Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రివ్యూలు కూడా ఫార్ములాలోనే ఇమడాలా..? ఇలా రివ్యూలు రాయలేమా..?!

May 11, 2024 by M S R

Priyadarshini Krishna…..  ఇంతకుముందు చాలాసార్లు నేను అన్నాను, మళ్ళీ చెప్తున్నాను… సినిమా రివ్యూ అంటే సినిమాలోని ఇతివృత్తం లేదా కథని విశ్లేషించడం, పాత్రల పోకడను, దర్శకుడు ఆయా పాత్రలని మలిచిన తీరుని , ఆయా పాత్రలను పోషించిన నటుల నటనాచాతుర్యాన్ని చర్చించడం కాదు.

ప్రేక్షకునికి ఆ సినిమాని పూర్తిగా పరిచయం చెయ్యడం. సినిమాలోని వివిధ విభాగాలు ఆ సినిమాలో ఎలా మెరుగైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి అనే అంశాలను చర్చించడాన్ని రివ్యూ అనాలి. ఇవాళ్టి వరకు తప్పడ్ సినిమాపై ఏఫ్బీ లో వచ్చిన అనేకానేక వ్యాసాలు కేవలం కథని, అందులోని పాత్రలు, ఔచిత్యాలను పోకడలు వంటి అంశాలపై థీసీస్లు సమర్పించారు.

ఉప్మా వండి దానిని పులిహోరా అనలేము, ఎందుకంటే మనకి చాలా కాలంగా పులిహోర మాత్రమే కాదు ఉప్మా కూడా తెలుసు.

Ads

అలాగే బిర్యానీ వండి దానిని పులిహోర అని నమ్మించలేము. మనకి అది కూడా తెలుసు కాబట్టి.

మేఘసందేశం రాసి అది కుమారసంభవం అనలేము, మోనాలిసా పెయింటింగ్ వేసి వన్ గో వర్క్ అనలేము. ఎందుకంటే అవి విశ్వ విఖ్యాతాలు.

ఒక ప్రోగ్రెసివ్ కవి రాసిన కవిత్వాన్ని ఏంటీ ఈ కవిత్వం శ్రీశ్రీ ఇలా రాయలేదు. కృ. శా కూడా ఇలా రాయలేదు అని ఒక చట్రంలో బిగించి కొలవలేము. పైపెచ్చు ఆహా ఓహో అనగలం. అలాగే ఒక మేధావి రాసిన నవలని ఇదేం రాత, రంగనాయకమ్మలా రాయలేదు, వడ్డెర చండీదాస్ లా రాయలేదు అనం. ఎందుకంటే అది ఆ రాసినవారి సృజన. వారి ఊహాపోహ శక్తికి తగినట్లు ఇతివృత్తాన్ని మలిచి పాత్రలని పుట్టించి, వాటికి తగిన సన్నివేశాలని కల్పిస్తారు.

అలాంటి నవళ్లను చదువుతాం నచ్చితే ఫ్రెండ్స్ ని చదవమంటాం, లేకుంటే టైం వేస్ట్ అని చెప్తాము. ఒక నవల గురించి ఆ నవలలోని కథాకథనం సన్నివేశాలు, పాత్రల గురించి ఎలాగైతే ఈకలు పీకమో అలాగే ఒక పెయింటింగ్ గురించి, ఒక కవిత గురించి పుంఖానుపుంఖాలుగా థీసిస్లు రాయము. రచయిత, చిత్రకారుడు రాయని, వేయని subtext లను మనకి మాత్రమే తెలిసినట్లు చెప్పము.

కానీ …. సినిమా విషయానికొస్తే మాత్రం మనందరం ఆటాప్సి డాక్టర్లమే…!!

దర్శకుడు ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుని అది జనాల మెప్పు పొందాలి అనే ఆలోచనతోనే డెవలప్ చేసి సీన్లను స్క్రీన్ప్లే ని తయారు చేస్తాడు . దానికి ఒక టీమ్ ఉంటుంది నెలల తరబడి కసరత్తు చేస్తారు. అది అందమైన దృశ్యకావ్యం అవుతుందా కాదా అనేది వివిధ అంశాలమీద ఆధారపడి ఉంటుంది. అయితే పునాది మాత్రం కథ, కథనం, పాత్రలదే.

ఈ పాత్ర ఇలా ఎందుకుంది ఆ పాత్ర అలా ఎందుకు లేదు అని మనం వెళ్లి దర్శకునితో తగువేసుకున్నా ఉపయోగం ఉండదు.
ఏ పాత్ర ఎలా ఉండాలో అది అతని ఊహాపోహశక్తి. దానిని మనమెలా నియంత్రించగలం.
ఇక తప్పడ్ అనే సినిమాలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నదాన్నిబట్టి చూస్తే ముందు script పబ్లిష్ చేసి, ఒపినియెన్స్ తీసుకుని అప్పుడు సినిమా తియ్యాలి.
ఆ చర్చ అలా వుంచితే….
కథ అల్లుకునేటప్పుడే, కథకుడు పాత్రలను అల్లుతాడు. వాటి స్వభావాలను అల్లుతాడు. పోనుపోను కథ నడుస్తున్న క్రమంలో దృశ్యాలను పేర్చే క్రమంలో కొన్ని లాకులు చిక్కుముడులు వాటంతట అవేపడిపోతాయి. నేర్పరి ఐన కథకుడు పెద్ద చిక్కును కూడా తానే అలవోకగా విప్పి మనల్ని ఒప్పిస్తాడు. కొన్నిసార్లు అనేకానేక చిక్కులు ఒకేసారి పడటంతో కథకి ఎక్కువ ఇంపార్టెంట్ ఐన చిక్కుపైనే ద్రుష్టి పెట్టడం వల్ల ప్రేక్షకునికి అది పేలవంగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో కూడా అదే జరిగింది. హీరో బలవంతుడై , హీరోయిన్ ని సాత్వికంగా చూపించలేడు, అలా అని హీరోని చచ్చు దద్దమ్మగా చూపించలేడు. హీరో కాంటెంపరరీగా ఉండాలి, అలాంటప్పుడు హీరోయిన్ ని కూడా కాంటెంపరేరీగా చిత్రీకరిస్తే అప్పుడు అమ్ములా వంటింటి కుందేలుగా చూపించడానికి కుదరదు. ఆ కాంట్రాస్ట్ కోసమే శివాని, నేత్ర పాత్రలను సృష్టించి బాలెన్స్ చెయ్యాలనుకున్నాడు.
అంతటి నేత్ర పాత్రను కూడా డొల్ల చేసేసాడు. మేధస్సు, కెరీరపరంగా విజేతగా సృష్టించినా ఆమె రెండో వైపు సగటు స్త్రీగా గృహహింసను, హ్యూమిలేషన్ ని భరించాల్సిన దీన పాత్రగా కుదించాడు. లేదంటే అమ్ము పాత్రని అది డామినేట్ చేసే ప్రమాదం చాలా వుంది.
అలాగే అమ్ము చేయలేని (సింగల్ మదర్ గా) పని శివాని ద్వారా చేసి చూపించాడు. ఆధునిక ఉన్నత కుటుంబంలోని మహిళ, ఎగువ మధ్యతరగతి మహిళ, మధ్యతరగతి గృహిణి చివరకి క్రింది స్థాయి గృహకార్మికురాలు – అందరు ఏదో తీరుగా వివాహం ద్వారా వచ్చిన బాధలను, హింసలను చవిచూస్తున్నవారే అనేది దర్శకుడు చెప్పాలనున్నాడు. కానీ బలంగా చెప్పలేకపోయాడు.
ఒకరికొకరు ఇన్స్పిరేషన్ గా కథని మలిచాడు. కానీ, అదే అంశాన్ని కథనంలో తీసుకు రావడం మిస్ అయ్యాడు. ఒక గీతని పెద్దది చెయ్యాలంటే దానిపక్కనే చిన్నగీత గీయాలి అనే సూత్రం దగ్గరే ఆగిపోయాడు.
ఈ కథలో ముగ్గురు మగాళ్లు, అలా విలనీగా లేకుంటే ఆయా మహిళల మీద ( స్త్రీ పాత్రల మీద) మనకి సహానుభూతి కలగదు.
వాడంతా మంచిగా చూసుకుంటే నీకేం మాయరోగం ఒక్కసారి కొడితే ఓర్చుకోలేవా అని తరతరాల వాదమే ప్రేక్షకునిలో కలుగుతుంది.
అలా కాకుండా ఒక్క దెబ్బకే ఇలా చెయ్యాలా ? అవును, వందైనా ఒకటితోనే మొదలు, అందుకే ఆదిలోనే తుంచేయాలి అనే ఫీలింగ్ ప్రేక్షకునిలో అంత బలంగా కలిగించలేకపోయాడు. దానికి కారణం అల్లుకున్న సన్నివేశాలు.
వరసగా వచ్చే సీన్లలో అమ్ము హ్యూమిలేషన్ గురి అవుతూ తనకి తానే ఒక సాచురేషన్ పాయింట్ కి వచ్చి నలుగురిలో కొట్టడం అనే దగ్గర బరస్ట్ అవుట్ అయినట్లు ఆడియెన్స్ గా మనకి అనిపించలేదు. అందుకే మనం కన్విన్స్ కాలేకపోయాము.
ఒకసారి కొట్టడం కాదు, అసలు ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు కొట్టాలి, ఆ హక్కు ఎవరికీ ఎవరు ఇచ్చారు అనే చర్చ దర్శకుడు అనుకున్నంత బలంగా వినిపించలేకపోయాడు. పద్నాలుగేళ్ళ వనవాసం చేసి సీత సహచర్యంలో సీతను అర్థం చేసుకున్న రాముడు ప్రజల మాటతో భార్యను త్యజించాడు. పిల్లల పెంపకం కోసం అంతకాలం బ్రతికున్న సీత భర్తకు ఎలాంటి శిక్ష విధిస్తే తాను పడిన వ్యధ అర్థమవుతుందో అలోచించి అత్మత్యాగం చేసింది.
ఏమ్మా, ఇంతకాలం బ్రతికున్నావు, భర్త పిలిస్తే పోవచ్చు కదా అనే అమ్మలక్కలు సైతం సీత సరిగ్గా చేసింది. రామునికి ఆ బాధ తెలియాలి అని కుమిలి కుమిలి ఏడ్చి కళ్ళుతుడుచుకుని కొంగుకొసల్లో చీది, ఇంటికివెళ్ళినా సీత బాధ తన బాధ అనుకునేలా ప్రేక్షకులని మైమరిపింపజేయడమే కథకుని గొప్పదనం. ఒక కథ గాని పాత్రలు గాని పది కాలాలపాటు జనరంజకంగా ఉండటానికి ఏం చెయ్యాలో చెప్పే గైడులే రామాయణ భారత కథలు. ఉదాహరణలు.
పిచ్చిమొహం సీత అని ఇప్పటికి కూడా అనము. కానీ, పిచ్చిమొహం అమ్ము అని కొందరైనా అనడానికి రచనే పెద్దలోపం. ఇంతకీ నే చెప్పేదేమంటే కథ, కథనం, సన్నివేశాలు, పాత్ర ఔచిత్యాలు, కొన్ని పాత్రల నటన తప్ప సినిమా టెక్నికల్‌గా బాగుంది… (ఇది తప్పడ్ సినిమా మీద పాత రివ్యూయే… మరోసారి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions