాళ్ళూ చేస్తారయ్యా. పార్సిల్లో ఏం పెట్టి పంపినా, అందే సరికి రాళ్ళే వస్తాయి” అన్నాడు.

“పది సెకండ్లలో నా చీర తిరిగి వెనక్కి పెట్టెలోకి రాకపోతే మీ ఇద్దరి నాలుగు కాళ్ళూ విరగ్గొడతాను” అంది రాధ.

“అలాగా, ఇప్పుడు చూడు” అంటూ మరుడు గాలిలోకి చేయి లేపాడు. మరుక్షణంలో రాధ, సాత్వికరావు చిరిగిన బట్టలతో ఓ రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద మురికి గుంటలో నిలబడి ఉన్నారు.

“చూశారా! క్షణాల్లో మిమ్మల్ని అడుక్కు తినేవాళ్ళుగా మార్చేశాను” అన్నాడు నవ్వుతూ.

రాధకు నవ్వాలో, ఏడవాలో తెలీలేదు. “ఇదేం బ్రహ్మ విద్యా? మా దేశంలో ఇలాంటి ట్రిక్ చేయటానికి ఏ రాజకీయ నాయకుడూ చాలు. ఒకప్పటి రౌడీలే కదా ఇప్పుడు చెరువులు కబ్జా చేసి కాలేజీలూ, యూనివర్సిటీలు కట్టిన నాయకులు. అభం శుభం తెలియని గిరిజనులతో సంతకాలు పెట్టించుకుని వారిని బజారున పడేయటం లేదూ?”.

మన్మథుడు ఉడికిపోయాడు. “ఇలా అన్నిటికీ అన్నీ చెప్తే ఎలా? దేవుడన్నాక కొంచెం నమ్మకముండాలి” అన్నాడు బుంగమూతి పెట్టి.

సాత్వికరావు జాలిగా నవ్వాడు. “సరే! పోనీ ఓ పని చేద్దాం. నేను కొన్ని పరీక్షలు పెడతాను. నువ్వు వాటిలో విజయం సాధిస్తే మీరు నిజం దేవతలని ఒప్పుకుంటాను”.

“ఎలాంటి పరీక్షయినా పెట్టుకో. నేను రెడీ” అన్నాడు మన్మథుడు.

“మా అన్నయ్య కూతురికి ఏదైనా మంచి స్కూల్లో ఎల్.కె.జి. సీట్ ఇప్పించు చూద్దాం!”

“అహ్హహ్హ. అమాయకుడా. మాకు ఇదొక లెఖ్ఖా? క్షణాలో చేస్తాం” అంటూ మాయమైపోయి గంట సేపటి తరువాత తిరిగి ప్రత్యక్షమయ్యారు.

“ఈ ఒక్కటీ కొంచెం కష్టంగా ఉంది. ఇంకోటేదైనా అడుగు” ఇబ్బందిగా అన్నాడు.

“ఆల్‌రైట్. నా స్కూటర్ మీద నగరంలో ఓ రౌండ్ కొట్టిరా” అన్నాడు.

మన్మద్ ఆశ్చర్యపోయి”మరీ ఇంత తేలిక పరీక్షా? ఇంకేదైనా కష్టమయినది అడుగు. పర్లేదు” అన్నాడు జాలిగా.

“ఈ చిన్నది చాల్లెండి” అంటూ స్కూటర్ తాళం చేతులిచ్చాడు. భార్య చూస్తూ ఉండగా, స్కూటర్ మీద రివ్వుమంటూ వెళ్లి రెండు నిముషాలయినా అవ్వక ముందే స్కూటరు ఆటోలో వేసుకొని కుంటుతూ తిరిగి వచ్చాడు.

“ఆటోవాడు కొట్టేశాడు. అబ్బా. ఈ కాలికేదో అయినట్లుంది” అన్నాడు బాధగా. “ఇది కాకుండా ఇంకేదైనా చెప్పు.”

“అయితే ఓ పని చెయ్. ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి ఈ దెబ్బలకు ఉచితంగా కట్లు కట్టించుకుని రా”

“అదెంత పని. ఇప్పుడే వస్తాను. చూస్కో” అంటూ వెళ్ళిపోయాడు. గంట, రెండు గంటలయినా అతను రాకపోయేసరికి రతీదేవికి భయం వేసింది. “ఏమిటింకా మా ఆయన రాలేదు. మీరు పెట్టిన పరీక్షలో తిరకాసేమీ లేదు కదా?” అడిగింది.

“ఎందుకయినా మంచిది. ఓసారి వెళ్ళి చూద్దాం పదండి” అన్నాడు సాత్వికరావు. అందరూ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి వాతావరణం చూసేసరికి ఆ దేవతకి ఏడుపొచ్చేసింది.

“చూడు నాయనా సాత్వికరావూ. తెలీక ఈ పాడు పరీక్షలకు ఆయన ఒప్పుకున్నాడు. నీ తల్లి లాంటిదానిని. ఎలాగయినా ఆయన్ని కాపాడు నాయనా” అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ.

ముగ్గురూ కలిసి అన్ని వార్డులూ వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ‘…ఫలానా పేషెంట్‌ని ఎక్కడయినా చూశారా’ అంటూ డాక్టర్లనూ, నర్సులనూ బ్రతిమాలారు. “అతని దగ్గర డబ్బులుంటే మొహం గుర్తుంటుంది. బేవార్స్ కేసయితే గుర్తుండదు” అన్నారు వార్డుబాయ్స్.

చివరకు ఓ కుర్రాడు వాళ్ళ అవస్థ చూసి జాలిపడి, “ఆయన శవం మార్చురీలో ఉంటుంది. వెళ్ళండి” అన్నాడు.

“అంటే ఆ… ఆయన చనిపోయాడా?” నిశ్చేష్టుడయి అడిగాడు సాత్వికరావు. రతి నుదుటి వైపు జాలిగా చూసింది రాధ.

“రద్దీ మరీ ఎక్కువయితే, ఎలాగు చావబోయే ఇన్సూరెన్స్ లేని ఇన్‌-పేషెంట్స్‌ని శవాల గదిలోకి మార్చి, కొత్త వాళ్ళకి ఆ బెడ్ ఇస్తారు. త్వరగా వెళ్ళండి. డెడ్ బాడీ అయినా దొరుకుతుంది. లేకపోతే దాన్ని కూడా దక్కనీయవు ఎలుకలు.”

అందరూ మార్చురీకి పరిగెత్తి మన్మథుడిని వెతికి బయటకు వచ్చారు. ఊపిరి ఇంకా ఉంది. “నీ పరీక్షలు నేను నెగ్గలేను. నా వల్ల కాదయ్యా. ” అన్నాడు నీరసంగా.

yandamuri

“అఖ్ఖర్లేదు స్వామీ. మీరు సాక్షాత్తూ దేవుడే. మాకింకేమీ సందేహం లేదు” అన్నారు సాత్వికరావు, రాధ సాష్టాంగపడుతూ. “ఈ హాస్పిటల్లో చేరటమే కాకుండా, శవాల గదిలోకి వెళ్ళి బయటకు ప్రాణాలతో రావటం మానవులకు సాధ్యమయ్యే పని కాదు స్వామీ. ఇది కేవలం భగవంతుడికే సాధ్యం” అంది రాధ.

“నువ్వూ రాధా ఎలాంటి గొడవలూ, కలతలూ లేకుండా ఆనందంగా. ఆదర్శజంట గా గడపాలని మా కోరిక నాయనా. అందుకే ప్రత్యక్షమయ్యాము” అన్నాడు చిరునవ్వుతో.

ఆ మాట వినగానే సాత్వికరావుకి రాధ మీద మళ్ళీ కోపం వచ్చేసింది. “దీంతో సంసారం చేయటం నాకిష్టం లేదు స్వామీ. తప్పు చేసినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోదు” అన్నాడు.

“ఏం? ఎందుకు ఒప్పుకోవాలి?” అని రతీదేవి వైపు తిరిగి, “మీరు దివ్యదృష్టితో చూసి చెప్పండి. నేను నిప్పా? తప్పా?” అంది.

రతీమన్మథులు మళ్ళీ ఇద్దరి మధ్యకు వచ్చారు. “ఇదిగో చూడండి! మీ ఇద్దరూ కొద్ది నిముషాలు మీ పోరాటం ఆపితే నేను ఓ ఉపాయం చెప్తాను” అన్నాడు మనసిజుడు.

“ఏమిటది?” ఇద్దరూ జంటగా అడిగారు.

“మీ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి నమ్మకం లేదు. భార్య ఇంట్లో పడే శ్రమ గురించి భర్తకీ, భర్త ఆఫీస్‌లో పడే పాట్లు భార్యకూ తెలీదు. భర్త బ్యాంకులో ప్రేమాయణం సాగిస్తున్నాడని భార్య, భార్య హోటల్ దగ్గరేదో వ్యవహారం నడిపిస్తోందని భర్తా అనుమాన పడుతున్నారు. అపోహలు తొలిగి ఇద్దరి మనసులూ నిర్మలంగా అవాలంటే ఇద్దరి ఆత్మలూ మార్చుకోవాలి.”

ఇద్దరికీ ఈ ఆలోచన చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. “ఓకే.అన్నాడు సాత్విక్. “నేనూ ఒప్పుకుంటున్నాను” అంది రాధ.

“అయితే ఇద్దరూ ఇలా నా ఎదురుగా కూర్చోండి” నేల మీద కూర్చుంటూ అన్నాడు మన్మద్.

“ఇంక కళ్ళు తెరవండి నాయనా” అంది రతి.

ఇద్దరూ కళ్ళు తెరిచి ఉలికిపాటుతో లేచి నిలబడ్డారు. తనకు ప్యాంటూ షర్టూ పోయి చీరా జాకెట్టూ; ఇంకా కొన్నిపోయి కొన్ని రావటం చూసి సాత్వికరావు నిశ్చేష్టుడయ్యాడు. ఆత్మల మార్పిడి అంటే మరీ ఇంత పచ్చిగా ఉంటు౦దని అనుకోలేదు.

తనని తాను చూసుకుని రాధ కిలకిల నవ్వేసి, “నాకంతా గిలిగిలిగా ఉంది బాబూ” అంది సిగ్గుతో ముఖం కప్పుకొని.

“మేమిక వెళ్తున్నాము భక్తా. 24 గంటల తరువాత మళ్ళీ ఎవరి ఆత్మలు వారికి మారతాయి. ఆ తరువాత మీ సంసారం మూడు పువ్వులూ ఆరుకాయలుగా సాగిపోతుంది. ఈ రాత్రికి కక్కుర్తిపడి కడుపు కాయ కాయకుండా చూసుకోండి. అప్పుడిక తిరిగి మార్చటం ఎవరి చేతుల్లోనూ ఉండదు” అన్నాడు.

(call 8558899478 for this book)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions