ఒక సినిమా… అబ్బ, మలయాళమే లెండి… పేరు జయజయజయజయహే… 2022 సినిమా… భిన్నమైన కథాంశాలతో, తక్కువ ఖర్చుతో సినిమా తీసేస్తారు కదా… దీన్ని కూడా 5 కోట్లతో చుట్టేశారు… హిట్… 50 కోట్ల దాకా వసూళ్లు… మలయాళంలో 50 కోట్ల వసూళ్లు అంటే సూపర్ హిట్ అన్నట్టే కదా…
తెలుగులో కూడా డబ్ చేశారు, ఏదో ఓటీటీలో కూడా వచ్చింది… తెలుగు జనం కూడా విపరీతంగా చూశారు… కథలో వైవిధ్యం… ఎలా అంటే..? ఇంటర్ పూర్తయి పెద్ద చదువులకు వెళ్లాలనుకునే ఓ అమ్మాయి.,. మిడిల్ క్లాస్ నేపథ్యం… అభ్యుదయ భావాలున్నట్టు కనిపించిన లెక్చరర్‌ను ఇష్టపడుతుంది…
ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అర్జెంటుగా ఓ కోళ్ల ఫారం ఓనర్‌తో పెళ్లి ఫిక్స్ చేస్తారు, పెళ్లీ చేసేస్తారు… తరువాత మొదలవుతుంది ఆమెకు టార్చర్… ప్రతి విషయానికీ అనుమానం… కోపిష్టి… కొడుతుంటాడు… పెద్ద చదువులకు నో… భరించలేక పేరెంట్స్‌కు చెబితే ‘సర్దుకుపోవాలమ్మా సంసారం అన్న తరువాత’ అని సర్దిచెబుతారు…
Ads
అసలే ఇండివిడ్యుయాలిటీ ఉన్న అమ్మాయి కదా… ఓ రోజు మొగుడి మీద తిరగబడి కొట్టేస్తుంది… షాక్ తిన్న భర్తకు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ కొట్టిందని తెలుస్తుంది… దాంతో తనూ నేర్చుకుంటాడు… ఐనా సరే, భార్య చేతిలో తన్నులు తప్పవు… తరువాత కోర్టు దాకా వెళ్తుంది భార్యాభర్తల పంచాయితీ… ఇదే కథ… లైటర్ వీన్‌లో ఈ కథను ప్రజెంట్ చేస్తాడు దర్శకుడు…
మరి ఎందుకు ఇది అంత హిట్టయింది..? దీని మీద మలయాళ మీడియాలో భలే చర్చలు… అప్పడాల కర్రల కార్టూన్లు తెలుగులోనూ సూపర్ హిట్ కదా, కారణం ఏమిటి..? అదే కారణం ఈ సినిమా సక్సెస్‌కు కూడా కారణం… ఓ మిత్రుడి విశ్లేషణ ఏమిటంటే..?
‘‘మన సబ్ కాన్షియస్ మైండ్‌లో కొన్ని ఫీలింగ్స్ అలా నిద్రావస్థలో ఉంటాయి, పేరుకుని పోతుంటాయి… ఫలానా పని చేయాలని ఉంటుంది కానీ చేయలేం, కానీ ఆ కోరిక అలా మన అంతఃచేతనలో పెరుగుతూ ఉంటుంది… ఒక హీరో రౌడీలను చితకబాదుతూ ఉంటే, అరె, మనం చేయలేని పనిని తెర మీద హీరో చేస్తున్నాడనే భావన ఆ అంతఃచేతనను తృప్తి పరుస్తుంది… సూపర్ హీరోయిక్ ఫైట్లను, పోకడల్ని సగటు ప్రేక్షకుడు ఇష్టపడేది అందుకే… ఉదాహరణకు, వంద మందిని ఒకేసారి రమ్మను షేర్ ఖాన్ అనే డైలాగు తామే పలుకుతున్నట్టు ఫీలవుతాడు ప్రేక్షకుడు…
ఈ సినిమా కూడా అంతే… ఓటీటీలోనూ మహిళా ప్రేక్షకులు విపరీతంగా సినిమా చూశారంటే ఇదే కారణం… పురుషాధిక్యం లోలోపల మహిళల్లో ఓరకమైన వ్యతిరేకతను… కాస్త ముతకగా చెప్పాలంటే భర్తను నిజంగానే ఓసారి తంతే బాగుండుననే భావననూ ప్రేరేపిస్తూ ఉంటుంది… ప్రత్యేకించి తమను చిన్నచూపు చూసే మొగుళ్లను… కానీ సాధ్యం కాదు, అదే తెర మీద ఓ సగటు గృహిణి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ తంతుంటే లోలోపల వ్యక్తిగత అహం శాటిస్‌ఫై అవుతుంది…’’
అవునా..? నిజమేనా..? కావచ్చు… ఇదే సినిమాను ఇంతమంది చూశారు కదా… దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ భార్య చేతిలో తన్నులు తినే ఆ పాత్ర పోషణకు రెడీ అయ్యాడు… ఈషా రెబ్బా ఆ రెబల్ భార్య పాత్ర పోషిస్తుందట… కానీ అదే మలయాళ బాపతు ఫీల్‌ను ఇక్కడ రీక్రియేట్ చేయగలరా..? ఏమో చూద్దాం…!!
Share this Article