Mani Kumar Maddipatla….. వేశ్య – విప్లవం
కదిలారు
కదిలించారు
Ads
నిస్వార్థంగా ప్రాణాలు అర్పించారు
చాలా విషయాలు మాదిరిగానే
చరిత్రలో నిక్షిప్తమైపోయారు
ప్రతిఫలం దక్కని అభాగ్యుల
జాబితాలోనే ఉండిపోయారు
ఆ చరిత్ర చదివో, దృశ్యరూపంలో చూశో
మనసుంటే
అదీ తెరుచుకుంటే
కన్నులు చెమ్మగిల్లడం మినహా
మరేమీ ఉండదు
ఆ కోవలోకే వస్తుంది దృశ్యరూపమైన హీరామండీ
పాకిస్తాన్‌లోని లాహోర్ అదో వేశ్య వాటిక
అందులో ఏముంది అంటే
శరీరాన్ని అప్పగించడం ఉంది
ఆధిపత్య పోరు ఉంది
ఒకరిని మరొకరు ముంచుకునే తెలివి ఉంది
ఆ క్రమంలో తమకు తాము ఆహుతి అయ్యే అజ్ఞానం ఉంది
నవాబులను దాసులను చేసుకునే తీరు ఉంది
తమ కంటి చూపుతో వారిని కట్టిపడేసే జానతనం ఉంది
కొంగుకు కట్టేసుకునే లౌక్యం ఉంది
అవసరం తీరాక ఆ నవాబును వదిలేసి
మరొకరిని చూసుకోవాలని అవగాహన ఉంది
చుట్టూ జరుగుతున్న పరిస్థితులు తెలుసు
అప్పుడు ఉధృతంగా సాగుతున్న
భారత స్వాతంత్ర్య సమరంపై అవగాహన ఉంది
అందులో పాల్గొన్న విప్లవకారులపై సానుభూతి ఉంది
వారికి తోడ్పడాలన్న తపన ఉంది
అందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేసే చేవ ఉంది
అసలు విషయానికి వస్తే
హీరామండీలో కథానాయిక మనీషా కోయిరాలా.
వరసే అయినా అసలు సిసలు ప్రత్యర్థి సోనాక్షి సిన్హా
మనీషా కూతుళ్లు అదితిరావు హైదరీ, షర్మిన్ సెగల్
ఈ నలుగురూ సామాన్య భాషలో చెప్పుకోవాలంటే ఇరగదీశారు.
మనీషా వేశ్య పెద్దలా కనిపించదు.
ఒక రాణి, ఆమె ఉండే హీరామండి రాణివాసంలా ఉంటుంది
ఎవరైనా తన దగ్గరకు రావాలంటుంది.
ఆ విషయంలో ఆమె హావభావాలు, కనబరిచిన దర్పం చూడాల్సిందే
వేశ్య బతుకు నుంచి వివిధ సందర్భాల్లో ఆమె మాటలు వింటుంటే
కన్యాశుల్కంలో మధురవాణి గుర్తుకువస్తుంది.
ప్రత్యర్థి సోనాక్షి అంతే పవర్‌ఫుల్.
కక్ష తీర్చుకునే పాత్ర. ఫలితంగా
ఎంత దీటుగా ఉన్నప్పటికీ
మనీషా ముందు దిగదుడుపే అనిపిస్తుంది.
అదితి విప్లవకారులకు సహాయం చేస్తూ ఉంటుంది.
ఆ క్రమంలోనే ఉరిశిక్షకు గురైంది. అదే ఇందులో హైలైట్
షర్మిన్ విప్లవకారుడిని ప్రేమించింది.
ఆ విప్లవకారుడిని దారుణంగా చంపిన పోలీసు అధికారిని కాల్చేస్తుంది
విషయం ఏమిటంటో పురుష పాత్రలన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్లుగానే కనిపిస్తాయి.
షర్మిన్ సైగల్ ప్రేమికుడి బామ్మ కూడా ఇతోధికంగా పోషించింది.
చాలా మంది అన్నట్టు చివరి మూడు ఎపిసోడ్లు ఈ సిరీస్‌కు హైలైట్.
హస్కీ వాయిస్‌తో నాట్యం వెనుకగా వచ్చే పాటలు వీక్షకుడిని కట్టిపడేస్తాయి.
సంప్రదాయం, హస్కీ గొంతు మిళితమై పాటకు కొత్త అందాన్నిచ్చాయి.
నాట్యం కనులకు, గానం వీనులకు విందు
నేపథ్యం వేశ్యా వాటిక అయినప్పటికీ
అశ్లీలానికి అస్సలు తావివ్వని సిరీస్.
అదే అసలు చెప్పుకోవాల్సిన విషయం.
కొసమెరుపు
ఒక దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు అంటే పాతికేళ్ళ క్రితం అక్కడి లైబ్రరీలో ఒక టైప్డ్ డాక్యుమెంట్‌ని అనుకోకుండా చూశాను. ఏదో వెతుకులాటలో అది కనిపించింది. ప్రాస్టిట్యూట్స్ ఇన్ ఫ్రీడమ్ దాని శీర్షిక.
విప్లవకారులకు సహాయం చేస్తోందని ఒక వేశ్యను అరెస్టు చేసి న్యాయాధికారి ముందు బోనులో నిలుచోపెడతారు. అదంతా ఓకే కానీ నీ దగ్గరకు వచ్చిన వాడిని పోలీసు అని ఎలా గుర్తించావు, చెంపదెబ్బ ఎలా కొట్టగలిగావు అని న్యాయాధికారి ఆమెను అడుగుతారు. నా అన్న విప్లవకారుడు. ఆయన స్నేహితులు చాలా మంది నాదగ్గరకు వస్తారు. వారికి నగదు ఇస్తా, సమాచారం ఏదైనా ఉంటే ఇస్తా. వారంతా నన్ను తమ సోదరిలా చూస్తారు. అయితే ఈ పెద్దమనిషి వస్తూనే నా భుజం నొక్కాడు. అమర్యాదకరంగా ప్రవర్తించాడు… అది చాలదా పోలీసు అని తెలుసుకోవడానికి అని ప్రశ్నిస్తుంది.
Share this Article