Jagan Rao…. ఎవరూ ఎవర్నీ మోసం చేయరు. మనం మోసపోయాం అంటే మనమే 100% కారణం. నాకు తెలిసిన ఒకతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని వైఫ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇద్దరికీ ఒక పేరు గాంచిన MNC లో ఉద్యోగాలు. ఇద్దరికీ ఏ చెడు అలవాట్లూ లేవు. 50 లక్షలు బ్యాంక్ లో ఉన్నై. అమీన్ పూర్ లో ఇళ్ళ స్థలం తీసుకుందాం అనుకున్నారు.
వాళ్ళు రెంట్ కి ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్ష్ లో ఒక సినెమా ప్రొడ్యూసర్/ డిస్ట్రిబ్యూటర్ ‘‘లక్ష ఇస్తే 1-3 నెలల్లో 2 లక్షలు ఇస్తా’’ అనగానే తనకు డబ్బు ఇచ్చాడు అంట. నెలలో లక్షకి 2 లక్షలు వచ్చె, ఆ తర్వాత అదే 2 లక్షలు ఇస్తే 2-3 నెలల్లో 4 లక్షలు వచ్చె. ఇదేదో బాగుంది అనుకుని, బ్యాంక్ లో 50 లక్షలు అప్పు తీసుకుని, ఇంకా తన దగ్గర ఉన్న 50 లక్షలు కూడా కలిపి, మొత్తం కోటి రూపాయలు ఇచ్చాడు. ఇంకా వాళ్ళ అక్కా బావతో 70 లక్షలు, తెలిసిన బంధువులు, పిన్ని, బాబాయ్ లతోనూ ఇప్పించాడు, మొత్తం 6 కోట్లు ఆ సినెమా ప్రొడ్యూసర్ కి ఇచ్చారు.
కట్ చేస్తే… 6 కోట్లు తీసుకొని వాడు పరారీ.., అపార్ట్ మెంట్ ఖాళీ… పోలీస్ కేసు పెట్టి, దొరకబట్టి, వాడ్ని కొట్టిస్తే పోలీసులకే తాయిలాలు ఇచ్చి వాడు రిలీజ్… ఆ తర్వాత పొలీసులతో, రౌడీలతో, కర్ణాటకలో ఒక పార్టీ లీడర్ మనుష్యులతో, తెలంగాణలో ఒక పార్టీ లీడర్ మనుష్యులో, ఇంకా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ తో కలిసి పని చేసినా, ఏం చేసినా, అదనపు డప్పు ఖర్చు తప్ప మోసపోయిన ఆ డబ్బులు మాత్రం రాలేదు ,.. ఎవరైనా కనీసం 3 కోట్లు తీసుకొని, మిగతా 3 కోట్లు ఇప్పించినా చాలు అనుకున్నా సరే, పని కాలేదు సరికదా… విషాదం ఏమిటంటే, ఈ తలనొప్పులు, సమస్యలతో వీళ్ళకు విడాకులు, వాళ్ళ అక్కకు విడాకులు, పిన్ని ఆత్మహత్య… అలా చాలా జరిగాయి.
ఇదంతా పక్కన పెడితే – వాళ్ళ కజిన్ బ్రదర్ పరిచయం చేశాడు. తప్పు అంతా వాళ్ళ కజిన్ బ్రదర్ దే అంటాడు నేను మాట్లాడినప్పుడు… 2 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది అని నాతో చెప్పినప్పుడు – అయ్యిందేదో అయ్యింది. మీ ప్రయత్నం మీరు చేయండి కానీ, ఉద్యోగం మీద ఫోకస్ పెడితే మీరు మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పినా వినకుండా ఉద్యోగం మానేసి మరీ చివరికి పూర్తిగా సంక నాకిపోయారు.
ఈ రోజు ఫోన్ చేసి మా కజిన్ బ్రదర్ వలన నా జీవితం నాశనం అయ్యింది అంటాడు. ఎవరి జీవితం ఎవరి వలన నాశనం అవ్వదు, మనమే పూర్తిగా కారణం అంటాను నేను. మనం చేసే పనులకి మనమే పూర్తిగా బాధ్యులం. మనం డ్రైవ్ చేస్తుంటే పక్కనోడు ఇంకొంచెం స్పీడ్ పోనిమ్మంటే పోయి యాక్సిడెంట్ అయ్యాక వాడే కారణం అనటం మూర్ఖత్వం.
ఎవరు ఏది చెప్పినా అది మంచి అయినా, చెడు అయినా దాన్ని పూర్తిగా విశ్లేషించి మనం డెసీషన్ తీసుకోవాలి, ఏం జరిగినా దానికి మనమే పూర్తి బాధ్యత వహించాలి. ఎవరూ ఎవర్నీ నాశనం చేయరు, మోసం చేయరు. మనం మోసపోయాం అంటే మనమే 100% కారణం.
చెప్పింది తండ్రి అయినా, తల్లి అయినా, తోడ పుట్టినవారు అయినా, స్నేహితులు అయినా, బంధువులు, గురువులు ఎవరు అయినా – ఏ విషయంలో ఏమి చెప్పినా – అది వాళ్ళ కోణం మాత్రమే; వాళ్ళు చెప్పాక దాన్ని విశ్లేషించి మనకి సెట్ అవుతుందా లేదా అన్న ఆలోచన చేసి ఏం జరిగినా దానికి మనమే పూర్తి బాధ్యత తీసుకోవాలి.
మనం కూడా కొంత రీసెర్చ్ చేయాలి, అ తర్వాతే డెసీషన్ తీసుకోవాలి. వ్యక్తిగతంగా నేను కూడా నాలుగు విషయాల్లో వేరే వాళ్ళు చెప్పింది విని, నష్టపోయా కానీ 0.0001% కూడా దానికి వాళ్ళు కారణం అని నేను అనుకోవటం లేదు; నిందించలేదు… నేనే కారణం.
ఎవరో ఆకుకూర, గుడ్లు రోజూ తినమని చెప్తే… అవే తినీ తినీ కిడ్నీలు పాడై పోతే మనమే కారణం అవుతాము తప్ప, చెప్పిన వాళ్ళు కాదు… అందుకే మనకి ఏది సెట్ అవుతుందో, మన పరిస్థితులకి, మనకి, మన మనస్తత్వానికి తగినట్టు విశ్లేషణ చేసుకోవాలి అంటారు ప్రాచీన రోమన్ తత్వవేత్తలు…. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article
Ads