ఎక్కడో చదివినట్టు గుర్తు… పవన్ కల్యాణ్ మరీ జబర్దస్త్ రేంజ్ నాయకుడైపోయాడు అని… కారణమేందయ్యా అంటే… పిఠాపురంలో జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్లే ప్రచారంలో కనిపిస్తున్నారు అని… సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు, ఇక చిరంజీవి చెప్పినట్టు తను అందరివాడు ఎలా అయ్యాడు అని ఆ వార్త ప్రశ్నించింది…
తమ్ముడే కాబట్టి చిరంజీవి ఓ వీడియో సందేశం ఇచ్చాడు, అయిపోయింది… మర్యాదకు రాంచరణ్ కూడా దాన్ని షేర్ చేశాడు, ఒడిసింది ముచ్చట… నాగబాబుకు ఎలాగూ తప్పదు, పార్టీలో ఓ పోస్టులో ఉన్నాడు కాబట్టి, వేరే పనేమీ లేదు కాబట్టి… నాగబాబు కొడుకు వరుణ్ తేజకూ తప్పలేదు… సాయి ధరమ్ తేజ కూడా కనిపించినట్టున్నాడు… బన్నీకి పెద్దగా పవన్‌తో సత్సంబంధాలు ఉన్నట్టు కనిపించడు కాబట్టి పట్టించుకోలేదు, అల్లు అరవింద్ మాటాముచ్చటే లేదు…
అంటే, మెగా కంపౌండ్ నుంచే తనకు వంద శాతం సహాయసహకారాలు లేవు… వీళ్లు గాకుండా ఒక్క నాని మాత్రమే పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా మాట్లాడినట్టున్నాడు… తను ఆమధ్య జగన్ ప్రభుత్వ విధానం మీద కూడా ఏవో విసుర్లు విసిరినట్టు గుర్తు… నిజానికి ఇండస్ట్రీలో పెద్ద తలకాయల పరిస్థితే సున్నితంగా ఉంటుంది… వాళ్లు బాలయ్యలాగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే వేరు గానీ… రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటే ఇరకాటమే…
Ads
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం… యెల్లో కూటమికి వోటు వేయండి అని చెప్పాలంటే, రేప్పొద్దున జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, తనకు కోపమొస్తే, అసలే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద రుసరుసతో ఉన్నాడు… యెల్లో కూటమి పవర్‌లోకి వచ్చినా సరే ఏపీలో ఇండస్ట్రీకి పెద్ద శుభసంకేతాలు వచ్చిపడతాయని ఆశించలేరు… గతంలో కూడా ఏమీ లేదు కదా… సో, మాకెందుకొచ్చిన తలనొప్పి అనుకుంటారు ఎవరైనా… ఒకరిద్దరు పవన్ కల్యాణ్‌కు అడ్వాన్సులిచ్చిన నిర్మాతలకు ఎలాగూ తప్పదనుకొండి…
ఒకసారి గుర్తుతెచ్చుకొండి… శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఇదే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఎందరు నిలిచారు..? ఏమీ లేదు..! ఎంతసేపూ పవన్ కల్యాణ్ తన లోకం తనది… తన సినిమాలు తనవి… మిగతా ఇండస్ట్రీ ఇష్యూస్ జోలికి పోడు… సో, ఇండస్ట్రీ కూడా అలాగే ఉంటుంది కదా… జబర్దస్త్ కమెడియన్లు జనాన్ని ఎంటర్ టెయిన్ చేయగలరు తప్ప, కీలకమైన పొలిటికల్ ఇష్యూస్ జోలికి పోరు, పోలేరు, నిజానికి వాళ్ల అవగాహన కూడా సరిపోదు, ఏవో నాలుగు హైపర్ ఆది పంచ్ డైలాగులు వేయడం తప్ప… నిజానికి ఈసారి నయం, బీజేపీ-టీడీపీలతో పొత్తు కారణంగా కాస్త జనసేనకు రాజకీయ విలువ సమకూరింది…
అసలే పవన్ కల్యాణ్ మీద విమర్శ ఉండనే ఉంది… తన సిద్ధాంతాల్లో, తన పోకడల్లో లోతు ఉండదు, స్థిరత్వం ఉండదు, పైగా రాజకీయాల్ని కూడా ఓ సినిమా ప్రాజెక్టుగా భావించి, తన ఫ్యాన్సే తన కార్యకర్తలు అనే భావనలోనే ఉంటాడు… అందుకే ఇన్నేళ్లయినా సరైన పార్టీ నిర్మాణం లేదు… సో, అన్నీ గమనిస్తున్న ఇండస్ట్రీ పెద్దలు పవన్ కల్యాణ్ వెంట పోలోమని వచ్చే సిట్యుయేషన్ ఉండదు, లేదు, రాలేదు…!! సింపుల్ ఈక్వేషన్… ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో బాగుంటాం అనేదే మెజారిటీ పెద్దల ధోరణి… తప్పులేదు… వాళ్లూ వినోద వ్యాపారులే కదా…!!
Share this Article