మొన్న ఓ వార్త చదివాం గుర్తుందా..? మొక్కలు బాధ కలిగినప్పుడు ఏడుస్తాయి, వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి… వాటిని ఇజ్రాయిల్ సైంటిస్టులు రికార్డు చేశారని..! అసలు మొదట్లో మనిషి చెట్లను జీవజాలంలో భాగంగానే చూడలేదు, రాళ్లురప్పల్లాగా వాటినీ భౌతిక పదార్థ సమ్మేళనాల్లాగానే చూశాడు…
వాటిలో ఉండేవీ జీవకణాలేననీ, ప్రత్యుత్పత్తి సహా బతకడానికి, విస్తరించడానికి జంతుజాలంలాగే ప్రయత్నిస్తాయనీ, చలనం తప్ప మిగతావన్నీ జంతుజాలం లక్షణాలేననీ మనిషి గుర్తించాడు… సొంతంగా ఆహారం తయారీ, ప్రతి కణానికీ శక్తి సరఫరా, వేళ్ల నుంచి తీసుకునే నీటిని, పోషకాలను ప్రతి కణానికీ చేరవేయడం, పుష్పించడం, కీటకాలను ఆకర్షించడం, పుప్పొడి, విత్తన వ్యాప్తి, కర్బన స్వీకరణ, ఆక్సిజన్ వితరణ… నిజానికి జంతుజాలంకన్నా చెట్ల గుణాలే ఒకింత బెటర్…
అవును, వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి సరే, మరి హక్కులు… ఎస్, ఉండాలి కదా… వీథికుక్కలకు కూడా పెటాలు, బ్లూక్రాస్‌లు ఉన్నప్పుడు… మానవాళికి అత్యంత శ్రేయోదాయకమైన చెట్లకు హక్కులు ఉండాలి కదా… ఇలాంటిదే ఓ కేసు ముంబై హైకోర్టుకు వచ్చింది… ఇంట్రస్టింగు…
Ads
రోహిత్ మనోహర్ జోషి అని ఓ యాక్టివిస్టు… హైకోర్టులో ఓ పిల్ దాఖాలు చేశాడు… ఆయన వాదనేమిటీ అంటే… సుందరీకరణ పేరిట చెట్లకు చిన్న చిన్న లైట్లను అలంకరణ కోసం చుట్టేస్తున్నారు… ఆ లైట్ల కారణంగా ఆయా చెట్ల సహజ జీవక్రియలు దెబ్బతింటున్నాయి… అది అన్యాయం కదా అనేది ఆయన పిల్ సారాంశం…
ఇదేదో ఇంట్రస్టింగుగా ఉందనుకున్న కోర్టు మీరైతే మీ వాదనల్ని సమర్పించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాల కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది… ఈ డెకరేటివ్ లైట్ల కారణంగా చెట్ల కిర్కేడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఆ పిల్ ముఖ్యమైన పాయింట్… కిర్కేడియన్ రిథమ్ అంటే జీవజాలానికి ఓ నిర్ణీతమైన జీవక్రియల సైకిల్ ఉంటుంది… చెట్లకు సంబంధించి కిరణజన్యసంయోగక్రియ, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం, ఆక్సిజెన్ వదలడం, సూర్యరశ్మి స్వీకరణ వంటి జీవక్రియల నిర్ణీత సైకిలే కిర్కేడియన్ రిథమ్…
ఈ కృత్రిమ లైట్ల వల్ల చెట్ల సహజ జీవక్రియలు దెబ్బతింటున్నాయనీ… అంటే చెట్ల హక్కులు, సహజన్యాయానికి దెబ్బ అనేది వాదన… మరి చెట్ల సహజ ఆరోగ్యాన్ని, జీవక్రియలు దెబ్బతినకుండా నగర సుందరీకరణ ప్రోగ్రామ్ కొనసాగించడం ఎలా..? అది తరువాత ఆలోచించవచ్చులే అనుకుని ముంబై, థానే, మీర భవందర్ కార్పొరేషన్లు కోర్టు తీర్పు వెలువడకపోయినా సరే, కోర్టు నోటీసులు అందిన వారం రోజుల్లోనే, అంటే వెంటనే ఆ ఆర్టిఫిషియల్ లైట్లను తొలగించడం ప్రారంభించారు… అంటే సదరు పిల్ ఉద్దేశాలతో ఏకీభవిస్తున్నట్టే కదా…
ఒక కోణంలో ఆలోచిస్తే… నగరాల్లో నామమాత్రంగా మిగిలిన చెట్లకు కార్పొరేషన్ నీళ్లు పోస్తున్నా సరే, ఎంత సంరక్షిస్తున్నా సరే, మరీ మొండి చెట్లు మినహా మిగతావి… మరీ ప్రత్యేకించి డివైడర్ల వద్ద, హోర్డింగులుండే చోట్ల హఠాత్తుగా ఎండిపోతుంటాయి… మరి కాలుష్యం, లైట్ల ప్రభావం అంటే మాటలా…!!
Share this Article