సొంత బిడ్డను చంపుకున్న పచ్చి కూరల పిచ్చి
వైద్య విద్యలో డిగ్రీ చేసి; ఆపై పి జి చదివి; ఇంకా లోతుగా స్పెషలైజేషన్ కోర్సు చేసి పది, పన్నెండేళ్లు రోగాలను, రోగులను చదివి చదివి…చికిత్స పద్ధతులు నేర్చుకుని…వైద్యం చేసేవారినే డాక్టర్లు అనుకోవడంలో ఏదో సంకుచితత్వం ఉన్నట్లుంది. వందల, వేల శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన వైద్యులనే అపర ధన్వంతురులని పొగడడంలో కూడా ఏదో చిన్నతనం ఉన్నట్లుంది. ఎవరికి వారు కొత్త కొత్త వైద్య విధానాలను ఆవిష్కరించే ఈ రోజుల్లో వైద్య విద్య చదవకపోయినా… డాక్టర్లకే వైద్యం చేయగలిగిన అడాక్టర్లు వీధికి పది మంది. వైద్యం సంగతి తరువాత. అసలు మనం తినే ఆహారమే విషమని; వారు చెప్పినట్లు తింటే రోగాలు లేకుండా వెయ్యేళ్లు కళకళలాడుతూ, మిసమిసలాడుతూ, చిదిమితే బుగ్గల్లో పాలుగారే నవ యవ్వనంతో బతకవచ్చని చెబుతూ ఉంటారు.
సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు ఉడికిన అన్నం తిననే తినవని, మనిషి ఒక్కడే ఉడికించి, వేయించి, కాల్చుకు తింటున్నాడని…కాబట్టి మనం కూడా పచ్చి మాంసం, పచ్చి కూరలు తినాలని ఒకడు సిద్ధాంతీకరిస్తాడు. సృష్టిలో పెద్దయ్యాక కూడా పాలు తాగేది మనిషి ఒక్కడే, ఆ పాలే సకల రోగాలకు కారణం…కాబట్టి తక్షణం పాలు, పాల పదార్థాలను మానేస్తే మనిషికి రోగాలే రావని ఒకడు ప్రామాణీకరిస్తాడు. అన్ని ఆహారాలు మానేసి పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ముప్పూటలా తింటే శ్రీకృషుడిలా 125 ఏళ్లు బతికేయవచ్చని ఒకాయన వీరలెవెల్లో ఉద్యమిస్తాడు. చిరు ధాన్యాలు తింటే చిరంజీవులుగా ఉండిపోవచ్చని ఒకాయన బయలుదేరుతాడు. అన్నం మాని పళ్లు తింటే వసిష్ఠుడిలా యుగయుగాలు బతికేయవచ్చని ఒకాయన ప్రవచిస్తాడు.
Ads
వెనకటికి పురాణాల్లో-
నీళ్లు మాత్రమే తాగుతూ తపస్సు చేసినవారు;
ఆకులు మాత్రమే తినేవారు;
చెట్టు నుండి తమంతట తామే పడ్డ కాయలు, పళ్లు, గింజలను మాత్రమే తినేవారు;
గాలినే ఆహారంగా పీల్చేవారు;
రోజులో ఒక పూట మాత్రమే తినేవారు;
వారానికి ఒకసారి మాత్రమే తినేవారు;
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తినేవారు;
చుట్టూ అగ్నుల మధ్య ఒంటికాలిమీద నిలుచుని ఉండేవారు;
కొమ్మలకు కాళ్లను కట్టుకుని తలకిందులుగా తపస్సు చేసేవారు…
ఇలా రకరకాల నియమాలతో, తదేకదీక్షతో, కఠోరమైన తపస్సు చేసినవారిగురించి కథలు కథలుగా విన్నాం. వారి తపోబలానికి భూగోళం అగ్నిగోళమైతే బ్రహ్మ భయపడి వెంటనే వచ్చి వరాలిచ్చిన కథలను ఇప్పటికీ పరవశించి పారాయణ చేస్తున్నాం. వసిష్ఠుడితో విశ్వామిత్రుడు పోటీపడి బ్రహ్మర్షి అని అనిపించుకోవడానికి మూడు విడతల్లో మొత్తం ముప్పయ్ వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి…చివరికి ఎండు పుల్లలా మారిన దశలో బ్రహ్మర్షిత్వం సాధించాడని మైమరచి చెప్పుకుంటుంటాం.
ఊరుకోండి… మరీ అతిశయం… విడ్డూరం కాకపోతే! ఒక్కోసారి వెయ్యేళ్లు, పదివేల ఏళ్లు నిరాహార తపోదీక్ష చేయడం అయ్యే పనేనా? వాల్మీకో , వ్యాసుడో రాస్తే మాత్రం మనమెలా ఒప్పుకుంటాం? అవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేవేనా? అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికీ కొంచెం అటు ఇటుగా ఆ తపోదీక్షలే చేసి అమరత్వమో, శాశ్వత నవలావణ్య సౌందర్యమో, వర్చస్సో, ఓజస్సో సాధించాలని మన నరనరాల్లో జీర్ణించుకుని బలంగా ఉంది.
మధుమేహానికి మందులక్కర్లేని ఆహారం; థైరాయిడ్ కు థైరోనార్మ్ అవసరం లేని రుచులు; రక్తపోటుకు బిళ్ళ అవసరం లేని తిండి; గుండె కవాటాలను బార్లా తెరిచే తిండిగింజలు, మోకాటి మెదడును అరికాలికి జార్చకుండా పైన తలకాయకు చేర్చే పచ్చి కూరలు; చర్మాన్ని నిగనిగలాడే కాంతిపుంజాల పవర్ ప్రాజెక్టుగా మార్చే నూనెలు; సింగరేణి నల్లబొగ్గు తెల్లబోయేలా చేసే జుట్టు కారునలుపు రంగు పులుములు; క్యాన్సర్ ను తరిమి కొట్టే దుంపలు, పిచ్చిని నియంత్రించే పచ్చి కాయలు; పైత్యాన్ని పరిధిలో ఉంచే పసర్లు- అంటూ ఎవరికి వారు జనం మెదళ్లను తెరిచి తింటున్నారు. ఒక్కో రుతువులో ఒక్కో కాన్సెప్ట్ అమ్ముడుబోతుంది. మీడియాలో కొన్ని కాన్సెప్ట్ లు వేలం వెర్రిగా ప్రచారం పొందడం వెనుక దాగి ఉన్న కోణాలు ఇక్కడ అనవసరం. సోషల్ మీడియా అందుకుంటుంది. ఇక ఆ కాన్సెప్ట్ కు ఆకాశమే హద్దు.
“ముప్పయ్యేళ్లుగా కుంటుతూ నడిచేవాడిని… ఫలానా నూనె మోకాలికి పూయగానే నేను నేనేనా అని ఆశ్చర్యపోయేలా జింకలా ఎగురుతున్నాను”.
“నేను పుట్టు గుడ్డివాడిని… ఫలానా లేపనం కంటికి నెల పూయగానే నా కంట్లో నెలరాజు పున్నమి చంద్రుడై వెలిగాడు. నా పుట్టు గుడ్డి పోయి… ఇప్పుడు లోకం గుడ్డిని చూడగలుగుతున్నాను”.
“నా నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. ఫలానా తైలం నెల పూయగానే గ్రోమోర్ ఎరువుకు పంట పైకి ఎగదన్ని ఏపుగా మోపులు మోపులు పెరిగినట్లు నా నెత్తిన ఇప్పుడు నల్లని ఒత్తైన మెత్తటి నిగనిగలాడే జుట్టే జుట్టు. వారం వారం కటింగ్ కు వెళ్లలేక చస్తున్నాను”.
“నాకు లేని రోగం లేదు. ఫలానా ఆయన చెప్పినట్లు ముప్పూటలా పాల మీగడ, వెన్న, నెయ్యి తిన్నాను. అన్నం మానేశాను.ఇప్పుడు నా కొలెస్ట్రాల్ మాయం. నా గుండె జబ్బు మాయం”.
“నేను ఇదివరకు రోజుకు మూడు సార్లు మద్యం తాగేవాడిని. రోజుకు ఇరవై సిగరెట్లు తాగేవాడిని. రోజుకు నాలుగు పూటలా నాన్ వెజ్ తినేవాడిని. గుండెలో చిన్న చిల్లు పడి పెద్దదయ్యింది. లోకంలో డాక్టర్లందరూ చేతులెత్తేశారు. అప్పుడు నాకు పెంటపాలెం ప్రకృతి ఆశ్రమం గురించి చెబితే వెళ్లాను. అక్కడ పచ్చి ఆకులు అలములు, దుంపలు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఆహారం. అన్ లిమిటెడ్. నెల రోజుల్లో నా గుండె చిల్లు దానికదే అతుకు పెట్టుకుంది. ఇప్పుడు లోకం గుండె గుభిల్లుమనేలా చేతులు కాలక ముందే అందరూ ఆకులు పట్టుకోవాలని పిలుపునిస్తున్నాను”.
ఇలాంటి ఏ శాస్త్రీయ ఆధారాలు, ప్రయోగశాలల్లో తేల్చిన రుజువులు, ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగాల అనుమతులు లేని మందులు, ఆహార విధానాల గురించి మీడియాలో లెక్కలేనన్ని ప్రకటనలు. వేల, లక్షల కోట్ల వ్యాపారం.
విరిగిన ఎముకలకు మలక్ పేట్ రైల్వే బ్రిడ్జ్ పక్కన రేకుల పెట్టెలో అతుకులు పెట్టి, సున్నప్పట్టీలు కడుతుంటే గురవారెడ్లు గుడ్లప్పగించి తదేకంగా చూస్తూ ఉండాలి.
పగిలిన గుండె పగుళ్లకు పుత్తూరు తైలం పూతలు పూస్తుంటే హార్ట్ కేర్ అంటే ఇదా! అని సోమరాజులు గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవాలి.
పచ్చి కూరలే దివ్యౌషధం అని ముప్పూటలా ప్రకృతి ఆశ్రమాలు నోళ్లల్లో టన్నుల కొద్దీ కూరలు కుక్కుతుంటే నాగేశ్వర్ రెడ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వలేక కడుపు పట్టుకోవాలి.
కంట్లో ఆకుపసరు వేస్తే ఒంట్లో కరోనా మాయమని పసర్లు చుక్కలు చుక్కలుగా పడుతుంటే ఎల్ వీ ప్రసాద్ లు కళ్లప్పగించి చూస్తూ ఉండాలి.
ఈ లేహ్యం తింటే క్యాన్సర్ మాయమని లేహ్యాలు టీ వీ ల ప్రాయోజిత కార్యక్రమాల నిండా నిండిపోతే చూడలేక నోరి దత్తాత్రేయుళ్లు టీ వీ లు కట్టేసుకోవాలి.
ఒకపక్క పరిస్థితి అలా ఉంటే… మరోపక్క ఫార్మాసురుల రక్తదాహం, కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహం, అవసరం లేకపోయినా వైద్య పరీక్షలకే వైద్యానికంటే ఎక్కువ ఖర్చు, ఆరోగ్య బీమా కంపెనీల లాభాపేక్ష, లేని పోని భయాలు సృష్టించి బతికి ఉండగా పెద్దాసుపత్రులకు వెళ్లకూడదన్నట్లు ఆరోగ్య వాతావరణాన్ని పాడుచేసి పెట్టారు. అదో విషాద గాథ. అంతులేని కథ.
సామాజిక మాధ్యమాల విజృంభణ తరువాత స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలిగిన ప్రతి ఒక్కరికీ లోకానికి ఏదో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ముక్కు మొహం తీరుగా ఉండి, నాలుగు మాటలు గలగలా మాట్లాడగలిగినవారికి సామాజిక మాధ్యమాల్లో ఆకాశమే హద్దు. లక్ష ఫాలోయర్లు, పది లక్షల వ్యూస్ వచ్చాయంటే ఇక వారు ఆడింది ఆట- పాడింది పాట. వద్దన్నా డిజిటల్ యాడ్ డబ్బులొస్తాయి. స్పాన్సర్ షిప్ లు వస్తాయి. అమాయకజనాన్ని ప్రభావితం చేయగల ఇన్ ఫ్లుయెన్సర్స్ భుజ కీర్తులు వస్తాయి. లోకంలో ఎవరూ చెప్పనిది చెప్పాలి; ఎవరూ చేయనిది చేయాలి అని వారి మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది.
అలా రష్యాలో ఒకానొక సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లు యెన్సర్ మాక్సిమ్ లైయుటీ తన వేలం వెర్రి పచ్చి కూరలు, ప్రకృతి సహజ ఆహారం సిద్ధాంతానికి ముక్కు పచ్చలారని నెలల పసికందు అయిన కొడుకును చంపుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. “పచ్చి కూరలు తింటూ, ఎండలో ఉంటే చాలు…” అన్నది ఇతడి సిద్ధాంతం. ఇక ఏ ఆహారాలు, పళ్లు, పానీయాలు అక్కర్లేదని వీడియోలు చేస్తూ సెలెబ్రిటీ అయ్యాడు. పెద్దవారు సూర్యరశ్మిని ఆహారంగా తీసుకుని ఇంకేమీ తినకుండా, తాగకుండా ఎంతకాలమైనా బతికి ఉండవచ్చని లెక్కకు మిక్కిలి వీడియోలు చేసిన మాక్సిమ్ ప్రస్తుతం జైల్లో వేళకు వండిన నూడుల్స్, వేయించిన మాంసం ముక్కలు మాక్సిమమ్ లేకపోతే ముద్ద ముట్టలేకపోతున్నాడు.
మనలో మన మాట:-
అక్కడెక్కడో రష్యాలో పచ్చి కూరల మాక్సిమ్ జైలుపాలయ్యాడన్న వార్తకు మనం ఆశ్చర్యపోతే…
ఆ లెక్కన మనదగ్గర వీధికొక మాక్సిమ్ లను పెట్టడానికి ఎన్ని జైళ్లు కావాలి?
మనం భయపడాల్సినవాటికి భయపడకపోయినప్పుడే ఆశ్చర్యం భయపడింది. మనమిప్పుడు భయపడితే ఆశ్చర్యం సిగ్గుతో తలదించుకుంటుంది…. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article