ఈమధ్యకాలంలో కాస్త చదివించిన స్టోరీ ఇది… ఫరా ఖాన్ తెలుసు కదా… బాలీవుడ్, కోలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డాన్సర్ బహుముఖ ప్రజ్ఞ… జాతీయ అవార్డు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు గట్రా బోలెడు… మాతృత్వం వైపు తన ప్రయాణంలోని అడ్డంకుల్ని ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకుంది.,.
ఇప్పుడామె వయస్సు 59… తన సంతానం ముచ్చట 2008 నాటిది… అంటే 15, 16 ఏళ్ల క్రితం సంగతి… అంటే అప్పుడామె దాదాపు 43 ఏళ్లు… సాధారణంగా ఆ వయస్సులో గర్భం, ప్రసవం కాస్త కష్టమనే చెబుతారు డాక్టర్లు… కానీ స్కానింగ్ తీసినప్పుడు ఆమెకు ఏకంగా ముగ్గురు శిశువులు కడుపులో పెరుగుతున్నారని గమనించారు డాక్టర్లు… అదే విషయం ఆమెకు చెప్పారు…
భర్త శిరీష్ కుందర్ (మూవీ ఎడిటర్, ప్రొడ్యూసర్)… కృత్రిమ గర్భధారణ ద్వారానే గర్భం సాధ్యమైంది… ఎప్పుడైతే ముగ్గురు పిల్లలు (ఇద్దరు అంటే కవలలు, ముగ్గురు అంటే ఇంగ్లిషులో ట్రిప్లెట్ అంటాం, తెలుగులో ఏమంటాం..?) అని తెలిసిందో వెంటనే సహజ ప్రసవం, ఒకరికన్నా ఎక్కువ పిల్లలయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పుస్తకాలు చదవడం ఆరంభించింది ఆమె… ముగ్గురికీ ఏమేం పేర్లు పెట్టాలో కూడా బాగా సెర్చ్ చేసి సెలక్ట్ చేసి పెట్టుకున్నారు…
Ads
మామూలుగా కవలలు అయితేనే డాక్టర్లు చాలా జాగ్రత్తలు చెబుతారు… ఇక్కడ ముగ్గురు… పైగా ఆమె డాన్సర్… ఆమె బాడీ మూమెంట్స్ ఎక్కువ వృత్తిలో… కానీ డాక్టర్లు ఎక్కువగా ఎగరొద్దు వంటి జాగ్రత్తలు చెప్పారు… అంతేకాదు, ఓ చేదు వార్తను చెప్పారు ఆమెకు… ఐవీఎఫ్ గర్భం, అదీ ఓ వయస్సు దాటిన తరువాత, పైగా ముగ్గురు… ఆ మురిపెం జంటకు బాగుంది… కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే… ‘‘ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, అన్నీ సాఫీగా జరిగితే వోకే, కానీ నలభై దాటిన తరువాత పుట్టే ముగ్గురు పిల్లలు కదా, ఎంతైనా కొంత కష్టమే…’’
‘‘రిస్క్ దేనికి, ఒక శిశువును తగ్గించుకో… ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా చాలా చిన్న సైజులో, తక్కువ బరువుతో పుడితే కష్టం…’’ అన్నారు… కానీ ఆ ముగ్గురిలో ఒక్కరినీ వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు… ఎవరిని బతికించుకోవాలి, ఎవరిని చంపుకోవాలి… ఆమె తల్లి హృదయం ససేమిరా అంది… నో డాక్టర్, ఏదయితే అది జరగనీ, ముగ్గురినీ మోస్తాను, ముగ్గురినీ కంటాను అని చెప్పింది… డాక్టర్లు ఏదో నచ్చజెప్పబోయి, ఆమె మొండిగా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో ఇక మాట్లాడలేదు…
‘‘ఒక్కో శిశువు ఏ బరువుతో పుడితే సేఫ్ నాకు చెప్పండి’’ అనడిగింది ఆమె డాక్టర్లను… కనీసం రెండు కిలోలు ఉండాలన్నారు డాక్టర్లు… ‘‘అంతకుమించి బరువు ఉండేలా నేను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను’’ అందామె స్థిరంగా… జార్, అన్య, దివ… ఈ ముగ్గురు పిల్లలకూ 2008లో జన్మనిచ్చింది ఆమె… అందరూ రెండున్నర కిలోలపైనే ఉన్నారు… హాయిగా, ఏ ఆందోళనా లేకుండా 7.5 కిలోల బరువుతో స్వేచ్ఛగా తిరిగాను… అని ఆనందంగా చెబుతోంది… ఆ ముగ్గురినీ కలిపి చూసినప్పుడు… ‘‘ఈ మూడు రత్నాల్లో ఏది నాకు దక్కకుండాపోయేది..?’’ అనుకుంటూ ముగ్గురినీ తన ఒడిలోకి బలంగా అదుముకుంటుంది… తల్లి కదా..! ఆ ముగ్గురూ ప్రస్తుతం టెన్త్ క్లాస్..!!
Share this Article