Sai Vamshi….. ప్రేత కల్యాణాలు.. అక్కడ ఆత్మలకు పెళ్లిళ్లు చేస్తారు…
2022 జులై 18న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ఇంట్లో శోభ, చంద్రప్పలకు వివాహం జరిగింది. ఆ పెళ్లి చుట్టుపక్కల చాలా పేరు పొందింది. ఎంతోమంది చెప్పుకునే విశేషమైంది. ఎందుకు? ఏమిటి ఆ పెళ్లిలో వింత?
ఉంది. శోభ, చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే మరణించారు. మరి పెళ్లి ఎవరికి? వారి ఆత్మలకు. ఆత్మలకు పెళ్లా? నిజంగా చేస్తారా? ఆత్మలు ఆ పెళ్లికి వస్తాయా? కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ ఈ ఆచారం అమలులో ఉంది. ఇలా ఆత్మలకు పెళ్లి చేయడాన్ని ‘ప్రేత కల్యాణం’ అంటారు.
అసలీ ఆచారం ఉద్దేశం ఏమిటి? యుక్తవయసు రాకముందే కొందరు పిల్లలు రకరకాల కారణాలతో చనిపోతారు. అటువంటి వారి ఆత్మల శాంతి కోసం పెళ్లి చేస్తే మంచిదని వారి బంధువులు నమ్ముతారు. చనిపోయినవారికి, మరో చనిపోయిన వారితోనే పెళ్లి చేస్తారు. వారి గుర్తుగా చిన్న బొమ్మలను తయారు చేసి, వాటికి పట్టుబట్టలు, బాసికాలు కట్టి అచ్చం బొమ్మలపెళ్లి చేసినట్లు చేస్తారు. చనిపోయినవారి ఆత్మలకు పెళ్లి చేస్తేనే వారి కోరిక తీరి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
ఆధునిక కాలంలో కూడా ఈ ప్రేత కల్యాణాలు ఎందుకు? చదువుకున్నవారు తమ పెద్దలకు నచ్చజెప్పలేని పిరికితనం, మనకెందుకులే అనుకునే మనస్తత్వం, ప్రేత కల్యాణాలను సంప్రదాయంగా భావించి మౌనంగా ఉండే విద్యావంతులు.. ఇవే కారణాలని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. కుటుంబాల్లో ఏవైనా చెడు విషయాలు జరిగితే దానికి కారణం కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మలే అని భావించి, వాటికి పెళ్లి చేసేవారు ఉన్నారు.
చనిపోయినవారికి పెళ్లి చేయకపోతే, ఆ తర్వాత పుట్టిన తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లిళ్లు కావని, ఒకవేళ జరిగినా వారి కాపురాలు సజావుగా జరగవని భావించడం కూడా ప్రేత కల్యాణాలకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ విషయాన్ని కొందరు జోతిష్యులు సైతం ప్రోత్సహిస్తుంటారు. ఇందుకోసం చనిపోయినవారి జాతకాలను చూసి, వారిద్దరికీ జోడీ కుదిరితేనే పెళ్లి చేయిస్తారు.
ప్రేత కల్యాణాలు మన దేశంలోనే కాదు, చైనా. సూడాన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ అమలులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొన్నిచోట్ల అధికారిక చట్టాలూ చేశారు. చైనాలో మూడువేల ఏళ్ల క్రితమే ఆత్మలకు వివాహం చేసే పద్ధతి మొదలైందని అంటారు.
1949లో కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని నిషేధించినా, ఇంకా లోలోపల జరుగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ఆత్మలకు వివాహం చేయడం చట్టబద్ధం. అయితే అందుకు సరైన కారణాలతోపాటు దేశాధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. ప్రేత కల్యాణాల వెనుక ఇన్ని విషయాలున్నాయి…. – విశీ
ఈమధ్య ఏదో తెలుగు సినిమాలో ఏకంగా ఆత్మకే పెళ్లికూతురు అలంకరణ చేసి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి ఓ అత్యంతాభ్యుదయవాదికి ఇచ్చి పెళ్లి చేయబోతారు… కల్యాణము చూతము రారండీ అంటూ ఊరు, సర్కిల్ అన్నీ ఒక్కచోట చేరతాయి సంబురంగా… సరే, అది డిఫరెంట్, సందర్భం వచ్చింది కదాని గుర్తుచేశాను, అంతే… దోషం పోవాలని ముందుగా చెట్టుకో, కుక్కకో, గాడిదకో పెళ్లి చేసి, తరువాత అసలు వధూవరుల పెళ్లి చేస్తుంటారు కదా, అన్నీ నమ్మకాలే… — ముచ్చట
Share this Article