ప్రతి మీడియా ఏదో ఒక పార్టీకి లేదా ఏదో ఒక నాయకుడికి భజన… తొత్తు… మైక్… దాసోహం… ఏ పదాలైనా వాడండి… అది నిఖార్సయిన నిజం… దాని గురించి పదే పదే చర్చ జరగుతూనే ఉంటుంది, అదలా కొనసాగుతూనే ఉంటుంది… ఇప్పుడు చెప్పబోయేది ఈనాడు ధోరణి గురించి…
గుర్తుంది… తెలుగుదేశం పుట్టిన కొత్తలో ఈనాడు స్ట్రెయిట్‌గానే ఎన్టీయార్ బట్టలు ధరించింది… కాంగ్రెస్ ఓటమి కోసం, టీడీపీ గెలుపు కోసం బజారులో నిలబడే కలమెత్తింది… కొంగుచాటు, తలుపుచాటు పిలుపులు, పత్తిత్తు వేషాలేమీ లేవు… అప్పట్లో టీడీపీ అనుకూల నినాదాలను ప్రతి పేజీలోనూ అచ్చొత్తేది… ఆ నినాదాలు బాగా రాసిన సిబ్బందికి అవార్డులు కూడా ఇచ్చింది…
సీన్ కట్ చేస్తే… మరీ నడిబజారు పిలుపులు గాకుండా… కాస్త తలుపు చాటు నుంచే చంద్రబాబు అనుకూల యవ్వారాలు నడపసాగింది… అదెప్పుడూ చంద్రబాబు మౌత్ పీసే… కాకపోతే న్యూట్రల్ ముసుగు కప్పుకున్నట్టు కనిపించేది, పోనీ, నటించేది… మళ్లీ ఆరోజులొచ్చాయి… మొన్నటి, నిన్నటి, ఈరోజు ఈనాడు ఏపీ ఎడిషన్లలో ఐదారు నినాదాల చొప్పున ప్రత్యేకంగా కనిపించాయి… నేటి ఈనాడు చూడలేదు, చూడాల్సిన పనిలేదు, ఇంకా పదునుగా పోలింగ్ దాకా నడుస్తూనే ఉంటయ్… వీటిని మార్కెటింగ్ భాషలో సరోగేట్ యాడ్స్ అనాలి…
Ads
పైకి చూస్తే ఈ నినాదాలన్నీ వోటరు చైతన్యం, మంచి వోటు దిశలో స్పృహ, వోటు విలువ కోసం ప్రచారం అన్నట్టు కనిపిస్తాయి… వాటి మర్మం జగన్‌ను మట్టికరిపించండి, బాబు కూటమిని గెలిపించండి అని నినదించడమేనని విద్యావంతులకు, కాస్త పొలిటికల్ స్పృహ ఉన్నవాళ్లందరికీ తెలుసు…
అందుకేనేమో జగన్ పదే పదే చెబుతున్నాడు… నాకు తెలుగుదేశం కాదు ప్రత్యర్థి, కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి అని..! మార్గదర్శిని మూసేద్దామన్నంత ప్రయత్నం కూడా చేసి, ఈనాడు ఆర్థిక మూలాలను, రామోజీని పూర్తిగా పెకిలిద్దామని ప్రయత్నించాడు… అంతెందుకు..? కేసీయార్ కాపాడాడు గానీ రామోజీరావునే లిఫ్ట్ చేసి, జైలులో పారేద్దామని ట్రై చేశాడు కదా… సహజంగానే మండినట్టుంది…
ఎంత పెద్దవారైనా సరే, తన ప్యాలెస్‌కు వచ్చి, తన ఆశీస్సులు తీసుకునే రేంజ్ తనది… ఈ జగన్ అనే కుర్రకుంకకు ఇంత అహంకారమా అని అహం భగ్గుమన్నట్టుంది… ఇంకేముంది..? నాటి ఈనాడు మళ్లీ ప్రత్యక్షమైంది… రాసింది మళ్లీ రాయకుండా రోజుకూ బోలెడు జగన్ వ్యతిరేక కథనాలు మండిపోతున్నయ్… ఇక ఇప్పుడు నేరుగానే నినాదాల యుద్ధం కూడా స్టార్ట్ చేసింది…
కానీ ఇక్కడే ఒక చిన్నమాట… బరితెగింపులోనూ, బట్టలిప్పడంలోనూ నాణ్యత అవసరం… ఈ నినాదాలు మరీ సరోగేట్ యాడ్స్‌లాగా ఎందుకు..? నేరుగానే వైసీపీకి వోటేయొద్దు, జగన్‌కు వోటేస్తే నాశనమైపోతారు, మా చంద్రబాబు బంగారం, మా పవన్ కల్యాణ్ ఆణిముత్యం అన్నట్టు నేరుగా పంచ్ డైలాగ్స్ పబ్లిష్ చేయొచ్చు కదా… జనానికి నేరుగా అర్థమవుతాయి… ఈ డొంక తిరుగుడు, శుష్క నినాదాలు దేనికండీ…
జగన్ శుద్ధపూస కాదు, సరే… విధ్వంసకుడు, సరే… దుష్పరిపాలకుడు, సరే… నరహంతకుడు, సరే… రాష్ట్రానికి పట్టిన శని, సరే… మీరు చెప్పదలుచుకున్నది మార్మిక భాషలో ఎందుకు సార్..? పామరుడికీ సమజయ్యేలా రాయండి… వోటరే తేల్చేస్తాడు కదా పోలింగ్ రోజున..!! చివరగా మరోమాట… సాంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ…!!
Share this Article