నిజానికి ఏ పుస్తకమైనా సరే రాస్తున్నప్పుడు రచయితకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, తన భావాల్ని తను అనుకున్న రీతిలో పొందుపరుస్తూ వెళ్లగలడు… ఏదైనా పాపులర్ పత్రికలో సీరియల్‌గా వస్తున్నప్పుడైతే సస్పెన్స్, కాసిన్ని కమర్షియల్ మసాలాలూ గట్రా చేరతాయి… కానీ దాన్ని సినిమాగా తీసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి వచ్చి, అడ్డుపడతాయి… సినిమా చూస్తుంటే అసలు ఆ పుస్తకమేనా ఈ సినిమా కథ, కథనం అనే సందేహాలు కూడా వస్తాయి కొన్నిసార్లు…
బడ్జెట్, హీరో ఇమేజీ, సంక్షిప్తత, సినిమాటిక్ ప్రజెంటేషన్, పాటలు, స్టెప్పులు, ఫైట్లు… ఇవీ ప్రభావితం చేస్తాయి… యండమూరి నవలల్నే తీసుకుంటే ఆనందోబ్రహ్మ వంటివి నవలలోని కంటెంటును అంతే భావుకతతో సినిమాను ప్రజెంట్ చేయడం కష్టం… తనవి చాలా నవలలు సినిమాలయ్యాయి… అందులో చిరంజీవివే ఎక్కువ… రాక్షసుడు, చాలెంజ్ వంటివి చిత్రాలు చూస్తుంటే ఒరిజినల్ నవలల కంటెంటుకూ సినిమాలకూ బోలెడన్ని మార్పులు, తేడాలు… చిరంజీవే నటించిన చంటబ్బాయ్ (మల్లాది రచన) సినిమా చూస్తున్నా అంతే…
నల్లంచు తెల్లచీర పుస్తకం, దొంగమొగుడు సినిమా విశేషాలపై Veerendranath Yandamoori షేర్ చేసుకున్న కొన్ని విశేషాలు కాస్త ఇంట్రస్టింగ్ అనిపించాయి… ఆ సినిమా చూస్తుంటే అసలు అది నల్లంచు తెల్లచీర నవలకు దృశ్యరూపమేనా అనిపిస్తుంది… ఆ నవలలోని బేసిక్ స్టోరీ లైన్ తీసుకుని, మిగతాదంతా సినిమా కోసం వేరే రాసుకున్నట్టు కూడా ఉంటుంది… తన పోస్టులోని కొన్ని అంశాలు ఇలా…
Ads
ఈ నవలలో ‘హీరో’ నారాయణపేట నేతగాళ్ళ కుర్రాడు. సినిమాలో హీరో చిన్నవయసులో నెత్తి మీద బట్టలు మూట పెట్టుకొని అమ్మేవాడు. చిరంజీవి కాబట్టి హీరో బాల్యం గురించి పూర్తిగా తీసేశా౦. రీ-ప్రింట్ సందర్భంగా ఇందులో నాకు నచ్చిన భాగం మీతో పంచుకోవాలని:
…
మాస్టారు ఆ కుర్రవాడి వైపు సానుభూతితో చూశాడు. నారాయణ పేట కార్మికుల హస్త నైపుణ్యాన్ని కాపిటలిస్టుల కబంధహస్తాలు కబళించినంత కాలమూ ఆ ఊరి నేతగాళ్ళు గొప్పవారయ్యే ప్రసక్తి లేదని ఆయనకి తెలుసు.
“ఒక్క చదువే కాదు. వీడు బాగా పాడతాడు కూడా. ఒరేయ్ అమ్మగారు వింటారు. ఒక పాట పాడరా” అన్నారు.
రెండోసారి అడిగించుకోకుండానే ఆ కుర్రవాడు తల దించుకుని నెమ్మదిగా పాడటం ప్రారంభించాడు. ఆ హిందీ పాట అర్థం గమ్మత్తుగా ఉంది. “వెన్నెల్లో కూర్చుని భావాన్ని నేస్తే- పాట చీర తయారైంది. జరీ పల్లవికి పొగమంచు చరణం అంచు. పై పైకి రాకు సూర్యుడా. పొద్దంటే మాకు చేదురా. కంచిపట్టు చీర ఒంటిని జారితే, కంటి చూపు చీర కట్టాలి. వేళ్ళు నేసే నేతకి – కుచ్చిళ్ళు పాడే పల్లవి. తుఫాను రేగే ముందర ముస్తాబులేల దండగ.”
మాస్టారుగారి భార్యకి అర్థంకాలేదు. పాటలోనూ, గొంతులోనూ ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించింది. అంతే మాస్టారు మాత్రం ఈ అద్భుతమైన భావానికి విస్మయం చెందారు.
“ఎవర్రాశార్రా ఈ పాటని?”
ఈ తెలంగాణా కుర్రాడు మరింత సిగ్గుతో తల వంచుకుని “నేనే మాస్టారూ” అన్నాడు. ఆయన కన్నార్పకుండా అతడి వైపు చూశాడు.
యవ్వనం తొంగి చూడటానికి ప్రయత్నిస్తున్న మొహంలో అమాయకత్వం పారిపోకుండా ఉండటానికి ఆఖరి యుద్ధం చేస్తోంది. యుద్ధం ప్రారంభించిన మొదటి సైనికుడిలా ఉంది బుగ్గ మీద చిన్న మొటిమ.
‘ఇతడి పూర్వీకులెవరో గొప్ప కవులో గాయకులో అయివుంటారు. లేకపోతే అంత భావాన్ని ఇంత చిన్న పదాల్లో ఇరికించే నేర్పు ఇంత చిన్న వయసులో ఈ కుర్రవాడికి రాదు’ అనుకున్నారాయన.
…..
Share this Article