Taadi Prakash…….. అక్షరాలకు డిజిటల్ రెక్కలు
The Fast Changing Face of
Publishing in Telugu
Ads
…………………………………………..
నీ ఇంట్లోనే ఉన్న నీ చిన్నారిపాప రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకాల్లోకి ఎగిరిపోగలదా?
నీ అయిదారేళ్ల బుజ్జి బబ్లుగాడు ఏనుగు మీద ఏడు సముద్రాలూ దాటివెళ్లి, కత్తియుద్ధంలో ఆకాశరాజుని ఓడించగలడా?
ఎక్కడో కాలిఫోర్నియాలో ప్రేమ విఫలమైన యువతి మనోవేదనకు చలించి కరీంనగర్ లోని ఓ కాలేజీ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోవడం అయ్యేపనేనా?
రష్యాలో ఓ రైల్వే ప్లాట్ ఫామ్ మీద నడుస్తున్న ఆనాకెరినినా అంతిమ ఘడియల్లోని క్షోభని ఇక్కడ హైదరాబాద్ లో ఓ యువకుడు అనుభవించి, దిగులు కళ్లతో మిగిలిపోవడం సాధ్యమవుతుందా?
దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంలో నెల్సన్ మండేలా వెనక నడిచే లక్షల మందిలో నువ్వూ ఒకడివి కాగలవా? ఇవన్నీ సాధ్యమే. ఆ ఉద్వేగం, ఆనందం, ఉద్రేకం, బాధ, కన్నీళ్లు… అన్నీ మన అనుభవంలోకి వస్తాయి… ఒక్క పుస్తకంతో!
ఒక కథ, ఒక నవల, ఒక పద్యం, ఒక తిరుగుబాటు, ఒక త్యాగం, మానవ సంస్కారంలోని ఔన్నత్యం లాంటివన్నీ పుస్తకాలు మనకి ఇస్తాయి… నేర్పుతాయి. పుస్తకం దయతో, కరుణతో, ప్రేమతో మనల్ని చుట్టుకుంటుంది. గుండె అట్టడుగు చీకటి పొరల్లో ఒక మట్టి ప్రమిదని వెలిగిస్తుంది.
కనికరం లేని కర్కశమైన ఈ లోకమ్మీద నిలువెత్తు మానవత్వాన్ని నిలబెడుతుంది. రాక్షసులుగా మారిపోకుండా ఈ మానవజాతిని కాపాడుతుంది.
పుస్తకానికి రాష్ట్రాలు, దేశాలు లేవు. పుస్తకానికి సరిహద్దులు తెలియవు. బతుకు నానాటికీ హీనం అయిపోతోన్న ఈ విషాద వేళ… సమస్త మానవాళీ గొంతెత్తి పాడుకునే వసుధైక గీతం… పుస్తకం.
ఇంతకీ పుస్తకం గురించి ఈ పూనకం దేనికి?
ఈ డిసెంబరులోనే హైదరాబాద్ లో జాతీయ పుస్తక మహోత్సవం జరుగుతోంది. మన తెలుగు పుస్తక ప్రచురణ ఒక గొప్ప మలుపు తిరుగుతున్న తరుణం ఇది. ఇన్నేళ్లుగా ఉన్న ఫిజికల్ పుస్తకం ఇక డిజిటల్ దారుల్లో విహరించబోతోంది. విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఎమెస్కో అనే పబ్లిషింగ్ తిమింగలాల్ని లెక్కచేయకుండా, ఈ జీవనదిలో కొత్త చేపపిల్లలు ఎగిరెగిరిపడుతున్నాయి. చిన్న చిన్న పబ్లిషర్లు కొత్త ఐడియాలతో, ప్రయోగాలతో జనాన్ని ఆకట్టుకునే పుస్తకాలతో వస్తున్నారు. మారుతున్న టెక్నాలజీతో పుస్తక ప్రచురణని కొత్త దారుల్లో నడిపిస్తున్నారు. కొత్తరకం కవర్ పేజీలు కట్టిపడేస్తున్నాయి.
నవలలు, కథాసంపుటాలు, కవితా సంకలనాలు ఒక కొత్త అందంతో మెరుస్తున్నాయి. కళాత్మకమైన డిజైన్, కంటికి ఇంపైన ఫాంట్, క్వాలిటీ పేపర్ మీద ప్రింటింగ్ తో పాఠకుల్ని కవ్విస్తున్నాయి.
ఒకనాడు పుస్తకాలు, పంచాంగాలు, డైరీలు, వాల్ పోస్టర్లు, కేలండర్లు, కరపత్రాలు… ఏవైనా పబ్లిషింగ్ రాజధాని విజయవాడ. అందులోనూ సింగిల్ విండో విశాలాంధ్ర… వాళ్లదే ఆధిపత్యం! చాలా ఏళ్లు పట్టినా, క్రమంగా హైదరాబాద్ కూడదీసుకుంది. నిలదొక్కుకుంది. పరుచూరి హనుమంతరావు రెడ్ హిల్స్ లో ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ ప్రారంభించారు.
కళాజ్యోతి ఆధునిక టెక్నాలజీ రంగంలోకి దిగింది. అటు వంశీ ఆర్ట్ ప్రింటర్స్, కర్షక్, హిమాలయ, చరిత లాంటి కొన్ని డజన్ల ప్రింటింగ్ పులులు జనారణ్యంలోకి వచ్చాయి. క్వాలిటీ ప్రింటింగ్ అంటే ఏమిటో ముద్రణాలయాలు చేసి చూపించాయి. పుస్తకాలూ, బ్రోషర్లూ, భారీ కేలండర్లూ, ఆర్ట్ ఆల్బమ్ లూ, పోస్టర్లూ, మేగజైన్లూ, పబ్లిసిటీ మెటీరియల్ని హై రెజల్యూషన్ మెషీన్ల మీద మల్టీకలర్ ప్రింటింగ్ తో హోరెత్తించారు. బాహువులు చాచిన పబ్లిషింగ్ ఆక్టోపస్ వందల కోట్ల పరిశ్రమగా విస్తరించింది. ఆర్టిస్టులు, కంపోజిటర్లు, డిజైనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కలర్ స్పెషలిస్టులు, ప్రింటింగ్ నిపుణులు, కట్టర్లు, బైండర్లు, ప్లేట్ మేకర్లు… ఇలా వందల వేల మందికి గిరాకీ పెరిగింది. ఉద్యోగాలొచ్చాయి. కవులూ, రచయితలూ ఎలాగూ రాస్తారు.
ముద్రణకి ఖర్చవుతుంది.
ప్రింటయ్యాక అసలు కథ మొదలవుతుంది. అనంతపురం నుంచి ఆదిలాబాద్ దాకా… శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్ దాకా ప్రజలకు పుస్తకం చేరడం ఎలా? దాన్నే డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అంటాం. ఎవరు ఎఫెక్టివ్ గా పంపిణీ చేయగలరో వారే మొనగాళ్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అప్పటికీ ఇప్పటికీ పంపిణీ పెత్తందారు విశాలాంధ్ర. రెండు రాష్ట్రాల్లో పన్నెండు బుక్ షాపులు ఉన్న విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పంపిణీని శాసిస్తోంది. విశాలాంధ్ర పుస్తక ప్రచురణ, పంపిణీ ద్వారా ప్రతీ ఏటా చేసే వ్యాపారం అనగా టర్నోవరు పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా ఉంటుంది.
ఆ తర్వాత పబ్లిషింగ్ లో స్థిరంగా నిలదొక్కుకున్న ప్రజాశక్తి, ఎమెస్కోలు ఒక్కోటి దాదాపు అయిదు కోట్ల రూపాయల టర్నోవరు సాధించాయి. ఒకప్పుడు రష్యన్ పుస్తకాలు, కమ్యూనిస్టు సిద్ధాంత గ్రంథాలు, ఉత్తమ సాహిత్యం మాత్రమే అమ్మి పాఠకుల అభిరుచిని పెంచిన విశాలాంధ్ర ఇప్పుడు అమ్ముడుపోతుందంటే చాలు , ఏ పుస్తకం వెయ్యడానికైనా వెనకాడడం లేదు. భక్తి, వ్యక్తిత్వ వికాసం, వంటలు, పురాణాలు, బీభత్సంగా ప్రచురిస్తూ ‘చేర్చదగు నొకింత చెత్త సిరిసిరిమువ్వా’ అన్న శ్రీశ్రీ మాటల్ని ఆచరించి చూపిస్తున్నారు.
తిరుమల – తిరుపతి దేవస్థానం భక్తి ప్రచార పుస్తకాల అధికారిక పంపిణీదారు వామపక్ష, విప్లవ విశాలాంధ్ర వారే అని మీకు తెలుసా?
ప్రజాశక్తి, విశాలాంధ్ర పాత మూసలోనే ఇప్పటికీ మూలుగుతున్నాయి. గత 40 ఏళ్లలో వాళ్ల భాష మారిందేమీ లేదు. సామ్రాజ్యవాద, నయా వలసవాద, బూర్జువా, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ప్రజలంతా భాగస్వాములవడం కోసం చేస్తున్న ఉమ్మడి రాజకీయ పోరాటాల్లో… అంటూ ఊదరగొడుతూనే ఉన్నారు. డిక్షన్ మారాలన్న ఇంగితం లేనేలేదు. వాళ్లు ప్రచురిస్తున్న అనువాద పుస్తకాలు చదవడం ఒక నరకం. బూజుపట్టి కంపుకొట్టే పాత భాష , కృతకమైన అనువాదం. రచయితలకీ, అనువాదకులకీ వాళ్లు చిల్లర పైసలు విసిరేసి చాకిరీ చేయించుకోవడమే ఈ దుర్గతికి కారణం. వాళ్లకున్న పంపిణీ పవర్ తో పుస్తకాలు హేపీగా అమ్మేస్తారు. రచయితలకి డబ్బు ఇవ్వడం మాత్రం జరగదు. తెలుగు పుస్తకాలకు అద్భుతమైన కవర్ పేజీల స్వర్ణయుగం నడిచిన కాలంలో బాపు, చంద్ర, బాలి, మోహన్, బాబు, గోపీ అనే మహానుభావులైన ఆర్టిస్టులకు వంద రూపాయలూ మహా అయితే అయిదొందలూ ఇచ్చి వెట్టిచాకిరీ చేయించుకున్న ఘనత, పుస్తకాల నుంచి లాభాలనే పచ్చినెత్తురు పిండుకోవడానికి అలవాటుపడ్డ పబ్లిషర్లకే దక్కుతుంది.
మరి పుస్తకాలను ఉల్లిపాయలు, చింతపండు వ్యాపారంగా దిగజార్చిన పబ్లిషర్లు ఏమంటారు? ‘ముద్రణ భారం పెరిగింది…. ఉద్యోగుల జీతాలు,
బుక్ షాపుల నిర్వహణ… అన్ని జిల్లాలకు పంపిణీ చేయడం… ఈ తలకుమించిన ఖర్చుల వల్ల మాకు వర్కవుట్ కావడం లేదు’ అంటున్నారు. వర్కవుట్ అనే దొంగ మాటకి అర్థం మీకు తెలుసా?
లాభాలు సరిపోవడం లేదని! శ్రమకోర్చి, చెమటోడ్చి, రేయింబవళ్లూ సాహిత్యసేవ చేయడంలో తలమునకలై వున్నామని తప్పితే, కోట్లలో లాభాలు కాజేస్తున్నామని ఎవరైనా చెబుతారా?
అసలెందుకింత కటువుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది?
గత పదేళ్లలో ఈ దుస్థితి మారుతూ వస్తోంది. ప్రభుత్వాధికారులకు లక్షల్లో లంచాలు ఇచ్చి కోట్ల రూపాయల పుస్తకాల కాంట్రాక్టు కొట్టేసే సర్వ ‘శిక్ష’ అభియాన్ కన్నబిడ్డలు ఉన్నచోటే కొత్తతరం ఒకటి తలెత్తుకు నిలబడుతోంది.
వాళ్లు అభిరుచిగల వాళ్లు…
పాఠకుణ్ణి గౌరవించేవాళ్లు…
రచయితలకు డబ్బులిచ్చేవాళ్లు..
వ్యాపారమే అయినా కళాత్మకమైన కొత్త దారుల్లో నడిచి ముందుకెళ్లాలనే తపనగలవాళ్లు.
వీళ్లు హృదయంతో, ప్రేమతో, ఒక ఉద్వేగంతో పనిచేస్తున్నారు.
నవలో, కవిత్వమో, కథలో…
క్వాలిటీ వాళ్ల ప్రయారిటీ.
అసలు కవర్ పేజీతోనే పాఠకుణ్ణి పడగొట్టేస్తారు.
ఆఫ్సెట్, డిజిటల్ ప్రింటింగ్, పాఠకుణ్ణి రీచ్ కావడానికి
ఆన్లైన్ మార్కెటింగ్…. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో సహజీవనం….
ప్రీపబ్లిసిటీ, పుస్తకావిష్కరణ సభల హంగామా….
ఏదిచేసినా బోల్డ్ గా, బ్యూటిఫుల్గా!
‘అన్వీక్షికి’ వెంకట్ సిధారెడ్డి, ‘ఛాయ’ కృష్ణమోహన్ బాబు, ‘పీకాక్ క్లాసిక్స్’ అన్నపనేని గాంధీ, ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ గీతా రామస్వామి, ‘పర్స్పెక్టివ్స్’ ఆర్కే, ‘వీక్షణం’ వేణుగోపాల్, ‘నవోదయ’ కోటేశ్వరరావు, ‘పల్లవి’ ఎస్వీ నారాయణ, ‘శ్రీశ్రీ ప్రింటర్స్’ విశ్వేశ్వరరావు, ‘మలుపు’ బాల్ రెడ్డి, ‘మంచి పుస్తకం’ సురేశ్, “సమాంతర” భాగ్య, వరుణ్ కుమార్, ‘అనల్ప’ బలరాంరెడ్డి, ‘జేవీ పబ్లికేషన్స్’ జ్యోతి వలబోజు, ‘మనసు’ ఫౌండేషన్… ఇంకా పి.మోహన్, అనిల్ బత్తుల, కూనపరాజు కుమార్ రాజు, ఖదీర్ బాబు, స్కై బాబా లాంటి వాళ్లెందరో తెలుగులో పుస్తక ప్రచురణని పోస్ట్ మాడర్న్ ఉత్సవంగా
సెలబ్రేట్ చేస్తున్నారు.
జీవన సాఫల్యం అంటే…
ఒక్క దెబ్బకి వందకోట్లు సంపాదించడం కాదు.
ఏడాదికోసారి అమెరికా వెళ్లి రావడమూ కాదు.
స్టాక్ మార్కెట్లో జాక్ పాట్ కొట్టడం అసలే కాదు.
మనసుకు నచ్చిన పుస్తకం కొని చదివిన అనుభూతితో
ఆత్మని నింపుకోవడమే… ఒక మనిషికి మాగ్నిఫిషెంట్ అబ్సెషన్ గా మారితే… అదికదా జీవన సాఫల్యం! – TAADI PRAKASH, 97045 41559.
* 2022 డిసెంబర్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక సండే మేగజైన్ లో వచ్చిన నా కవర్ స్టోరీ.. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం…
Share this Article