లాల్ కృష్ణ అద్వానీ… వయస్సు 96 ఏళ్లు… బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు… బీజేపీని రెండు సీట్ల దారుణ స్థితి నుంచి అయోధ్య రథయాత్ర ద్వారా ప్రస్తుతం సొంత మెజారిటీతో పదేళ్లు పాలించిన స్థితికి తీసుకొచ్చిన ప్రధాన ఉత్ప్రేరకం… కర్మ ఎవరిది, ఫలితం ఎవరిది అనే చర్చ పక్కన పెడితే… ఈరోజుకూ వార్తల్లోనే ఉంటున్నాడు… తాజాగా…
ఈ దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న తనను వరించింది… తను రాష్ట్రపతిభవన్‌కు వెళ్లలేని స్థితిలో ఉంటే, ఆ పురస్కారమే తన ఇంటిదాకా వచ్చి తన మెడలో పడింది… నిజంగా అది భారతరత్నను మించిన గౌరవం… సమీపకాలంలో ఇంతటి గౌరవాన్ని మరెవరూ పొందలేదు… రాష్ట్రపతిని చేయలేదు, మోడీ తనను మూలకు పడేశాడు వంటి అనేకానేక విమర్శల నేపథ్యంలో… ఈ జీవనసంధ్యలో అద్వానీకి దక్కిన చివరి గౌరవం ఇదేనేమో ఇక…
రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు… అయితే ఒక ఫోటోను పట్టుకుని చాలామంది నెటిజనం ట్రోలింగుకు దిగారు… ‘‘అక్కడ రాష్ట్రపతికి కుర్చీ లేదు, ఆమె నిలబడి ఉంటే ప్రధాని మోడీ కూర్చుని ఉన్నాడు, ఇది ఆమెను అవమానించినట్టే…’’ వంటి వ్యాఖ్యలు బోలెడు కనిపించాయి… శివసేన వంటి విపక్ష పార్టీల ముఖ్యులు కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని షేర్ చేసుకుని మరింత ప్రచారంలోకి తీసుకొచ్చారు…
Ads
మోడీని విమర్శించడానికి బోలెడు అంశాలు దొరుకుతాయి… తనది అత్యుత్తమ పాలనేమీ కాదు,.. కానీ మోడీని సరైన కారణాలతో తిట్టడానికి బదులు ఇదుగో ఇలాంటి ఓ చాన్స్ దొరికింది కదాని ఎదురుచూస్తున్నట్టు ఒక ఫోటో చూసి దాడికి దిగారు గానీ… అక్కడ అద్వానీ, మోడీలు కూర్చున్న కుర్చీలకన్నా మంచి కుర్చీయే రాష్ట్రపతికి ఏర్పాటు చేశారు, పైగా ఆమె కార్యాలయమే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది… ఇది బీజేపీ పార్టీ కార్యక్రమం కాదు… అన్నీ పక్కా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతాయి… అద్వానీ మెడలో పతకం వేసి, చేతికి ఆ సర్టిఫికెట్ అందించడానికి మాత్రమే రాష్ట్రపతి లేచి నిల్చుంది… ఆ వీడియోను ఈ లింకులో చూడొచ్చు… (ఇండియాటుడే షేర్ చేసుకున్న ఏఎన్ఐ వీడియో బిట్ ఇది…)
https://www.facebook.com/reel/4407348889485135
ఈ ప్రదాన సమయంలో మోడీ మాత్రమే కాదు, అక్కడికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ఇతరులు కూడా కూర్చునే ఉన్నారు… రాష్ట్రపతిభవన్‌లో పౌరపురస్కారాలు ఇచ్చినప్పుడు కూడా గ్రహీతలు, రాష్ట్రపతి తప్ప ఆహుతులంగా కూర్చునే ఉంటారు… అది ప్రొటోకాల్… ఇక్కడా అదే…
మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు 2017 నుంచి 2019 వరకు ప్రెస్ సెక్రెటరీగా వ్యవహరించిన అశోక్ మాలిక్ ఏమంటాడంటే… ‘‘నేను రాజకీయ వ్యాఖ్యల జోలికి పోవడం లేదు… సరైన ప్రొటోకాల్ మాత్రమే పాటించారు… పురస్కార గ్రహీత లేచి నిలబడే పరిస్థితి లేనప్పుడు కూర్చునే ఉంటాడు, మిగతా ఆహుతులంతా కూర్చునే ఉండాలి…’’
అవును, అద్వానీ వయోరీత్యా, ఆరోగ్యరీత్యా తను రాష్ట్రపతిభవన్‌కు రాలేని స్థితి కాబట్టే తన ఇంటికి అసాధారణంగా ఆ పురస్కారం తరలివచ్చింది… తను కూర్చునే తీసుకున్నాడు… నిజానికి తన ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నట్టుంది… మనుషుల్ని గుర్తుపడుతున్నాడా అనే డౌటూ వస్తోంది… భారతరత్న అందుకుంటున్నప్పుడు కూడా ప్రత్యభివాదం ఏమీ చేయలేదు, మొహం నిర్వేదంగా ఉంది… నిర్లిప్తంగా తనకు సంబంధం లేని ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టు చూస్తున్నాడు ఆ వీడియోలో… ఈ స్థితి కారణంగానే తనను అయోధ్య కార్యక్రమం నుంచి మినహాయించినట్టున్నారు…!!
Share this Article