రాజును చూసిన కళ్లతో… అని ఓ పాత సామెత..! బాహుబలి యానిమేటెడ్ ప్రీక్వెల్ చూస్తే అలాగే అనిపిస్తుంది… బాహుబలి ఒకటి, రెండు పార్టులను థియేటర్లలో ఆ ఇంటెన్స్ డైలాగులు, ఆ సౌండ్ క్వాలిటీతో చూశాక ఈ యానిమేటెడ్ ప్రీక్వెల్ ఓటీటీలో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది… ప్చ్, నిరాశ కలుగుతుంది…
మామూలుగానే తెలుగు ప్రేక్షకులకు, అంతెందుకు ఇండియన్ ఆడియెన్స్‌కు యానిమేటెడ్ కంటెంట్ పెద్దగా పట్టదు… అప్పట్లో రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య ఏదో యానిమేటెడ్ మూవీ చేస్తే మన తెలుగు వాళ్లయితే పెద్దగా పట్టించుకోలేదు… మన నటీనటులు తెర మీద కనిపించి హీరోయిజమో, విలనిజమో, రొమాన్సో చేస్తుంటేనే కదా మనకు కిక్కు… ప్రభాస్ కేరికేచర్ వేరు, ప్రభాస్ వేరు కదా…
బాహుబలి సినిమాలది తెలుగు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలకు సంబంధించి ఓ అధ్యాయం… సినిమా క్వాలిటీకన్నా మార్కెటింగులో, తద్వారా వసూళ్లలో కొత్త ఉరవడి, ఒరవడి… సో, ఆ సినిమాలకు సంబంధించిన ప్రీక్వెల్ వంటి యానిమేటెడ్ సీరీస్ అంటే కొంత ఆసక్తి క్రియేటైంది… పైగా రాజమౌళి ప్రాజెక్టు, స్వయంగా ప్రమోషన్లలో పాల్గొన్నాడు… కాకపోతే దర్శకులు వేరు… ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో ఉంది…
Ads
బాహుబలికి ముందు స్టోరీ కాబట్టి ఆ ఆసక్తి… ప్రత్యేకించి బాహుబలి, భల్లాలదేవ, శివగామి, కట్టప్ప ప్రధాన పాత్రలు… ఒక్కొక్కటీ 22 నిమిషాల 9 ఎపిసోడ్లు… ఇందులో రక్తదేవ అని ఓ క్రూరుడైన విలన్… రాజులు, రాజరికాలు, యుద్ధాలు, కుట్రల కథే కాబట్టి రక్తదేవ పాత్ర పేరుతోపాటు ఆ కేరక్టర్‌ను కూడా వీలైనంత క్రూరంగా చూపించడానికి ప్రయత్నించారు…
బాహుబలి సినిమాల్లో బాహుబలి వర్సెస్ భల్లాలదేవ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే కథ… ఈ సీరీస్‌లో ఆ ఇద్దరూ కలిసి రక్తదేవ అనే విలన్ ఆటకట్టించడం… ఐతే ట్విస్ట్ ఏమిటంటే..? బాహుబలి సినిమాల్లో కట్టప్ప బాహుబలిని వెనుక నుంచి పొడిచి చంపుతాడు..? కట్టప్ప ఎందుకలా చేశాడు అనే పాయింట్‌తో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ లేవదీసి బాహుబలి రెండో పార్టుకు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు…
ఈ సీరీస్‌లో కట్టప్ప రక్తదేవకు సపోర్ట్… దానికి వెల్లడించిన కారణం పెద్ద కన్విన్సింగుగా ఉండదు, ఆకట్టుకోదు… అన్నింటికీ మించి మైనస్ ప్రభాస్, రానా తదితర పాత్రల రూపురేఖలు, హావభావాలు మనకు పెద్దగా నచ్చవు… డబ్బింగ్‌తో సహా..!! బాహుబలి సినిమాల ప్లస్ పాయింట్లలో పాటలు కూడా… ఎంఎం కీరవాణి ప్రతిభ పాటలతోపాటు బీజీఎంలో బాగా కనిపిస్తుంది… కానీ ఈ సీరీస్‌లో ఆయన వారసుడు కాలభైరవ తండ్రినే అచ్చంగా అనుసరించే ప్రయత్నం చేశాడు, బీజీఎం పర్లేదు…
యుద్ధాలు, ఎత్తుగడలు గట్రా కథనంలో సరిగ్గానే ఇమిడాయి… కానీ లెంత్ కావచ్చు, సాగదీత కావచ్చు, మిగతా ఎమోషన్ల కొరత కావచ్చు… కొన్ని ఎపిసోడ్లు తేలిపోయాయి… బోర్ కొడతాయి… సరే, ఓటీటీ కాబట్టి చకచకా మౌజ్ కదిలిస్తూ సాగిపోవచ్చు… అసలే ఓవర్ హైప్ కదా, అంతటి రాజమౌళి క్రియేషన్ అనుకుని చూడటం మొదలుపెడితే నిరాశ తప్పదు… జస్ట్, పర్లేదు..! అంతే..!!
అబ్బే, బాహుబలి సినిమాలతో, అందులోని ప్రేమకథలు, మిగతా ఎమోషన్లతో పోల్చుకుంటే ఎలా, దీన్ని సపరేటుగా ఓ సీరీస్‌గా చూడాలి కదా అంటారేమో… కుదరదు… ఆ సినిమాల కథకు ఇది ప్రీక్వెలే కాబట్టి, ఆ సినిమాలే బుర్రలో తిరుగుతుండగా సీరీస్ చూస్తాం కాబట్టి… ఆ పాత పాత్రలే కాబట్టి… సో, పోలిక తప్పదు, నిరాశ కూడా తప్పదు..!! ఇదీ బాహుబలి – Crown of Blood సంగతి…
అవునూ… చిన్న ప్రశ్న… తెరపై కనిపించేది ఒరిజినల్ నటీనటులు కాదు నిజమే, కానీ వాళ్ళ రూపురేఖలను, వాళ్ళ ఇమేజ్ ను వాడుకుంటున్నారు కదా, వాళ్ళు రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చా..? లీగల్ గా నిలుస్తుందా..? ఆఫ్ కోర్స్, రాజమౌళిని డిమాండ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో..?
Share this Article