Nancharaiah Merugumala…. మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి
……………………………………………………
నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్ గఢ్ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజకవర్గం ఉందనే విషయం నాకు తెలీదు.
Ads
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ తరఫున నారా చంద్రబాబు నాయుడు అనే 28 సంవత్సరాలకు అతి సమీపంలో ఉన్న కమ్మ యువ రాజకీయ నేత చంద్రగిరి నుంచి గెలిచారనే వాస్తవం కూడా 1980 అక్టోబర్ వరకూ… గుడివాడలో ఉన్న నాకు తెలియదు. టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలోని 61 మంది జంబో కేటినెట్ లో జూనియర్ (సహాయ) మంత్రిగా చేరాకే చంద్రబాబు నాయుడు ఎవరో తెలిసింది.
ఎమ్యెల్యేగా చేసిన రెండున్నరేళ్లకే మంత్రి అయ్యారాయన. నారా వారికి ఆయన నిర్వహించిన సినిమాటోగ్రఫీ శాఖ కారణంగానే దివంగత జననేత నందమూరి తారక రామారావు గారి మూడో కూతురు భువనేశ్వరితో పెళ్లి కావడం ‘జరిగింది’ అని అప్పట్లో చెప్పుకునే వారు. ఎన్టీఆర్ తన కుమార్తెల్లో బాగా ప్రేమగా చూసుకునే భువనమ్మ అందగత్తె అయినా బొద్దుగా, కాస్త పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి ఆలస్యమైందనే ప్రచారం కూడా ఉంది.
రిటైర్డ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి కొడుకుల్లో ఒకరికి, అలాగే, తణుకుకు చెందిన పంచెకట్టు పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకుల్లో ఒకరికి రామారావు గారు తన మూడో అమ్మాయి పెళ్లి గురించి ప్రతిపాదనలు పంపితే ఈ ప్రముఖులు ఇద్దరూ సున్నితంగా, మర్యాదపూర్వకంగా తిరస్కరించారని కూడా గుడివాడలో కొందరు చెప్పగా విన్నా. వాటిలో నిజమెంతో ఇప్పటికీ తెలియదు.
చంద్రబాబు తొలి రాజకీయ మిత్రుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి గారు 1978 నాటికే పెళ్లయి, ఇద్దరు పిల్లల తండ్రిగా ఎన్నికల బరిలోకి మొదటిసారి దిగారు. కాంగ్రెస్–ఐ గ్రూపు రాజకీయాల్లో తన వర్గీయుడైన చంద్రబాబుతో పాటే 1980లో అంజయ్య కేబినెట్లో వైఎస్ చేరారు. కాని చంద్రబాబు కన్నా ముందే 1982 ఫిబ్రవరిలో భవనం వెంకట్రామిరెడ్డి గారి మంత్రివర్గంలో పదోన్నతి పొంది కేబినెట్ మంత్రి అయ్యారు పులివెందుల కాంగ్రెస్ నేత.
చంద్రబాబు కన్నా ఏడు నెలలు వయసులో పెద్దవాడైన వైఎస్ తెలుగుదేశం స్థాపకుడు ఎన్టీఆర్ బతికుండగా కాంగ్రెస్ అధికారంలోకి రాదనే అనుమానంతోనో ఏమో– 1989 డిసెంబర్ జమిలి ఎన్నికల్లో కడప నుంచి లోక్ సభకు పోటీచేసి గెలిచాక– కాంగ్రెస్ పార్టీలో సీఎం కావడంలో 20 ఏళ్లు వెనుకబడ్డారు. చంద్రబాబు 45 ఏళ్ల వయసులో 1995 సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయితే, ఆయన పాత మిత్రుడు, కొత్త ప్రత్యర్ధి డాక్టర్ వైఎస్ 54 ఏళ్లు దాటే వరకూ సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో నిత్య అసమ్మతి నేతగా, తిరుగుబాటుదారుగా ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి తొలి సీఎంగా చంద్రబాబు ఐదు పదులు నిండకుండానే ముఖ్యమంత్రి అయితే, కడప జిల్లా తొలి సీఎంగా వైఎస్ ఆర్– కాంగ్రెస్ పవర్ పాలిట్రిక్సులో డక్కామొక్కీలు తిని, దశాబ్దం పాటు పార్లమెంటు సభ్యునిగా కూడా అనుభవం సంపాదించి, 54 ఏళ్ల ‘మెచ్యూర్’ వయసులో తన మిత్రుడు ఖాళీ చేసిపోయిన ఏపీ ముఖ్యమంత్రి పీఠం విజయవంతంగా ఎక్కి కూర్చున్నారు.
సునాయాసంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. పూర్తి ఐదేళ్లూ పదవిలో కొనసాగి సమర్ధుడైన ఏకైక కాంగ్రెస్ సీఎంగా చరిత్రకెక్కారు. అప్పట్లో కమ్మ మహిళలు పొలం పనులు చేసే జిల్లా చిత్తూరుకు చెందిన చంద్రబాబుకు ఎన్టీఆర్ కూతురును ఇవ్వడం నచ్చని కృష్ణా జిల్లాకు చెందిన నా కమ్మ మిత్రులు కొందరు, ‘అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు కొడుక్కి నందమూరి వారి పిల్లను ఇవ్వడం ఏమిటి’ అని గొణుగుతూ చెప్పిన మాటలు (1981) నాకింకా గుర్తున్నాయి.
యువ ఎమ్మెల్యే, యువ మంత్రి, యువ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు 74 సంవత్సరాలు నిండాయనే విషయం గుర్తుకొచ్చి అన్నీ పాత సంగతులే ఇక్కడ రాసేశాను….
Share this Article