Venkataramana Kannekanti….. *ఓరుగల్లు హీరా ‘మండి’ పిడికిలెత్తిన పౌరుషం*
**************************
ఇటీవల కాలంలో OTT ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తున్న *హీరామండి – ద డైమండ్ బజార్* వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి కధానాయికలు పోటీలు పడి మరీ నటించారు… 1920 సంవత్సర ప్రాంతంలో ఉమ్మడి భారత దేశంలో భాగమైన కరాచీలో ఒక వేశ్యావాడగా హీరామండి ఉంటుంది.
Ads
అప్పటి, కాలమాన పరిస్థితుల్లో కొన్ని విలువలతో కూడిన తమ వృత్తిని పాటించే ఆ వేశ్యలు, వారి యజమానులు (వారినే జాన్ అని పిలుస్తారు) చివరగా దేశ స్వాతంత్రం కోసం అక్కడి బ్రిటీష్ అధికారులతో ఎలా తలపడ్డారు, వారిని ఎలా హత మారుస్తారనేదే ఈ హీరామండి సీరీస్ ప్రధాన కథా నేపధ్యం.
సమాజంలో చిన్న చూపు కలిగిన, అతిపురాతన వృత్తి పాటించే వేశ్యలు తమ వృత్తిని పాటిస్తూనే దేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యులు కావడం వారిపట్ల గౌరవాన్ని కలుగ చేయడంతోపాటు వారిలోని దేశభక్తిని అభినందించకుండా ఉండలేం.
అయితే, ఇదే మాదిరి పోరాటం వరంగల్ జిల్లా కేంద్రంలోనూ జరిగి చరిత్రను సృష్టించింది.వరంగల్ నగర శివారు గ్రామాలకు చెందిన వేశ్యావాడలకు చెందిన వందలాది మంది మహిళలు ఇటీవలి కాలంలో స్థానిక స్వతంత్ర పోరాటం మాదిరిగా జరిగిన ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు.
ఇక వివరాలకొస్తే, భారత దేశ చరిత్రలో స్వతంత్ర పోరాటం, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మాదిరిగా తెలంగాణా ప్రత్యేకం రాష్ట్ర విమోచన మలిదశ ఉద్యమం న -భూతో, న-భవిష్యతి మాదిరిగా జరిగింది.
ఈ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనని వర్గం, కులం, మతం లేదు. చిన్న పాపల నుండి పండు ముదుసలి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ధర్నాలు, వంటా వార్పులు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, ఆత్మ బలిదానాలు, కార్యాలయాల బహిష్కరణలు, సకల జనుల సమ్మెలు, మానవ హారాలు ఇలా ఎన్నో రకాల నిరసన మార్గాలు మొత్తం తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో జరిగాయి.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేయని వర్గం లేదు అని చెప్పటానికి మరో ఉదాహరణ చిత్తు కాగితాలు ఏరుకొని పొట్టపోసుకునేవాళ్ళు సైతం సంఘంగా ఏర్పడి ఉద్యమించారు. ఈ నిరసనలతో భాగంగా వరంగల్‌లో ఒక వర్గం వారు చేసిన ఉద్యమం మొత్తం తెలంగాణా ఉద్యమ చరిత్రలోనే ప్రత్యేకంగా లిఖించాల్సిన ప్రత్యేక అంశంగా ఉంది.
వరంగల్ పట్టణానికి సమీప శివారులలో ఉండే రెండు మూడు గ్రామాలు ( పేర్లు తెలపడం లేదు ) వేశ్యావాడలకు ప్రసిద్ధి. స్వతహాగానే, వారి వృత్తికి సంబందించిన వ్యవహారం మినహా మరేవిధమైన అంశాలలో వారు పెద్దగా కలుగ చేసుకోరు. (వాళ్ల జోలికొస్తే నక్సలైట్లను కూడా సహించలేదు) అక్కడి నగర వాసులు కూడా, వారి వృత్తికి సంబందించిన వారు, అక్కడికి వెళ్లే వారి మధ్య జరిగే వ్యాపారం మాదిరిగా పట్టించుకునేవారు కాదు.
కాగా, తెలంగాణా ఉద్యమంలో వేశ్యావాడలు ఉన్న గ్రామంలోని కుటుంబాలకు చెందిన ఒక యువకుడు కరుణాకర్ ప్రత్యేక తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. దీనితో, ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది మహళలు ఆ బలిదానం చేసుకున్న యువకుడి అంతిమ యాత్రలో పాల్గొని తమలోని తెలంగాణా ఉద్యమ కాంక్షను ప్రపంచానికి చాటారు.
ఆ యువకుడి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేస్తూ, ప్రత్యేక రాష్ట్ర సాధనకై మరో పదిరోజుల తర్వాత కూడా వరంగల్/ హన్మకొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సె- వర్కర్ల నిరసన ప్రదర్శన వరంగల్ నగర ప్రజలనే కాక మొత్తం రాష్ట్రాన్నే ఆకర్షించింది. వారి వృత్తి పట్ల చులకన భావం ఉన్నప్పటికీ తమలో ఉన్న ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ప్రతీ ఒక్కరూ అభినందించారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేదేమంటే, 1920 లో హీరామండిలో ఏవిధంగానైతే, స్వరాజ్యం కోసం మొత్తం హీరామండిలోని ఆ సె- వర్కర్లు (తవాయఫ్ లు) ఉద్యమించి చరిత్రలో నిలిచారో, వరంగల్ పట్టణంలోనూ జరిగిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ అదే విధమైన స్ఫూర్తిని ప్రదర్శించి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో తమదైన ప్రత్యేక చాఫ్టర్ ను ఇక్కడి గ్రామాల సె- వర్కర్లు స్వంతం చేసుకున్నారు. ఇది చరిత్ర సత్యం…
——————————————————————————————————————-
( హీరామండి సీరీస్ చూడడంతో వరంగల్ లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తమవంతుగా సె^ వర్కర్లు పాల్గొన్న విషయం మరోసారి మదిలో రావడంతో ఇది రాయడం జరిగింది… రచయిత)
Share this Article