Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పిబరే రామరసం-5 …. రామానుబంధాలు …

April 16, 2024 by M S R

ఎన్ని యుగాలైనా లోకంలో అన్నాదమ్ముల అనుబంధమంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్యాద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో తమ్ముళ్లకు రాముడిపై ఉన్న ప్రేమాభిమానాల గురించి; తమ్ముళ్లపై రాముడికి ఉన్న అపారమైన అనురాగం గురించి తెలుసుకుని తీరాలి.

దశరథుడి భార్యలు- కౌసల్య కుమారుడు రాముడు; కైకేయి కుమారుడు భరతుడు; సుమిత్ర కుమారులు లక్ష్మణ శత్రుఘ్నులు. కులగురువు వసిష్ఠుడి దగ్గర సకల శాస్త్ర, అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. విశ్వామిత్రుడు యాగరక్షణార్థం అడిగినవేళ నుండి రాముడి వెంట లక్ష్మణుడు ఉంటాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉంటాడు. ముగ్గురికీ అన్న మాటే వేదం.

పొద్దున శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం. తెల్లవారేసరికి అంతా తలకిందులు. పద్నాలుగేళ్లు అరణ్యవాసం. భరతుడికి పట్టాభిషేకం- అంటే రాముడు చెదరని చిరునవ్వుతో అలాగే అని నార చీరలు, గంప, పలుగు పార సిద్ధం చేసుకుంటూ ఉంటే… లక్ష్మణుడికి గుండె రగిలిపోయింది. “ఏం తమాషాగా ఉందా? ఈరోజు నాన్నను నిర్బంధించి…నిర్ణయించిన ముహుర్తానికే నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతా…నా కత్తికి ఎవరు అడ్డొస్తారో చూస్తా…” అని కత్తి దూస్తే…రాముడే నిగ్రహించాడు.
“నాయనా! నిన్న నాకు పట్టాభిషేకం అన్నదీ నాన్నే. ఇప్పుడు వద్దన్నదీ నాన్నే. ఇదంతా దైవ ఘటన. ఆవేశపడకు. అలా తండ్రి మీద కత్తి దూయకూడదు. పద…అరణ్యవాసానికి వెళదాం” అని రాముడే శాంతింపజేశాడు.

Ads

కైకేయి వరాలు అడిగి రాముడిని అడవులపాలు చేసిన సందర్భంలో భరతుడు ఊళ్లో లేడు. మేనమామ కేకయ దగ్గర ఉన్నాడు. వచ్చి…విషయం తెలిశాక తల్లి మీద కోప్పడతాడు. మంథర మీద కత్తి దూయబోతాడు. కౌసల్య కాళ్లమీద పడి వల వలా ఏడుస్తాడు. తండ్రి అంత్యక్రియలు కాగానే మంత్రులు, పురోహితులు సకల పరివారాన్ని తీసుకుని రాముడిని వనవాసం నుండి వెనక్కు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోవాల్సిందిగా అడగడానికి వెళతాడు.
ఈ సందర్భంలో గుహుడికి, లక్ష్మణుడికి భరతుడి మీద అనుమానం వస్తుంది. అనుకోకుండా కలిగిన రాజ్యయోగం శాశ్వతంగా ఉండాలని శ్రీరాముడిని శాశ్వతంగా లేకుండా చేయాలని ఏమయినా కుట్రతో వస్తున్నాడా? అన్నది వారి అనుమానం. అయ్యో! మా అన్నా వదిన సీతారాములు ఈ కటికనేలమీద…ఈ పచ్చి గడ్డిమీద పడుకున్నారా? అని ఏడుస్తాడు.
తండ్రి చనిపోయిన వార్త భరతుడి ద్వారా తెలుసుకున్న రాముడు బాధపడి తను ఆవేళ అడవిలో ఏమి తింటున్నాడో ఆ పదార్థంతోనే పిండప్రదానం చేసి…కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న భరతుడిని ఓదారుస్తాడు.

“అన్నా! నేను రాజ్యం అడగలేదు, అమ్మ కైకేయి అడిగినప్పుడు అక్కడ లేను . నాన్న పోయారు. అయోధ్య సింహాసనం ఖాళీగా ఉంది . వచ్చి నువ్వే ఏలుకో”- అని వినయంగా రామయ్యకు చెప్పాడు. భరతా! తండ్రి ఉన్నా, లేకున్నా మాట మాటే. రావడం కుదరదు. 14 ఏళ్లు నేనడవిలో ఉంటానన్నాడు రాముడు. అయితే నేనూ అయోధ్యకు వెళ్ళను. ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని దర్భలు పరుచుకుని మొండికేస్తాడు భరతుడు. ఇది తెగే వ్యవహారం కాదని మధ్యలో వసిష్ఠుడు కలుగజేసుకుని బంగారు పాదుకలు తెచ్చి- రామా ఒక సారి ఈ పాదుకలు తొక్కి భరతుడికివ్వు…నీ పాదుకలనే నిన్నుగా అనుకుని భరతుడు నీపేరిట రాజ్యం చేస్తాడు- అని సూచించాడు. ఈ మధ్యేమార్గం రాముడికి- భరతుడికి ఇద్దరికీ నచ్చింది. ఆ క్షణం నుండి ఏకంగా పదునాలుగేళ్లు చతుస్సాగర పర్యంత సకల మహీమండల సువిశాల రాజ్యాన్ని రామపాదుకలే పాలించాయి.
వాల్మీకి రామాయణంలో ఈ సందర్భంలో రామ- భరత సంవాదం చాలా గొప్పగా ఉంటుంది. భరతుడి వాదనతో మనం కూడా ఒకదశలో ఏకీభవిస్తాం. కానీ ధర్మానికి- ధర్మసూక్ష్మానికి ఉన్న తేడా చెప్పి రాముడు అడవిలోనే ఉండిపోతాడు. రాముడు అడవిలో ఉంటే తాను అయోధ్యలో ఎలా ఉండగలను? అనుకుని భరతుడు కూడా నారచీరలు కట్టుకుని…జుట్టుకు మర్రిపాలు పూసుకుని…జడలు కట్టుకుని…అయోధ్య అంతఃపురంలోకి కూడా వెళ్లకుండా బయట నందిగ్రామమంలో రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాముడి పేరుతోనే రాజ్యపరిరక్షణ చేశాడు.
వనవాసం చివర రాముడు హనుమను ముందు భరతుడి దగ్గరికి పంపుతాడు. పద్నాలుగేళ్లు సింహాసనం అలవాటై ఉంటే…భరతుడికే వదిలేద్దాం అన్నది రాముడి ఆలోచన. హనుమ వెళ్లేసరికి భరతుడి పక్కన పేర్చిన కట్టెలు కూడా ఉంటాయి. ఇవెందుకు? అంటే…పద్నాలుగేళ్ళకు ఒక్క ముహూర్త సమయం రాముడు రావడం ఆలస్యమైనా…నేను అన్న మాట ప్రకారం ఆత్మత్యాగం చేసుకోవడానికి అని చెబితే… హనుమంతుడి కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోతాయి. ఏమి అన్నా తమ్ముళ్ళయ్యా బాబు? ఏ లోకంలో ఎక్కడా మీలాంటివారిని చూడలేదు. అన్న రాకకు స్వాగతం ఏర్పాట్లు చెయ్ స్వామీ! అని చెబుతాడు.

రాముడు పడుకుంటే లక్ష్మణుడు కాపలా. భరతుడు పడుకుంటే శత్రుఘ్నుడు కాపలా. రాముడు గడ్డిమోపులు అందిస్తే లక్ష్మణుడు పైకెక్కి కుటీరం నిర్మించాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే….లక్ష్మణుడు నా బయటి ప్రాణం అంటాడు రాముడు.

“అన్ని వేళ్లు ఒకలా ఉండవు. అన్నదమ్ములే అయినా ఒకేలా ఎందుకుంటారు?” అని వాడుక మాట. రామ- భరత- లక్ష్మణ- శత్రుఘ్నుల శరీరాలే వేరు. వారిది ఒకే మాట. ఒకే బాట.
రాముడి తమ్ముళ్లు అని గర్వంగా చెప్పుకుంటూ అన్నను గౌరవించడమే వారి తపస్సు. తన తమ్ముళ్లను తండ్రిలా కంటికి రెప్పలా కాపాడుకోవడమే అన్నగా రాముడి కర్తవ్యం.

అన్నదమ్ములుగా; అక్కా చెల్లెళ్లుగా మనం ఎలా ఉన్నామో? ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలో? చూసుకోవాల్సిన అద్దం- రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం….  పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions