ఎస్, నిస్సంకోచంగా ఇది భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి ఇంజక్ట్ చేయడానికి ఉద్దేశించిన సినిమాయే… సినిమా బలమైన మాధ్యమం కాబట్టి కొన్ని క్యాంపెయిన్ చిత్రాల్ని బీజేపీ ప్రజల్లోకి వదులుతోంది… ఆర్టికల్ 370 సినిమా కూడా అదే… కాకపోతే మరీ మన తెలుగు వాళ్లు తీసిన ఇటీవలి వ్యూహం, శపథం, రజాకార్, రాజధాని ఫైల్స్ వంటి సబ్ స్టాండర్డ్ ప్రయత్నాలు కావు…
ఒక యురి కావచ్చు, ఒక బస్తర్ కావచ్చు, ఒక ఆర్టికల్ 370 కావచ్చు… కీలకమైన సబ్జెక్టుల్ని కాషాయ భావజాలం కోణంలో జనంలోకి పంపించడం… కమర్షియల్ సినిమాల బాపతు వాసనలు వీసమెత్తు కూడా లేకుండా… సీరియస్‌గా సబ్జెక్టులనే చర్చిస్తాయి ఇవి… కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ కొంత భిన్నంగా అనిపించినా అవీ ఒకరకంగా పొలిటికల్ క్యాంపెయిన్ చిత్రాలే…
ఐతే సున్నితమైన విషయాల్ని కూడా బాలీవుడ్ దర్శకులు డీల్ చేస్తున్న తీరు బాగుంటుంది… గట్స్, టేస్ట్ వంటి పెద్ద పదం అవసరం లేదు కానీ తమకు అప్పగించిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తున్నారు… ఎక్కడా డీవియేషన్ ఉండదు… ప్యూర్ బీజేపీ భావజాలమే సినిమాను నడిపిస్తుంది… ఆర్టికల్ 370 కూడా అంతే…
Ads
నెహ్రూ కాలంలో జరిగిన తప్పిదాల చర్చ నుంచి మొదలు పెట్టి ఆర్టికల్ 370 ఎత్తివేత దాకా చర్చిస్తుంది ఈ సినిమా కథ… అయితే ఇందులో కశ్మీర్ పార్టీల నాయకుల్ని, కేంద్రంలో ప్రతిపక్షాలను విలన్లుగా చూపించారు సరే, మరి అదే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్నాళ్లు ప్రభుత్వాన్ని ఉద్దరించింది కదా… మరి కథలో అలాంటి పరిణామాల ఛాయలేవి..? సో, కన్వీనియెంట్‌గా ఆర్టికల్ 370 ఎత్తివేతపై కొంత ఫిక్షన్ కలిపి, కొన్ని వాస్తవాలను దాచిపెట్టేసి, మోడీ-బీజేపీ పాపులారిటీని పెంచడానికి, ఆ ఎత్తివేతను జస్టిఫై చేయడానికి సినిమా బాగానే ప్రయత్నించింది…
370 అనే నంబర్ ఆర్టికల్ నంబరే కాదు, ఇప్పుడు బీజేపీ సొంతంగా ఆశిస్తున్న సీట్ల నంబర్ కూడా… సరే, సినిమా అనే కోణంలోకి వెళ్దాం… నో డౌట్, యామీ గౌతమ్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా ఇది… సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న ప్రియమణిదీ మంచి పాత్రే… ఇద్దరూ బాగా చేశారు… దర్శకుడు ధర్ (యామీ భర్త, యురి దర్శకుడు) సినిమా రెండున్నర గంటలకు పైగా ఉన్నా సరే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు…
హీరోయిన్ ఓ కశ్మీరీ… ఇంటలిజెన్స్ ఆఫీసర్… కథలో ఆమెను కశ్మీరీగా చూపించడం కూడా ఓ స్ట్రాటజీయే… పెయిడ్ స్టోన్ పెల్టర్స్, బురాన్ వనీ ఎన్‌కౌంటర్, ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదం, పుల్వామా, రాళ్ల దాడి నుంచి తప్పించడానికి ఓ ఉగ్రవాదిని జీపు ముందుభాగంలో కట్టేసి వెళ్లడం వంటివి బాగానే తీశారు…
ఐతే ఎడిటింగ్ కొరవడింది… ఆర్టికల్ 367 గురించి చెప్పినప్పుడు, ఆర్టికల్ 370 ఎత్తివేతకు సాంకేతికంగా ఉపయోగపడిన పాత గెజిట్ కోసం అన్వేషణ, దాని వివరణ సుదీర్ఘంగా సాగింది… డ్రై అయిపోయింది సినిమా అక్కడ… క్లుప్తత ఉండాల్సింది… చట్టాలు, బిల్లులపై అవగాహన ఉన్నవాళ్లనూ విసిగించేలా సాగింది అది… పైగా కశ్మీర్ భారతంలో భాగంగానే ఉండేది, ఉంది, ఉంటుంది అనే బీజేపీ తాలూకు నినాదాన్ని, మేనిఫెస్టో వాగ్దానాన్ని బలంగా ఫోకస్ చేయలేదు అనిపించింది…
ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక జెండా, ఒక ప్రధాని అనే భావనను ఇంకాస్త ఎమోషనల్‌గా ప్రొజెక్ట్ చేసి ఉంటే బీజేపీకి ఇంకాస్త ఉపయోగపడేదేమో… రాజ్యాంగ నైతికతను గాకుండాా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా బిల్లును పాస్ చేయించుకున్నట్టు చూపించడమూ బాగనిపించలేదు… మోడీ పాపులారిటీకి ఆర్టికల్ 370 ఎత్తివేత, ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య వంటి అంశాలే ఉత్ప్రేరకాలుగా ఆ క్యాంపు భావిస్తోంది కాబట్టి వాటినే జనంలోకి ఇలా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి… సినిమాలు చూసి జనం వోట్లేయరు, కానీ తమ విధాన నిర్ణయాల జస్టిఫికేషన్, పీపుల్ యాక్సెప్టెన్సీ కోసం ఇదో ప్రయత్నం…
రాష్ట్రపతి దగ్గరకు ప్రధాని కాన్వాయ్ లేకుండా కారులో వెళ్లడం వంటి కొన్ని సీన్లు డ్రమెటిక్… అలాగే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సెక్రెటేరియట్ లైబ్రరీలోకి ఆఫీసర్లు మారు పేర్లతో, ఐడీ కార్డులతో ఓ పాత గెజిట్ కోసం వెళ్లడమూ అంతే… ఆర్టికల్ 370 కథ నుంచి ఎక్కడా డీవియేషన్ లేకపోవడం, దాని ఎత్తివేతకు ఎలా గ్రౌండ్ ప్రిపేర్ చేశారో వివరించడం, చివరి క్షణం దాకా మీడియాను, ఇతర ప్రభుత్వ విభాగాలను కూడా ఎలా వేరే అంశాలవైపు డైవర్ట్ చేశారో చూపించడం వంటివి బాగున్నాయి…
చివరగా మరో అంశమూ చెప్పుకోవాలి… జాతీయ స్థాయి సున్నితాంశాలను కూడా… సరే, పొలిటికల్ క్యాంపెయిన్‌లా అయినా సరే… బాలీవుడ్ చాకచక్యంగా డీల్ చేస్తున్న తీరు బాగుంటోంది… ఇతర భాషల్లో ఇలాంటి సబ్జెక్టులు టచ్ చేయడానికే వణుకుతారు… మరీ మన టాలీవుడ్ అయితే అవసరమైతే చరిత్రకు వక్రబాష్యాలు చెబుతూ కూడా కమర్షియల్ మసాలాలు గుప్పించడమే తప్ప సొసైటీలో డిబేట్‌కు దారితీసే ఒక్క అంశమూ చేపట్టే టేస్టు లేదు, ఆ టాస్కులు డీల్ చేసే సాహసమూ లేదు…!! (ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది)
Share this Article