ట్రింగ్… ట్రింగ్… హెలో ఎవరండీ..? సర్, మీరు సిద్ధార్థ్ కాక్ గారేనా..? ఔనండీ, ఎవరు మీరు..? అయ్యా, మేం అంధేరి పోస్టాఫీసు నుంచి చేస్తున్నాం… వోకే, వోకే, చెప్పండి సార్…
మీరు దూరదర్శన్‌లో నిర్వహించే సురభి షో కోసం వచ్చే పోస్టు కార్డులతో ఆఫీసు నిండిపోతోంది… వాటిని పెట్టడానికి ప్లేస్ సరిపోవడం లేదు, సార్టవుట్ చేయడానికి మ్యాన్ పవర్ లేదు… మీ కార్డులను మీరు తీసుకెళ్లండి, తప్పదు… తరువాత మమ్మల్ని ఏమన్నా ఫలితం ఉండదు ప్లీజ్…
ఫోన్ కటయింది… తప్పేదేముంది..? ఆయన ఓ ట్రక్కు అద్దెకు మాట్లాడుకుని సదరు పోస్టాఫీసుకు వెళ్లాడు… ఆఫీసు బయట బ్యాగుల్లో గుట్టలుగా కట్టలుగా కార్డులు.,. హమాలీలను మాట్లాడుకుని వాటిని ట్రక్కుల్లో ఎత్తుకుని వచ్చాడు తన ఆఫీసుకు…
Ads
ఒక వారం వాటి లెక్క చూస్తే అక్షరాలా 14 లక్షల పోస్టు కార్డులు వచ్చాయి, అదీ ఒక్క టీవీ షోకు… ఇదంతా నిజమే…
ఆ షో పేరు సురభి… 1990 నుంచి 2001 వరకు నడిచింది షో… మొదట దూరదర్శన్‌లో వచ్చేది… తరువాత స్టార్ ప్లస్ సండే మార్నింగ్ స్లాటులోకి మార్చారు… ఆయన సొంత సంస్థ సినిమా విజన్ ఇండియా ఆ షో నిర్మించేది… ఆయనకుతోడుగా రేణుకా సహానీ పాల్గొనేది… ఆమె నవ్వు అప్పట్లో చాలా ఫేమస్… ఇండియన్ కల్చర్ మీద సుదీర్ఘంగా నిర్వహించబడిన షో అది…
సిమిలర్ షో మరొకటి లేదు ఇండియన్ టీవీల్లో… అనేక గ్రామీణ సంస్కృతులను పరిచయం చేసేది, కంపిటీషన్ నిర్వహించేది… ఈ షోకు మొదట్లో 4, 5 లెటర్లు వచ్చేవి వారానికి… తరువాత 100 వరకూ పెరిగాయి మెల్లిగా… అప్పట్లో ఇంటర్ నెట్ లేదు కదా… ఎప్పుడైతే లెటర్ల సంఖ్య పెరిగిందో, వాటిని ఓపెన్ చేసి చదవడం కష్టమైపోయి, కార్డుల మీద రాయాలని అప్పీల్ చేశారు…
ఇక ఎప్పుడైతే వారానికి పదీ, పద్నాలుగా లక్షలకు ఈ వరద చేరిందో… సదరు బ్రాంచ్ ఆఫీసు, హెడ్డాఫీసుకు, ఆ హెడ్డాఫీసు ఏకంగా కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది… ఇదంతా నిజమే…
అరె, మనం గ్రామీణుల క్షేమసమాచారాల కోసం కదా కార్డు మీద సబ్సిడీ ఇస్తున్నాం, మరి ఈ టీవీ షోలకు మన సబ్సిడీ ఉపయోగపడటం ఏమిటి అనుకున్నాడు ఎవరో ఉన్నతాధికారి… అప్పట్లో దాని ధర 15 పైసలు… ఈ దెబ్బకు పోస్ట్ కార్డు ధర పెంచారు, అంతేకాదు, ఇలాంటి కంపిటీషన్లకు పంపే కార్డుల ధరను ఏకంగా రెండు రూపాయలు చేశారు…
ఈ షో తరువాత సిద్ధార్థ్ కాక్ గ్రామీణ కళాకృతులు, సంస్కృతి రక్షణ కోసం ఫోర్డ్ ఫౌండేషన్ సాయంతో సురభి ఫౌండేషన్ నెలకొల్పాడు… కొన్ని సినిమాల్లో నటుడిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎన్డీటీవీ కోసం ఇండియా ధనుష్ అని ట్రావెల్ షో చేస్తున్నాడు… ఆయనకు సురభి షోలో కోహోస్ట్‌గా చేసిన రేణుక సినిమాలు, టీవీల్లో నటిగా చాన్నాళ్లు నటించింది… ఈ వారానికి 14 లక్షల పోస్టు కార్డులు అనేది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది..!
Share this Article