Yandamoori Veerendranath …. కొత్త ఎడిషన్ కి ముందుమాట వ్రాయమన్న పబ్లిషర్ కోరికపై 40 సంవత్సరాల తరువాత ‘వెన్నెల్లో ఆడపిల్ల’ మొదటిసారి చదివాను. ఇప్పుడే వ్రాయటం పూర్తీ అయ్యింది. దాన్ని మీతో పంచుకుంటాను:
36 ప్రచురణలు పూర్తయి, లక్ష కాపీలు పైగా అమ్మిన పుస్తకానికి ముందుమాట ఎందుకని కొత్త పాఠకులకు అనుమానం రావచ్చు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం టెలిఫోన్ ఎక్స్చేంజీలు ఎలా ఉండేవి? సెల్-అలారం లేని రోజుల్లో ఫోన్లో మనల్ని పొద్దున్నే ఎలా లేపేవారు? పక్క ఊరికి మాట్లాడాలని పోస్ట్ ఆఫీసుల్లో కూర్చుంటే ట్రంక్-కాల్స్ ఎంత ఆలస్యం అయ్యేవి? అర్థరాత్రి టెలిగ్రాం వస్తే ఇంట్లోవాళ్ళు ఎలా భయపడేవాళ్ళు? ‘శుభవార్తే’ అంటూ టెలిగ్రాం బంట్రోతు ఎలా కంగారు తగ్గించేవాడు… మొదలైన విషయాలన్నీ ఇప్పటి పాఠకులకు తెలియక పోవచ్చు. అందుకనే 1982 లో వ్రాసినప్పుడు ఎలా ఉందో, యధాతధంగా ఆ వివరాలేమీ మార్చకుండా, కొత్త ఎడిషనులో కూడా ఉంచడం జరిగింది.
కమ్యూనిజం భ్రమ నుంచి బయట పడుతున్న రోజులవి. ఆ సెటైర్లు కూడా ఏమీ మార్చలేదు. పొతే… వూరు, రాస్తాను, చెప్తాడు లాంటి పదాల్ని ఊరు, వ్రాస్తాను, చెపుతాడు… ఈ రకంగా గ్రాంధికం చేయడం జరిగింది. రచయితగా ఆ రోజుల్లో అంత అనుభవం లేదు కాబట్టి, చుక్కలు, ఆశ్చర్యార్థకాలు, ఎక్కువ ఉన్నాయి. ప్రథమ పురుషకీ ఉత్తమ పురుషకీ తేడా తెలియక చేసిన తప్పులు ఇందులో తొలగించడం జరిగింది. అయినా స్వచ్చమైన తెలుగు తెలియక జరిగిన పొరపాట్లు మరికొన్ని ఉండవచ్చు.
Ads
దాదాపు నలభై సంవత్సరాల తర్వాత తొలిసారి మళ్ళీ ఈ పుస్తకం చదువుతూంటే … … బాగుంది. నా పుస్తకాన్ని నేను బావుంది అనటం స్వాత్కర్ష. అయినా బావుంది. చివర్లో కళ్ళు తడి అయ్యాయి. కానీ ఒక పాఠకుడిగా ప్రాక్టికల్ గా చెప్తున్నాను. భావుకత్వమూ, కల్పన, ఊహా జనిత సౌందర్యమూ వ్రాయాలంటే రచయిత రాటుదేలి పోకూడదు. కాస్త అమాయకత్వం, కాస్త అజ్ఞానమూ ఉండాలి. అంతర్ముఖం రచయితగా (అజ్ఞానం తగ్గకపోయినా) ఈ నవల చదువుతూ ఉంటే నాకు అదే అనిపించింది.
ఈ పుస్తకం వ్రాస్తున్న సంవత్సరం (81-82), హిందీలో సరీగ్గా ‘సిల్సిలా’ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో సాహిర్ వ్రాసిన ఒక గొప్ప నేషనల్ అవార్డు పాట ఉంది. ఈ పుస్తకపు తప్పులు దిద్దుతూ ఉంటే ఆ పాట గుర్తు వచ్చింది.
“నా పాట జీవితం రెప్పపాటు. నేనొక క్షణకాలం కవిని. నాకన్నా ముందు ఎందరో వచ్చారు. కొందరు ఏడ్చారు. కొందరు పాడారు. నా తర్వాత కూడా కొందరు వస్తారు. అద్భుతమైన కవితల పూలని వెదజల్లుతారు. నాకన్నా బాగా రాస్తారు. మీ కన్నా బాగా చదువుతారు.కెరటాల్లా కదిలిపోతున్న కాలంలో నన్ను గుర్తు పెట్టుకునేటంత సమయం ఎవరికి ఉంటుంది? నేనొక రెప్పపాటు కవిని. నా పాట క్షణకాలం.”
ఇంకో నాలుగు ఎడిషన్లు పడే సమయానికి నేను ఉండకపోవచ్చు. దీని తర్వాత ఎడిషన్ని నేను దిద్దక పోవచ్చు. ఈ పుస్తకంలోనే ఒక డైలాగ్ ఉంది. “మరణం అంటే ఏమిటి? వెన్నెల జలపాతాలు, హిమబిందు సందేహాలు, లతా మంగేష్కర్ పాట… అన్నీ ఉంటాయి. మనం మాత్రం ఉండము” అని. అదేగా మరణం అంటే.
ఒక అసందర్భపు వాక్యంతో ఈ ఉపోద్ఘాతం ముగిస్తాను. పుస్తకాన్నీ, సాఫ్ట్ కాపీని స్వంతం చేసుకుని చదవండి. ఎవడో దొంగతనం చేసిన pdf ని దొంగతనంగా చదవొద్దు. – యండమూరి వీరేంద్రనాథ్.
Share this Article