నటుడు సుహాస్ దగ్గర ఓ సుగుణం ఉంది… (హీరో అనడం లేదు, నటన తెలిసినవాడు కాబట్టి నటుడు అంటున్నాను…) తన సినిమాల్లో సూపర్ హీరోయిజం, సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, ఆకాశం ఎత్తు పెంచాలె- సముద్రం లోతు తవ్వాలె వంటి సగటు తెలుగు హీరోయిక్ ప్రొజెక్షన్స్ లేకుండా… ఏదైనా వైవిధ్యమైన కథను ఎంచుకుంటాడు…
తన శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు… కథే కథానాయకుడి పాత్ర పోషించాలి… తన రేంజ్ కమర్షియల్‌గా ఎంత..? ఎన్ని సక్సెసయ్యాయి..? వంటి లెక్కలు ఇక్కడ అక్కర్లేదు… ప్రసన్నవదనం సినిమా చూస్తుంటే అనిపించేది ఇదే… ఓ భిన్నమైన మరో పాత్ర బాగానే చేశాడు…
థ్రిల్లర్, క్రైమ్ జానర్ అనగానే… మలయాళం సినిమాలు గుర్తొస్తాయి… రకరకాల క్రైమ్ కథలు, దర్యాప్తు తీరును టెంపో సడలకుండా ప్రజెంట్ చేస్తుంటారు ఆ దర్శకులు… కథలో కొత్తదనం కావాలంటే ఏదో ఓ డిజార్డర్ సెంటర్ పాయింట్‌గా తీసుకుని దాని చుట్టూ కథ అల్లుతారు… ప్రసన్నవదనం కూడా అంతే…
Ads
ఇందులో కథానాయకుడికి ఫేస్ బ్లైండ్ నెస్ అనే ప్రాబ్లం ఓ ప్రమాదంలో గాయపడ్డాక మొదలవుతుంది… నిజంగా సినిమా కోసమే ఈ వ్యాధిని క్రియేట్ చేశారా అనే డౌట్ నాకూ వచ్చింది… సినిమా కథ అంటేనే ఫిక్షన్ కదా… కానీ నిజంగానే ఆ వ్యాధి ఉంది… మెడికల్ టర్నినాలజీలో prosopagnosia అంటారు దాన్ని… ( ప్రోసోపాగ్నోసియా )… కాకపోతే చాలా చాలా అరుదు…
వ్యక్తుల మొహాల్ని, ముఖకవళికల్ని గుర్తుపట్టలేకపోవడం ఈ వ్యాధి లక్షణం… దాదాపుగా చికిత్స లేనట్టే… కాకపోతే వ్యక్తుల్ని గుర్తించడానికి ఇతరత్రా కొన్ని మార్గాల్ని ఆసరాగా చేసుకోవాలి… అలాంటి కథానాయకుడు ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది..? ఇదీ ఈ సినిమా స్టోరీ లైన్… బాగుంది… ఇంతకుముందు ఈ వ్యాధితో ఎవరైనా స్టోరీ లైన్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్తే… సినిమా టైటిల్ ప్రసన్నవదనం కొంతమేరకు ఆప్ట్…
సరే, చెప్పుకున్నా చాలామందికి వ్యాధి అర్థం కాదు, వింతగా చూస్తారు కాబట్టి, ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పుకోరు… ఇందులోనూ అంతే… అనుకోకుండా ఓ హత్యను చూడటం, కానీ మొహాల్ని గుర్తుపట్టలేకపోవడం, తనే ఆ కేసులో అనుమానితుడు కావడం అనే కథను సెకండాఫ్ నుంచి దర్శకుడు బాగానే డీల్ చేశాడు… కథలో అక్కడక్కడా ఇంట్రస్టింగ్ ట్విస్టులు ఉండటంతో చివరిదాకా కథనం ఇంట్రస్టింగుగానే నడిపించాడు…
కథకు తగ్గ బీజీఎం… గుడ్… అక్కడక్కడా కథను సరదాసరదాగానే నడిపిస్తూ… కథానాయకుడు ఎలా ఈ కేసు నుంచి బయటపడ్డాడనే పాయింట్‌ను వీలైనంత కన్విన్సింగుగా చెప్పాడు దర్శకుడు… కథానాయికలు పాయల్, రాశిసింగ్ ఇద్దరూ వోకే… రాశిసింగ్ పాత్రకు కొంత ప్రాధాన్యం ఎక్కువ… దానికి తగ్గట్టు నటించింది… పర్లేదు, చూడొచ్చు… థియేటర్ నుంచి బయటికి రాగానే కొందరు మొహాలు బ్లర్ అయినట్టు, గుర్తుపట్టలేనట్టు కనిపించినా భయపడకండి, అది సినిమా టెంపరరీ ఎఫెక్ట్… అబ్బే, రిస్క్ ఎందుకంటారా..? వోకే, ఓటీటీలో వచ్చేవరకు ఆగండి..!!
Share this Article