ఈమధ్య ఓ ట్రెండ్ నడుస్తోంది కదా… పాత పాపులర్ సినిమాలను ఏవో టెక్నికల్ రంగుల హంగులు అద్ది.,. అనగా 4కేలు, డోల్బీలు గట్రా అన్నమాట… (నిజానికి ఒరిజినల్‌కు ఆర్టిఫిషియల్ హంగులు)… వాటిని రిలీజ్ చేయడం, అభిమానుల హంగామా, వేరే పనేమీ లేని జర్నలిస్టులు వాటి కలెక్షన్ల మీద కూడా నాలుగు పోచికోలు వార్తలు రాసుకోవడం…
ఆ పాత కంటెంటు ఏముందో అనవసరం, కటౌట్ కొత్తగా పెట్టామా, దండలు వేశామా, ఆ పాటలు రాగానే థియేటర్‌లో డాన్సులు చేశామా… అంతే… నిజానికి సినిమాల రీరిలీజు అనేది చాలా పాత అలవాటే… బోలెడు సినిమాలు తరచూ రీరిలీజ్ అవుతూనే ఉంటాయి… మొదట ఫెయిలైనవి, తరువాత సక్సెసయినవీ ఉన్నాయి… కాకపోతే అప్పట్లో నిర్మాత, థియేటర్ షేరింగు…
మరి ఇప్పుడేమో బయ్యర్లు కదా… థియేటర్లు కూడా సిండికేట్ కదా… సో, కొత్త షేరింగ్ ఒప్పందాలు, మలి విడుదలలూ… సరే, ఆ కథంతా పక్కన పెడితే… ఈ వార్తలు చూస్తుంటే ఓ వార్త ఆకర్షించింది… అదేమిటంటే..? కన్నడ ఉపేంద్ర మనకు తెలిసినవాడే కదా, తన దర్శకత్వంలో అప్పట్లో అంటే 1995లో… శివరాజకుమార్ హీరోగా ఓం అనే సినిమా వచ్చింది… అది 2015 నాటికి 550 సార్లు రీరిలీజ్ అయ్యిందట…
Ads
రికార్డే… లిమ్కా బుక్కులోనో థమ్సప్ బుక్కులోనో ఎక్కినట్టుంది కూడా… 20 ఏళ్లు… 7300 రోజులు… 550 రీ-రిలీజులు… అంటే సగటున ప్రతి రెండు వారాలకు ఓసారి రిలీజ్… అంటే రెండు వారాల్లోనే ఒక థియేటర్ నుంచి ఎత్తేయడం, మరో థియేటర్‌లో మళ్లీ మళ్లీ రిలీజు చేయడం… ఎస్, సినిమా కన్నడనాట సూపర్ హిట్… ఈరోజుకూ ఆ సినిమాను చూసే ప్రేక్షకులున్నారు, అది వేరే సంగతి… కానీ ఇటు తీసి అటు, అటు తీసి ఇటు రిలీజును ఇంత గొప్పగా చెప్పుకోవచ్చా అనేదే ఓ చిక్కు ప్రశ్న…
70 లక్షల్లో సినిమా తీశారు, అప్పట్లో అది ఎక్కువే… అది బెంగుళూరు మాఫియా బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ… అప్పట్లోనే 5 కోట్ల వసూళ్లు… అంటే ఈరోజుల్లో లెక్కేస్తే 500 కోట్లు అవుతుందేమో… నిజానికి అది కాదు ఆకర్షించిన పాయింట్… ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని 2015లో ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది… ఆ పాత సినిమాకు ఆ రేంజ్ ధర అంటే విశేషమే… మన తెలుగు చానెళ్లలో అతడు, ఖలేజా, ఖడ్గం ఎన్ని వందలసార్లు వేశారో లెక్క తెలియదు కదా ఎవరికీ… సేమ్, దీన్ని కూడా అలాగే ప్రసారం చేస్తూ ఉంటారు…
చిత్రం ఏమిటంటే..? ఇదే సినిమాను ఓంకారం పేరుతో రాజశేఖర్ హీరోగా రీమేక్ చేశాడు అదే ఉపేంద్ర… దాంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు… కన్నడనాట అంత హిట్ సినిమా, తెలుగులో బిలో యావరేజ్ రిజల్ట్… ఇదే శివరాజకుమార్‌తో ఇదే ఉపేంద్ర లాస్ట్ ఇయర్ కబ్జా అని ఓ సినిమా తీశాడు… డిజాస్టర్… అదంతే, సినిమా ఇండస్ట్రీ అంటేనే ‘అనూహ్యం’…
ఈ రికార్డుకన్నా బాగా అబ్బురపరిచేది దిల్వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా రికార్డు… ముంబైలోని మరాఠా మందిర్‌లో రిలీజైన ఈ సినిమా అక్కడే, ఆ థియేటర్‌లోనే అక్షరాలా 1009 వారాలు, అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్లు నడిచింది… నో బ్రేక్… కాకపోతే చాన్నాళ్లుగా మార్నింగ్ షో దీన్ని నడిపిస్తూ రెగ్యులర్ షోలకు వేరే సినిమాలను రిలీజ్ చేసేవాళ్లు… 2015 ఫిబ్రవరిలో చివరి షో వేసి ఇక నిలిపివేశారు (ఎన్డీటీవీ వార్త ప్రకారం)… కొత్త సినిమాల్ని నాలుగు షోలూ వేయడానికి వీలుగా… ఇప్పుడు వారంపదీ రోజుల్లోనే కలెక్షన్లు కుమ్మేసుకుంటేనే బడ్జెట్ వర్కవుట్ అవుతుంది కదా… అంతకుముందు ఇదే థియేటర్‌లో షోలే సినిమా అయిదేళ్లు నడిచిందట… బ్రేక్ లేకుండా… రాయలసీమలోని ఏదో ఓ థియేటర్‌లో ఇలాగే ఏదో బాలకృష్ణ సినిమాకు పెద్ద రికార్డే ఉన్నట్టు గుర్తు..!!
Share this Article