Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… అవి ఆడ ఫిరంగులై ఉంటాయి… అందుకే సివంగులై గర్జించాయి…

May 10, 2024 by M S R

అప్పట్లో ఏదో సినిమాలో సుద్దాల అశోక్ తేజ అనబడే ఓ ఘన రాతగాడు ఓ పాట రాశాడు… అదిలా సాగుతుంది… “కాళ్లకి ఎండీ గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్… కొప్పుల మల్లెల దండల్, లేకున్నా చెక్కిలి గిల్ గిల… రంగే లేని నా అంగీ, జడ తాకితే అయితది నల్లంగీ… మాటల ఘాటు లవంగి, మర్లపడితే అది సివంగి… తీగెలు లేని సారంగి, వాయించబోతే అది ఫిరంగి..’’

బోలెడు ఆశ్చర్యమేసింది… సుద్దాల కలం నుంచి పిచ్చి ప్రాసలు, ప్రయాసలు విని… ఐనా సినిమా పాటలదేముందిలే… ఇలాంటివే హిట్టయిపోతాయి కదా… కుర్చీ మడతబెట్టిన పాట ఇప్పుడు జాతిగీతం కాలేదా ఏం..? పైగా హిట్ పాటల్లో అర్థాలు, గూఢార్థాలు, మర్మార్థాలూ, పరమార్థాలూ, విశేషార్థాలూ గట్రా చూడొద్దు… జస్ట్, హమ్ చేసేయాలి… అంతే…

మల్లెదండలకూ చెక్కిలి గిలిగిలికీ లంకె ఏమిటో అడగొద్దు, ఆలోచించొద్దు… ఓసారి వైరాగ్యంతో నవ్వుకుని వదిలేయాలి… సేమ్, రంగే లేని అంగీ, జడ తాకితే నల్లంగి అవుతుందట, డై అంత నాసిరకమా అని నవ్వొద్దు సుమీ… ఇక్కడ ఇంకా బోల్డంత ఆశ్చర్యం, కాస్త జాలి కలిగింది ఎక్కడంటే… మాటల ఘాటు లవంగి, మర్లపడితే అది సివంగి…  అనే ప్రయోగాలు… మామూలుగా లవంగం లవంగమే…

Ads

లవంగం అంటే నపుంసక లింగమే కదా… మరి లవంగి అని రాయడమేమిటి..? స్త్రీ లింగమైతే లవంగం కాస్తా లవంగి అవుతుందా..? అంటే పురుషుడికి వర్తింపజేస్తే లవంగుడు అవుతాడా..? హేమో… ఆ గీత రచయితకే తెలియాలి, అసలే జాతీయ అవార్డులు కొట్టిన పెన్ను మరి… ఏది రాసినా ఓ రేంజులో ఉంటది కదా…

పొద్దున్నే ఆంధ్రప్రభలో ఎడిట్ పేజీ చూడబడ్డాను… ఆ పత్రికలో వచ్చే స్టోరీలే కాదు, వ్యాసాలే కాదు… చివరకు హెడ్డింగులు కూడా అబ్బురమే… పొద్దున్నే నవ్వుకునే విషయంలో అదెప్పుడూ మనల్ని నిరాశపరచదు… మీరెన్ని పత్రికలు చదివినా సరే, ఈ పత్రికను మాత్రం చదవడం అలవాటు చేసుకోవాలి… తేలికగా నవ్వగలిగితే మనసుకు ఎంత రిలీఫ్, ఎంత రిలాక్స్… స్ట్రెస్ పోతుంది, బీపీ తగ్గుతుంది… గుండెపైనా భారం తగ్గుతుంది…

prabha

1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన రోజును పురస్కరించిన ఏదో వ్యాసం… దానికి పెట్టిన శీర్షిక ఇది… ‘‘ఫిరంగిలే సివంగిలై…’ ఇక్కడ ఏకవచనం అయితే ఫిరంగే సివంగై అని పడాలి… బహువచనం అయితే ఫిరంగులే సివంగులై అని పడాలి… ఇది అటూఇటూ కాని సివంగి అనుకుంటా… ఇలా అపసోపాలు పడింది ఫాఫం…

ఐనా ఫిరంగులు సివంగులు కావడం ఏమిటి..? అవి ఆడ ఫిరంగులా సార్లూ..!? ఐతే వోకే… కానీ మరీ పాత్రికేయులు కూడా ఇలా సుద్దాల అశోక్ తేజను ఆదర్శంగా తీసుకుంటే ఎలా..? సినిమాల్లో ఏం కూసినా, ఏం రాసినా చెల్లుతుంది… పత్రికలకూ అంతేనా..? ఇక్కడే మరొకటీ చెప్పుకోవాలి…

ఈమధ్య పత్రికల్లో ‘కవితనే’ ‘కేసీయార్‌నే’ వంటి పదాలు కొత్తగా కనిపిస్తున్నాయి… కవితే, కేసీయారే అని కదా రాయాల్సింది… మరి ఈ ’నే’ ఎలా వచ్చి చేరుతోంది ఆ పదాల పక్కన… ‘దెబ్బతిన్నది కవితే’… ఇది కదా కరెక్టు… కవితనే దెబ్బతీశారు అనేది వేరే సందర్భానికి వర్తిస్తుంది… అక్కడ కవితనే అని రాస్తే కరెక్టు… ఆ తేడా కూడా వదిలేశారు మన తెలుగు పాత్రికేయులు… ప్చ్, నాలాంటి పామరులకూ తెలిసేలా తప్పులు రాస్తే ఎలా మీడియా సార్తూ..!? టీవీల్లో స్క్రోలింగ్, ప్లేట్లు, హెడ్డింగుల భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు..! అవి మరీ రుధిరవర్షాలు, పోస్కోలు, ఆటోస్పైలు.,,!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions