రాజకీయాల్లో తెర వెనుక చాలా మర్మాలుంటయ్… కానీ తెరపై కనిపించేదే వోటరుకు ప్రధానం… దాన్ని బట్టే తన అభిప్రాయాల్ని ఏర్పరుచుకుంటాడు… ఏపీ పాలిటిక్స్ సంగతే తీసుకుందాం…
గత ఎన్నికల ముందు మోడీ ఓడిపోతాడని భ్రమపడి, తప్పుడు అంచనాలతో… ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని, మోడీ మీద నానా దుర్భాషలాడి, కాంగ్రెస్‌తో జతకట్టి, దానికి డబ్బులిచ్చి, చివరకు భంగపడిన చంద్రబాబు తరువాత ఏం చేశాడు..? జగన్ తొక్కడం నుంచి రక్షణ కోసం అదే మోడీ దయ కోసం, చూపు కోసం, ప్రాపకం కోసం నానా పాట్లూ పడ్డాడు…
సరే, బీజేపీ లోలోపల ఏం ప్లాన్లు వేసుకుందో, లేదా ఎప్పటిలాగే ఏపీకి సంబంధించి ఏ ప్లానయినా సరే శుద్ధ దండుగ అనుకుందో… పవన్ కల్యాణ్ పదే పదే చెప్పగానే… సర్లే సర్లే అనుకుని చంద్రబాబుతో చేతులు కలిపింది… సరే, కలిపారుపో… అది ఉమ్మడి కూటమి కదా, సీట్లు పంచుకున్నారు కదా… కొన్ని సీట్లలో అభ్యర్థులు దొరక్కపోతే ఒకరి నాయకుల్ని ఒకరు అడ్జస్ట్ చేసుకున్నారు కదా… మరి..?
Ads
ప్రజాగళం పేరిట ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారు… దానికి ఉమ్మడి మేనిఫెస్టో అని పేరు కూడా పెట్టారు… ఆ మేనిఫెస్టో నాణ్యత గురించి ఇక్కడ విశ్లేషించడం లేదు… జగన్ పంచుడుకు బాబు మార్క్ కౌంటర్ పంచుడు అది… ఎవరూ తక్కువ కాదు… నువ్వు పదిస్తే నేను ఇరవై ఇస్తా… అంతకుమించిన విజన్ ఏమీ లేదు ఇద్దరి మేనిఫెస్టోల్లో… వీళ్లూ ఫాఫం తెలుగు ప్రజల రాజనీతిజ్ఞులు..!!
సరే, ఆ మేనిఫెస్టో ఉమ్మడిదే కదా… మరి దానిపై బాబు, పవన్ ఫోటోలు మాత్రమే ముద్రించడం ఏమిటి..? ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి బొమ్మ వేయటానికి మనసొప్పలేదూ అనుకుందా బాబుకు… కనీసం మోడీ బొమ్మయినా ఉండాలి కదా… ఏది..? పవన్, బాబు ప్రసంగాల్లో కూడా ఎంతసేపూ జగన్‌పై విషమే తప్ప మోడీ ప్రస్తావనే ఉండటం లేదు పలుసార్లు…
అంటే ఇది ఉమ్మడితనంలోనూ విడివిడితనమా..? మేనిఫెస్టో రిలీజ్ వీడియో బిట్ ఒకటి వాట్సప్‌లో సర్క్యులేటవుతోంది… బాబు, పవన్ పక్కనే నిల్చున్న బీజేపీ పెద్దాయన సిద్ధార్థ నాథ్ సింగ్ (ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జుల్లో ఒకరు..?) కనీసం ఆ మేనిఫెస్టోను టచ్ చేయడానికి, ఫోటోకోసమైనా పట్టుకోవడానికి ఇష్టపడలేదు… నిరాకరించాడు…
అంటే, మేనిఫెస్టోను కేవలం టీడీపీ, జనసేన మేనిఫెస్టోలా మార్చినందుకా..? మేనిఫెస్టోలో పేర్కొన్న అనేకానేక అలవిమాలిన పంచుడు పథకాల మీద అసంతృప్తా..? అబ్బే, బీజేపీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, అందుకని ఏపీ మేనిఫెస్టోలో వేళ్లు కాళ్లు పెట్టలేదు అనే సమర్థన సరైందిగా లేదు… కలిసి వోట్లు అడుగుతున్నప్పుడు, కలిసే మేమేం ఉద్దరిస్తామో చెప్పాలి కదా…
కామన్ మినిమం ప్రోగ్రాం అంటూ ఏదీ లేని యెల్లో కూటమిలో బాబు ఏది చెబితే అదే ఫైనల్… అది పూర్తిగా టీడీపీ మేనిఫెస్టో… కనీసం జనం కోసమైనా ‘మాది ఉమ్మడి ఎన్నికల ప్రణాళికే’ అని చెబుతున్నట్టు కనిపించాలి కదా… రాజకీయాలంటేనే ప్రజల్ని భ్రమల్లో పడేయడం, గంతలు కట్టడం కదా.,. అదిక్కడ విస్మరించి, కలివిడివిడితనాన్ని చూపిస్తూనే కలిసి వోట్లు అడుగుతారట… భలే దొరికారయ్యా… ఫాఫం మోడీ…!! దేశానికి, ప్రపంచానికి పనికొచ్చే ఆయన ఫోటో షూట్లు తన మిత్రపొత్తుడు చంద్రబాబుకు మాత్రం కొరగాకుండా పోయాయి..!!
Share this Article