దేశమంతా ఎన్నికల ప్రచారం ఒక తీరు… ఏపీ పాలిటిక్సు మాత్రం మరో తీరు… బూతులు, తిట్లు, ఎద్దేవా, వ్యక్తిత్వ హననం స్థాయి కూడా దాటిపోయి చివరకు కట్టుకున్న చీరెల దాకా వచ్చింది పరిస్థితి…
నాకు మీరు ఇచ్చిన గత అయిదేళ్ల పాలనకాలంలో నేను ఇది చేశాను, మళ్లీ గెలిపిస్తే ఇంకా ఇది చేస్తాను అని హుందాగా చెప్పుకుంటే సరిపోయేది కదా, కానీ జగన్ ఎటెటో వెళ్లిపోతున్నాడు… జగన్ రాష్ట్రానికి ఇదుగో ఈ ద్రోహాలు, నష్టాలు చేశాడు, గతంలో నా పాలన చూశారు, మరోసారి నాకు చాన్సివ్వండి అని చంద్రబాబు వోట్లడిగితే సరిపోయేది… పూర్తిగా జగన్ మీద క్రూరుడు, దుర్మార్గుడు బాపతు విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు… సహజంగానే తన జతగాడు పవనుడూ అంతే…
నో సిద్ధాంతమ్స్, ఓన్లో రాద్దాంతమ్స్… ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నవాడికి ఏదైనా దుంగ దొరికితే దాన్నే పట్టుకుని తీరం వైపు వెళ్లడానికి పాట్లుపడతాడు అన్నట్టు కాంగ్రెస్‌కు వర్తమానంలో ఏ దిక్కూదివాణం లేదు, ఎవరికో ఏదో దొరికినట్టు షర్మిల దొరికింది… తమ కుటుంబాన్ని నానారకాలుగా సతాయించిన ఆ కాంగ్రెసే ఆమెకు ఎందుకు కనిపించిందో, ఎందుకు తను ప్రయాసపడుతుందో, జగన్ మీద ఏదో కోపాన్ని ఏరకంగా ప్రదర్శించాలని తాపత్రయపడుతుందో ఇక్కడ విశ్లేషణ అనవసరం…
Ads
కానీ… పదే పదే బాబాయ్ హత్య చుట్టే తన ప్రచారాన్ని తిప్పుతోంది… జగన్‌ను ఇరుకునపెట్టడానికి వివేకాను గొప్ప లీడర్‌గా, గొప్ప మనిషిగా పరోక్షంగా ప్రొజెక్ట్ చేస్తోంది… జగన్‌ను తిట్టడానికి అక్కరకొస్తోంది కాబట్టి చంద్రబాబూ అదే బాట… పోలవరం, కొత్త పెట్టుబడులు, మూడు రాజధానులు, లక్షల కోట్ల అప్పులు వంటి నిజమైన ఎన్నికల అంశాలు సోదిలోకి లేకుండా పోయాయి…
ఇప్పుడిక ప్రచారస్థాయి చీరెల దాకా వచ్చింది… ఇక్కడ జగన్ వ్యాఖ్యలు తన స్థాయికి తగినట్టు లేవు… షర్మిల ఏదేదో మాట్లాడుతోంది, ఐనంతమాత్రాన జగన్ అదే భాషకు రావల్సిన పనిలేదు… ‘‘పచ్చ చీర కట్టుకుని, వైఎస్‌ను వ్యతిరేకించిన వారింటికి వెళ్లి, మోకరిల్లి, వాళ్లిచ్చిన స్క్రిప్టు మక్కీకిమక్కీ చదివేవాళ్లా వైఎస్ వారసులు? ’ అన్నట్టు ఎక్కడో మాట్లాడాడు… బాగాలేదు…
ఆమే వెంటనే అందుకుంది… నిజానికి ఆమె తెలుగు డిక్షన్ సహా ఆమె ప్రస్తావించే అంశాలే గందరగోళం… కానీ ఈ విషయంలో మాత్రం ఆమె చెబుతున్నది కరెక్టే… ఆమె చంద్రబాబు ఎదుట మోకరిల్లడానికి వెళ్లలేదు, కొడుకు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లింది… ఏ రంగు చీర కట్టుకోవాలనేదీ ఆమె ఇష్టం… పసుపు శుభసూచకం… అది అరిష్టం కాదు, పైగా ‘‘పసుపు రంగు మీద చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా..? ఆమె ఏమైనా చంద్రబాబు క్యాంపులో ఉందా..? సాక్షి లోగో చుట్టూ పసుపు లేదా..? దాన్ని వైఎస్ సూచించలేదా..? చివరకు చెల్లెలి దుస్తుల గురించి కూడా కామెంట్స్ చేసే స్థాయికి దిగజారతావా జగన్‌రెడ్డీ..?’’ అని మొదలెట్టింది ఆమె…
వేరే వాళ్లకూ ఓ చాన్స్ ఇచ్చినట్టయింది… జగన్ మీద పోటీచేస్తున్న బీటెక్ రవి అని ఓ లీడర్ ఉన్నాడు కదా… ‘‘ఏం..? భారతీరెడ్డికి పసుపు చీరెలు లేవా..? డ్రెస్సులు లేవా..?’’ అని ఈ ప్రచారాన్ని జగన్‌కు వ్యతిరేకంగా వాడేసుకుంటున్నాడు… సోషల్ మీడియా కూడా ఏది దొరికినా వదలదు కదా… అసలే అది తెలుగు సోషల్ మీడియా… భారతీరెడ్డి యెల్లో డ్రెస్సు, చీరెల ఫోటోలతో జగన్ వ్యతిరేక పోస్టులకు దిగింది… ఇక ఆపండ్రా బాబోయ్ అని సగటు వోటరు జుత్తు పీక్కుంటున్నాడు…
పోలింగ్ నాటికి ఈ ప్రచారం ఇంకే స్థాయికి దిగజారిపోతుందో ఎవరూ చెప్పలేరు…! అసలే నాయకులందరూ అదుపు తప్పి ఉన్నారు..!! జగన్‌కు యెల్లో క్యాంపు, యెల్లో జెండా, యెల్లో మీడియా, ఇలా చంద్రబాబు తాలూకు యెల్లోతనం అంటేనే ఓ ఎలపరం… కానీ ఎవరు యెల్లో చీర కట్టినా వాళ్లు చంద్రబాబు మనుషులే అని ముద్రలేసేస్తే ఎలా రెడ్డి గారూ..!!
Share this Article