Kandukuri Ramesh Babu….. గీతా రామస్వామి : ఎరుపూ నలుపూ కాదు, అమెది భూమి వర్ణం
ఇటీవల చదివిన పుస్తకాల్లో రోజుకొకసారైనా గుర్తుకు వస్తున్న పుస్తకం గీతా రామస్వామి గారి ‘అడుగడుగున తిరుగుబాటు.’ ఉప శీర్షికగా పెట్టినట్టే ఆమె ప్రజా జీవితంలోని అనేక పోరాటాలూ.. నిజానికి తెలుగు అనువాదం పేరు సరిగ్గా అనిపించలేదు గానీ, ఆంగ్లంలో ఆమె పెట్టిన పేరు ‘Land Guns Caste Woman: The Memoir of a Lapsed Revolutionary.’మరి, ఈ ‘Lapsed రివొల్యూషనరీ’ అంటే ఏమిటి? ‘ఆగిపోయిన విప్లవకారిణి’ అని అనుకోవచ్చా లేదా విప్లవం నుంచి తప్పుకున్న మహిళ గాథ అని భావించవచ్చా లేదా పతనమైన విప్లవ కారిణి అనుకోవచ్చా?
‘విఫల ఆదర్శవాది’ అని పుస్తకం గురించి లోపల రాసిన వాళ్ళెవరో అన్నారు. పోనీ అదా? ఏమిటని భావించవచ్చు!
Ads
ఇవేవీ కాదు. గీతా రామస్వామి గారి గొంతులోనే ఒక పాటి నిరసన ఉంది. తిరుగుబాటు తత్వం నీడన ఏర్పడిన వైరాగ్యం ఆమె సొంతం. ఒకపాటి ఏహ్య భావన అది. ఎన్నో ఆశలతో, కలలతో… త్యాగాల మాటున సాగిన ఆమె జీవితంలో చెప్పనలవి కాని ఆశాభంగాలున్నాయి. వాటి కారణంగాను, నిండా విప్లవంలో మునిగి తేలినప్పటికీ అది ఎంతకీ సాకారం కాకపోవడం వల్లనూ ఆమెలో ఎంతో విచారం ఉన్నది. ఆగ్రహం ఉన్నది. కోపం, ఆగ్రహం మాటున దాగిన వ్యధ ఎంతో ఉన్నది. వాటన్నిటి ప్రతిఫలనమే వారు తన అనుభవాల దొంతరకు లేదా ఆత్మకథకు Memoir of a Lapsed Revolutionary.’ అని పేరు పెట్టేలా చేసి ఉండవచ్చనిపిస్తోంది.
తెరిచిన పుస్తకం మాదిరిగా ఆమెను చదివి, ఈ పుస్తకం మూసేశాక, చదివిన ప్రతి అనుభవంలో దేన్నీ మరచిపోలేం. చదివి రెండు నెలలైనప్పటికీ అకస్మాత్తుగా ఎదో ఒక అనుభవం చప్పున గుర్తుకు వచ్చి బాధ కలుగుతోంది. ఆమె పట్లా, గడిచిన ఆమె జీవితం పట్లా, ఆమె పరిచయం చేసిన సుదీర్ఘ దశాబ్దాల విప్లవ చరిత్ర పట్లా, ఆమె కలిసి జీవించిన, కార్యాచరణలో పనిచేసిన అందరినీ చూసిన పిదపా, ఆమె మాదిరిగానే ఆమె జీవితంపట్లా గర్వం కన్నా ఎకువగా మనకూ ఒకలాంటి విరక్తి కలుగుతుంది. ఆమె స్వయంగా చేసిన తిరుగుబాట్ల పట్లా ఎంత అభినంధనగా అనిపించినా ఒకపాటి సంవేదనకు గురవుతాం. ఆమె మాదిరిగానే భంగ పడుతాం. కొందరిని చీత్కారించుకుంటాం. మరికొందరిని చూసీ చూడనట్లు పోతాం. రోజూ ఎదో ఒక అనుభవం గుర్తొచ్చి విచారం కలగుతుంది. మనసు గాయపదుతుంది. అందుకే మాటి మాటికి గుర్తొచ్చే ఈ పుస్తకం గురించి కొంచెం రాసి స్వాంతన పొందాలనిపిస్తోంది.
నిజానికి నేను వరసగా నాలుగైదు విశ్లేషణలు ఇవలనుకున్నాను. కానీ పరిమితమై ఒకటి ప్రధానంగా రాయాలని ఇది మొదలు పెట్టాను. ఇదే ఆఖరు. మొదలు.
ఐతే ఈ పుస్తకం గురించి చెప్పదలిస్తే ఒకటి మాత్రం నిచ్చయం. అది ఈ ఆత్మకథ ఒక నిరసన పుస్తకం అని.
నిరసన పుస్తకం. అవును. ఎవరిపై అంటే INSIDERS పై.విప్లవం లోపలున్న మనుషుల గురించి. కార్యాచరణలో భుజం భుజం కలిసి నడిచిన వాళ్ళ గురించి. ద్వంద స్వభావం గల వాళ్ళ గురించి. నిజాయితి లోపించిన వాళ్ళ గురించి. సిద్దంతాలు, వ్యూహాల మాటున అసలు విప్లవం వాయిదా వేసిన మనుషుల గురించి. మొత్తంగా ప్రజల గురించి కాదు, విప్లవ సేనపై చేసిన విమర్శ ఇది.
ఇంత కాలం గడిచాక కూడా అంతే సూటిగా ఆమె ఉన్నందున, ఉన్నది ఉన్నట్లు రాయడం, చెప్పడం తన విధి అని భావించడం వల్లా కూడా అది నిశ్చయంగా నిఖార్సైన నిరసన పుస్తకమే అవుతున్నది. అందుకే దీన్ని MEMOIR అనడం కన్నా నేను CRITIQUE గానే చూస్తున్నాను. ఇది ఆత్మ విమర్శ చేసుకోలేని విప్లవ శిభిరానికే కాదు, దళిత స్త్రీవాద రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఆమె తాలూకు నిరసన సెగలు తగిలే పుస్తకం ఇది. బాగా రాశారు. నిజానికి గీత రామస్వామి గారు దీన్ని నవలగా రాసి ఉంటే కూడా ఎంతో బాగుండేది. కానీ అలా చేసి ఉంటే తాను రాయడంలో పడే బాధ, అనుభవించిన వేదన మరింతగా లోతుగా ఆమెను కుదిపేసి ఉండేదేమో.
ఐతే, దీన్ని నిరసన గ్రంధం అనడం ఒకటైతే, అసలు చెప్పాలంటే ఆమె ఆత్మదే ఒక నిరసన వ్యక్తిత్వం అనీ చెప్పాలి. ఇది బలహీనత కాదు, బలమే. కాబట్టే ఆమె అడుగడుగునా రాజీ పడకుండా కొట్లాడారు. కొట్లాడే శక్తి లేనప్పుడు అక్కడనుంచి తప్పుకున్నారు. చేసే పనిలో సర్వశక్తులూ పెట్టి పోరాడారు. ఇతరుల విప్లవంలో కొన్నేళ్ళు. తానే విప్లవంగా మరికొన్నేళ్ళు. ఇప్పుడు తటస్థంగా అన్నిటికీ దూరంగా కార్యాచరణ పక్కనపెట్టి పుస్తక ప్రచురణే తన విప్లవంగా ఉండి కూడా దశాబ్దాలు ఐంది. అరవైలు మొదలు -డెబ్బైలు, ఎనభైలు, తొంభైలు. దాదాపు మూడు నాలుగు దశాబ్దాల అనుభవాల ఆత్మ కథానాత్మక కథనాల నిరసన సంపుటి ఇది. ఒక స్త్రీగా అన్ని ఆధిపత్య వ్యవస్థలను ఎదిరించి తల్లిగా మారిన మనిషి కథ ఇది. అసాధారణం అనుకునే స్థితి నుంచి సామాన్యతను ఆశ్రయించిన వివేకి వికాస గాథ ఇది. ఎరుపు నుంచి నలుపుకు అక్కడనుంచి ముదురు గోధుమ వర్ణానికి మారిన యాక్టివిస్ట్ తాను.
భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అనే కాదు, భాష కోసం, చదువు కోసం, సమానత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన మనిషి తాను.భూమి వర్ణం తాను.ఆమె నిర్మాణంలో ఇమడని మనిషి. అలా అని నిర్మాణం చేయలేదని కాదు, తాను నిర్మాత కూడా. కానీ ఏదైనా ఒకటి వ్యవస్థ అవుతుంటే దాని నుంచి తప్పుకునే చేవ తనది. అందుకే ఆమె ఇప్పటికీ తిరుగుబాటు చేయగలుగుతున్నారు. ఎమర్జెన్సీ అనంతరం విప్లవం నుంచి విడిపోయాక ఎందరో… రాజ్యం భయం లేని స్వచ్ఛంద సంస్థలుగా మారారు. భద్రజీవితంలో ఇమిడిపోయారు. కానీ తాను క్షేత్రంలో నిలబడి విప్లవం కోసం నడుంకట్టడం విశేషం. తన పని తాను చేసి నిదానంగా నిష్క్రమించారు.
ఐతే, తన పని ‘ఇతరుల పని’ మాత్రమే కాదని, తనకంటూ ఇంకొక పని ఉందని తెలిసి ఆ పని నుంచి కూడా పక్కకు జరిగారు. ఈ మాటలన్నీ అర్థం కావాలంటే పుస్తకం చదవ వలసిందే. చదివితే మీకూ అర్థమవుతుంది, సిసలైన విప్లవ కారిణి ఆమె అని. బ్రాహ్మణీకం వదులుకుంటూ దళిత ఐక్యత దాకా సాగిన ఆమె ఎదురీతలో తెలంగాణ భూమికగా ఉండటం ఆమెకు సహజ న్యాయం. ఆమెకు తెలంగాణా ఒక తల్లి. తాను ఇబ్రహీంపట్నం బిడ్డలకూ ‘తల్లి భూదేవి’.
తన జీవన సహచరుడు సిరిల్ రెడ్డి గారు ఈ పుస్తకం చదవకుండానే పోవడం నిజంగా తీరనిలోటే.నిజానికి ఆమె తిరుగుబాటు చేసినది మొదట ఇంట. ఇంటి వాకిట్లో. అటు తర్వాత చదువూ సంధ్యల్లో. అటు పిమ్మట చేరిన విప్లవ సంఘంలో. విప్లవ సహచరులతో. అనంతరం స్త్రీ వాదులతో, ఆ తర్వాత దళిత వాదులతో. అవేవీ నచ్చక ఆమె పరాయి రాష్ట్రంలో మురికివాడ పిల్లలతో కలిసి పనిచేశారు. తిరిగి వచ్చి తానే విప్లవం చేశారు. స్వయంగా ప్రారంభించిన ‘సంఘం’లో ఆమె కుదురుకున్నారు. దళితులతో మమేకమై ఇబ్రహీంపట్నం భూపోరాటాల్లో అపూర్వంగా నిమగ్నమైయ్యారు. తర్వాత అదీ విడిచిపెట్టి పిమ్మట ప్రచురణా రంగంలో Hyderabad బుక్ ట్రస్ట్ గా నిలబడ్డారు. దాన్ని ఇంకా వదులుకోలేదు.
నిలదొక్కుకున్నారు. ఐతే, ఆమె మనసంతా పోరాటం మీదనే. సమాజం మార్పుకోసమే. సాహిత్యం/ప్రచురణ అన్నది స్వయగా యాక్టివిజం కాదు, అది ద్వీతీయ పోషకం అని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఇప్పటికీ సేద తీరని వనితనే. కానీ తనను తాను తెలుసుకున్న ధీర వనిత.
ఆమె సుదీర్ఘ యానంలో ప్రతిసారీ విఫలమయ్యారు. అందుకే ఈ ఆత్మకథను ‘విఫల విప్లవనారి’ అని ఎవరైనా పేర్కొంటే తప్పులేదు. కానీ అది నిజమేనా అంటే యదార్థ అర్థంలో కాదనే అనాలి. ఆమె సఫలమయ్యారు. అన్నిటికన్నా ముఖ్యం సహజం అయ్యారు. ఏ కీర్తి కిరీటాలకు లొంగకుండా ఆగకుండా ముందుకే నడిచారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజీలేకుండా ఆమె దీరోదాత్తంగా ముందుకే సాగారు.
ఒక యువతిగా మొదలైన ఆమె కథ బృందంగా సమూహంగా సంగంగా మారి ఉండవచ్చు. అందులో ఒక స్త్రీ తాలూకు చేవను పరిచయం చేస్తూ… ఒకింత మగరాయుడిగా… ముందుకు వెళ్ళినట్లు అనిపించినా ఆ తర్వాత పుస్తకం ముగేసేటప్పటికి… ఆమె అలసిపోతూ ఉండే స్థితికి చేరుకుంటూ ఉన్నప్పుడు ఆశ్చర్యగా ఆమె కథ అధ్బుతమైన మలుపు తిరుగుతుంది. మల్లి నిండు కుండలా మారుతారు. ఆ అధ్యాయం మాతృత్వంతో ముగుస్తుంది. అదే ఈ పుస్తకంలో చాలా విస్మయం గొలిపే అనుభవం.
అది ఎవ్వరో కాదు, తానే ఎన్నడూఊహించని విధంగా ‘గీతా రామస్వామి’ తల్లి అవుతారు.ఆమె సఫలమైంది ఏమైనా ఉన్నదీ అంటే… కేవలం తన కోసం…జీవితంలో మొదటిసారిగా …సంపూర్ణంగా ఆమె రక్త మాంసాలతో ఆత్మతో అనుభవించినది ఏమైనా ఉన్నదీ అంటే…అది తనంతట తాను తనపై తాను చేసిన పోరాటం – అది మాతృత్వమే. అందుకే ఈ ఆత్మకథను బిడ్డను కనడంతో ముగింపు చేశరనిపిస్తోంది.. అటు తర్వాత ఇంకా చాలా కథ ఉన్నది. ఉంటుంది. కానీ ఆమె ముగింపు నిచ్చినది మాత్రం బిడ్డను కనడం దగ్గర. తల్లి కావడం దగ్గర. అదే ఆమె జీవితంలో అన్నిటికన్నా ఉత్కృష్టమైన విప్లవం. అది ‘ప్రేమ’ అన్నారు తాను.
చిత్రమేమిటంటే ప్రేమ రాహిత్యం ఆమెలో అడుగడుగునా ఉన్నది. ప్రేమ ఇంట్లో దక్కలేదు. బయటా దక్కలేదు. సహచర జీవితంలో విప్లవంపై ప్రేమేగానీ విప్లవాచారణలో భాగం కావడం మినహా ప్రేమతో కలిసి జీవించినది, అనుభవించినది ఏమీ లేదు. ప్రేమే విప్లవం చేసుకున్నందుకు ఆమె అనేక తిరుగుబాట్లతో ఎంతో అలసిపోయింది. ఒంటరిగా ఆమె సుదీర్ఘంగా పోరాడి అలసి సొలసి ఆఖరికి ఒకానొక రోజు తానే వర్ణించినట్టు నిర్మలమైన అమాయకమైన బాలికలో ప్రేమను దర్శించింది.
“అది 1992. బంజారా హిల్స్ లోని ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. అప్పుడు సమయం రెండు అవుతోంది. బయట ఎండగా వుంది. తలుపులు తెరచుకుని లోపలి అడుగుపెట్టగానే నా కళ్ళకి అంతా మసకగా అనిపించింది. లోపల తలుపు సమీపంలో ఏడాది వయసున్న పాపా ఆడుకుంటోంది. ఉంగరాల జుట్టు. చారడేసి కళ్ళు. పాపా చాల అందంగా వుంది. నన్ను చూడగానే ఆ పాప భయపడింది. చప్ప్పున తన తల్లి వెనక్కి వెళ్లి దాక్కుంది. నాకు ఒక్కసారిగా మనసు చివుక్కుమన్నట్టయింది.”
“ఇబ్రహీంపట్నం జనం నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఆరాధిస్తారు. నా స్నేహితులంతా నన్ను ఎంతగానో అభిమానిస్తారు. అలాగే నా భర్త కూడా. కానీ ఆ పాప తన తల్లిని ప్రేమించినంత గాడంగా మాత్రం కాదు. ఆ క్షణంలో పాపకి తన తల్లి మాత్రమే కావలసి వచ్చింది. నాకు కూడా అట్లాంటి గాడమైన ప్రేమ కావాలి అనిపించింది. అంతే. ఆ మరునిమిషం నుంచీ నా జీవితమే మారిపాయింది. నాకో బిడ్డ కావాలి. నాకు ఒక బిడ్డ తప్పనిసరిగా కావాలి”.
“బిడ్డ ఉంటే జీవితం అస్తవ్యస్తం అవుతుందని అనేక సంవత్సరాలుగా నాలో గూడు కట్టుకుని వున్న తార్కిక భావన ఒక్కసారి పటా పంచలైపోయింది. నాకో బిడ్డ కావాలన్నా కోరిక అణువణువులో ప్రతి ధ్వనిస్తూ నన్ను నిలువనివ్వలేదు. అంతే. సంవత్సరం తిరిగేసరికల్లా నా వొళ్ళో నా బిడ్డ లీల వుంది.”
చూశారు కదా.అడుగడుగునా తిరుగుబాటు పేరుతో రాసిన గీతా రామస్వామి పుస్తకంలో చివరి తిరుగుబాటు ఇది. ఆ తర్వాత మరికొన్ని పేజీల్లో పుస్తకం ముగించడమే కాదు, తాను అప్పటిదాకా చురుగ్గా ఉన్న ఇబ్రహీం పట్నం తాలూకాలో చేస్తన్న పని నుంచి కూడా తప్పుకున్నారు. పుస్తకం కూడా అక్కడే ఆపేశారు. నాకు ఈ ముగింపు చాలా నచ్చింది. ఎందుకూ అంటే పుస్తకంలోని అన్ని తిరుగుబాట్లనూ చూస్తో వచ్చాను. ఎందులోనూ నాకు సంతృప్తి లభించలేదు. శాంతి లేదు. అసంపూర్ణం. ఇది మాత్రం సంపూర్ణం.
ఎప్పుడైతే గీత గారు దళితులకు దగ్గరయ్యారో అక్కడ ఒక చిన్న ఇంట్లో పనిచేస్తూ డీ క్యాస్టిఫై – డీ క్లాసిఫై – తెలంగానైట్ అయ్యారో అలాగే ఆమె మనిషి కూడా అయ్యరానిపించింది. ఎంతో నేర్చుకున్నట్టూ అనిపించింది. అంతేకాదు, పోరాటం అన్నది కూడా అనివార్యం, అనంతం అని వారికి బోధపడింది. కానీ సహజమూ సుందరమూ ఐనది అమరడం కోసం ఆమెకు ఒక సందర్భం వచ్చినట్టు ఐంది. అదే పై అనుభవం.’లీల’ పుట్టడంతో ‘ఆమె’ తిరుగుబాట్లన్నీ పూర్తయ్యాయి.
ఇక్కడే… సహజమైన ప్రేమ, స్త్రీ సహజమైన అమ్మతనంతో ఆమె పూర్తిగా విప్లవకారిగా కానరావడం, ప్రపంచం పట్ల విమర్శ కన్నా ఒక అంగీకారం కుదరడం, తన మానసిక శారీరక భౌద్దిక అంతరంగాలు విశాలం కావడం అన్నీ నాకు ఈ అధ్యాయం వరకు వచ్చేటప్పటికి కానవచ్చై. ఇవన్నీ నాకు ఎంత విస్మయం గొలిపాయి అంటే, అందుకే పుస్తకం అంతా చదివితే ఈ అనుభవం అసలైన ఆత్మకథగా మిగతాదంతా ఆమె ఆత్మలేని అనివార్య జీవన గాథను వదులుకుంటూ రావడంగా నేను భావిస్తాను.
నిజానికి వివరంగా ఒక రాయవలసిన పుస్తకం. కానీ చదువరులకు స్వయంగా చదవడం అంతకన్నా ముఖ్యం. అందుకే ఇక్కడ సెలవు తీసుకుంటూ…ఇంత విస్తారమైన విషాద గాథను అందించిన గీత రామస్వామి గారికి, వారు సాహసోపేతంగా జీవితాన్ని గెలుచుకున్నదుకు, దాన్ని అక్షరాల రాసి మాకు అందించినందుకూ- మనసారా అభివందనాలు. చదువుతుంటే తెలుగు పుస్తకమే అనిపించేలా అనువదించిన ప్రభాకర్ మందార గారికి కృతజ్ఞతలు.మీరు ఇప్పటిదాకా చదవకపోతే తెప్పించుకుని తప్పక చదవండి. కింద వివరాలు ఇస్తున్నాను.
Share this Article