బియాంత్ సింగ్ గుర్తున్నాడా..? 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని తన నివాసంలోనే కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకడు… దేశం మొత్తానికీ ఓ హంతకుడు… కానీ చాలామంది సిక్కులకు ఓ హీరో… ఎందుకు..? సిక్కుల పవిత్రస్థలి స్వర్ణదేవాలయం మీద సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆమే బాధ్యురాలు కాబట్టి… బియాంత్ సిక్కు సమాజం తరఫున ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి…
ఆ తరువాత దేశంలోని అనేకచోట్ల, ఢిల్లీ సహా వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైన విషాదం మరో కథ… ఓ మహావృక్షం నేలకూలినప్పుడు కొన్ని ప్రకంపనలు సహజమే అని అప్పట్లో రాజీవ్ గాంధీ కూడా తేలికగా కొట్టిపారేశాడు… ఇప్పుడు ఆ బియాంత్ సింగ్ ఎందుకు గుర్తొచ్చాడు అంటే… తనకు ఓ కొడుకు… పేరు సరబ్‌జిత్ సింగ్… స్కూల్ డ్రాపవుట్… కానీ బియాంత్ సింగ్ కొడుకు అనే ఓ ఐడెంటిటీ ఉందిగా…
ఇంకేముంది..? రాజకీయాల్లోకి దిగిపోయాడు… బియాంత్ కొడుకుగా తనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని అనుకున్నాడేమో… కానీ ఆశలు వేరు, రియాలిటీ వేరు… 2007లో బర్నాలా జిల్లా, భాదౌర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేశాడు.,. 15 వేల వోట్లు వచ్చాయి, అంతే… అంతకుముందు 2004లోనే ఏకంగా లోకసభకే పోటీచేశాడు భటిండా సీటులో… 1.13 లక్షల వోట్లు వచ్చాయి… తరువాత కూడా పట్టువీడని విక్రమార్కుడిలా 2009లో అక్కడి నుంచే మళ్లీ, 2014లో ఫతేఘర్ సాహెబ్ నుంచి పోటీచేశాడు… ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు…
Ads
2014 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి 3.5 కోట్లు అని ప్రకటించాడు… 2019లో బీఎస్పీ టికెట్టు తెచ్చుకుని పోటీచేశాడు… ఐనా నో యూజ్… నిజానికి వాళ్లది పొలిటికల్ ఫ్యామిలీయే… తల్లి బిమల్ కౌర్, తాత సుచా సింగ్ రోపర్, భటిండాల నుంచి ఎంపీలుగా 1989లో ఎన్నికైనవాళ్లే… (ఇందిరా గాంధీ మీద బియాంత్ సింగ్ ప్రతీకారం వాళ్లకు ఆ ఎన్నికల్లో రాజకీయంగా ఉపయోగపడినట్టే భావించాలా..? ఆ ఎఫెక్ట్ ఈ సరబ్‌జిత్‌కు తరువాత కాలంలో కొరవడిందని అనుకోవాలా..?)
ఇక ఇప్పుడు సరబ్‌జిత్ ఫరీద్‌కోట్ నుంచి ఇండిపెండెంటుగా పోటీచేస్తున్నాడు… ప్రస్తుత ఎంపీ మహమ్మద్ సాదిక్, తను కాంగ్రెస్… జూన్ ఒకటిన పంజాబ్‌లోని 13 సీట్లకు పోలింగ్ జరగబోతోంది… బీజేపీ ఓ గాయకుడు హన్సరాజ్‌ను, ఆప్ ఓ నటుడు కరమ్‌జిత్ అన్మోల్‌ను నిలబెడుతున్నాయి… ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేసినా జానేదేవ్, నేనయితే బరిలో ఉండాల్సిందేనంటున్నాడు సరబ్‌జిత్ సింగ్… సన్నాఫ్ బియాంత్ సింగ్..!! #LokSabhaElections2024, #IndiraGandhi, #Punjab, #SarabjitSingh, #Faridkot, #Congress
రిజల్ట్… అప్డేట్….. 70 వేల మెజారిటీతో గెలిచాడు…
Share this Article