Sai Vamshi….. (ప్రముఖ రచయిత, జర్నలిస్టు కాకర్లపూడి నరసింహ యోగ(కేఎన్‌వై) పతంజలి గారి జయంతి. ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు ఇవి..)
* రచయిత కాలేనివాడు మంచి పాత్రికేయుడు కాలేడు. A good Journalist must be a good Prose Writer. జొనాథన్ స్విఫ్ట్, మార్క్ ట్వెయిన్, ఆరుద్ర, శ్రీశ్రీ, గోరా శాస్తి.. మంచి రచయితలు మంచి News Men అయ్యారు.
* నా బండ బుద్ధికి అది అన్యాయం అని తోస్తేనూ, అది ఘోరం అనిపిస్తేనూ, అది పరమ అధర్మం అనిపిస్తేనూ రాసేస్తాను. నాకు ఎందుగురించైనా ఏడుపొస్తే కూడా నాకు ఏదైనా రాయాలని అనిపిస్తుంది. నాకు సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా రాయబుద్ధి అవుతుంది. రాత అనేది నా స్వంత వ్యవహారం. అందుకనే నేను ఏ రచయితల సంఘాల్లోనూ ఎప్పుడూ చేరలేదు.
* Of all the things written, that which was written with Blood is Pure and Beautiful అని నమ్ముతాను. For Blood is spirit and the spirit is truth గనుక.
* చెడ్డను వెక్కిరిస్తే, ప్రశ్నిస్తే నాకు సంతోషం కలుగుతుంది. అన్యాయాన్ని రచ్చకీడిస్తే నాకు సంతోషం కలుగుతుంది. రాజుగారినో సర్కారునో పొగిడితే ఎంతమాత్రం ఆనందం కలగదు.
* ఎవరి ప్రభావం లేకుండా ఏ రచయితా ఉండడు. నాపై రావిశాస్త్రి ప్రభావం ఉంది. డికెన్స్‌పై షేక్స్‌పియర్ ప్రభావం ఉంది. చాసో కథలపై మొపాసా ప్రభావం ఉంది. మొపాసాపై బాల్జాక్ ప్రభావం ఉంటుంది. అది తప్పేం కాదు. ఎవరి వల్లా ప్రభావితం కాని వాడు కళాకారుడు కాదు.
* తెలంగాణ ప్రజలకు తగిలినన్ని గాయాలు ఎవరికీ తగలలేదు. ఇక్కడి మట్టిలోంచి ఇంకా మరెన్నో గొప్ప రచనలు రావాలి. అందుకు మరింత తెగువ, పెంకితనం, ధైర్యం కావాలి. తమ భాషనీ, ఆచార వ్యవహారాలనీ కాపాడుకునేలా వాటిని సాహిత్యంలో ప్రతిఫలింపజేయాలి.
* తెలుగు నేల మీద సాహిత్యం కానిదే ఎక్కువగా సాహిత్యంగా ప్రచారంలోకి వచ్చింది. అలా రావడానికి ఎవర్నీ తప్పు పట్టాల్సిన పని లేదు. యండమూరి వీరేంద్రనాథ్‌కి వచ్చిన పేరు గురజాడ అప్పారావుకు రాలేదంటే ఏం చెప్తాం? పేరు వేరు, యశస్సు వేరు. పుస్తకాలు అచ్చేసుకోవడం, వాటిని పట్టుకుని అందరి చుట్టూ తిరగడం నా వల్ల కాదు.
* చచ్చు పడిన ప్రాంతాల నుంచి ఏమీ రావు. Bleeding Area తెలంగాణ నుంచే గొప్ప సాహిత్యం వస్తుంది. ఇక్కడున్నంత జానపద సాహిత్యం మరెక్కడా లేదు. ఇక్కడి ప్రజల జీవితాల్లో సజీవ సాహిత్యం ఉంది. ఇక్కడి జానపద గేయ సంపదే అందుకు సాక్ష్యం.
* ఇప్పుడు రాయడం ఒక గొప్పతనం కాదు. ఒక బాధ్యత. బాగా రాయడం ఇంకా పెద్ద బాధ్యత. అదీ గొప్పతనం కాదు. కోయిల అన్నాక తియ్యగా పాడక చస్తుందా? కాకిని పట్టుకుని నీకు కమ్యూనిజం మీద ప్రేముంటే మనోహరంగా పాడు అని అడగటం మన తప్పు కానీ పాడలేకపోవడం కాకి తప్పు కాదు.
* నాకు ప్రజలంటే ఇష్టం. కానీ నిస్సిగ్గయిన ఊరేగింపులంటే అసహ్యం. ఏ కారణం వల్లనో ఆంధ్రప్రదేశ్‌లో ఊరేగింపుల సరదా ఎక్కువ. పెళ్లాన్ని ప్రేమించడం కూడా ఓ ఉద్యమంలా చెప్పుకుంటారు. ఇది వెర్రితనం.
Share this Article