ఒకప్పటి హీరో తొట్టెంపూడి వేణు ప్రస్తుతం ఒక కేసులో ఇరుక్కున్నాడు… ఉత్తరాఖండ్‌లో తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన ఒక హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేసు… అసలే కావూరి వారి కంపెనీతో యవ్వారం… కంట్రవర్సీలు… సరే, ఆ కేసును వదిలేస్తే…
చిత్రపురి కాలనీ అక్రమాలకు సంబంధించి పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ తదితరులపై కేసు నమోదైంది… ఈ కాలనీ ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఎన్నాళ్లుగానో వివాదాలున్నయ్… వందల కోట్ల స్కాములట… ఇప్పుడు ఇక కేసులు, చర్యలు తప్పడం లేదు, సరే, దీన్ని కూడా అలా వదిలేస్తే…
నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు… కేవలం డ్రగ్స్ తీసుకోవడం కాదు, పాజిటివ్ రిజల్ట్ రావడం కాదు, ఇక్కడి నుంచి అమ్మాయిలని తీసుకుపోయిన యవ్వారంలో హేమ ప్రధాన పాత్ర అని పోలీసుల సందేహం అట… సరే, నిజానిజాలు నిర్వాహకులకు ఎరుక, తవ్వితీస్తే జనానికి ఎరుక…
Ads
ఒకదాని వెంట మరొకటి… సినిమా తారలు కేసుల్లో బుక్కయిపోతున్నారు… ఇవన్నీ సరే… క్రైమ్ జరిగినప్పుడు కేసులు తప్పవు, దర్యాప్తులు తప్పవు, మీడియాలో టాంటాం తప్పదు… ఐతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందన కాస్త విచిత్రం అనిపించింది… అధ్యక్షుడు మంచు విష్ణు అనాలోచితంగా హేమను వెనకేసుకొస్తున్నాడు.,.
ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నదని సాక్షాత్తూ బెంగుళూరు పోలీస్ కమిషనర్ స్వయంగా చెబుతున్నాడు, ఆమె ఫోటో కూడా రిలీజ్ చేశారు… ఐనా సరే, సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా హేమ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నాయట, ఒక తల్లిగా, ఒక భార్యగా ఉన్న హేమపై లేని వదంతులు సృష్టిస్తున్నాయట, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానేయాలట, ఆమె మీద ఆరోపణలు రుజువయ్యేవరకు దోషి కాదట, పోలీసులు సరైన ఆధారాలు ఇస్తే మా అసోసియేషన్ ఆమె మీద చర్యలు తీసుకుంటుందట…
భలే దొరికావయ్యా మంచు కన్నప్పా… ఏదైనా నేరాల్లో ఇరికితే మా అసోసియేషన్ సదరు సభ్యులపై చర్యలు తీసుకోవాలని బైలాస్‌లో ఉందా..? ఉన్నా సరే, అదేమైనా సబబా..? నేరాలు వాళ్ల వ్యక్తిగత యవ్వారాలు… వాటితో అసోసియేషన్‌కు ఏం సంబంధం..? ఆమెను ఎందుకు వెనకేసుకొస్తున్నట్టు..? అలాంటి వాళ్లకు మా వత్తాసు పలుకుతుందా.? దోషి అని ఎవరూ రాయడం లేదుగా… ఐనా ఈ కేసులు ఇప్పట్లో తేలేవి కావు, తెగేవి కావు… హైదరాబాద్‌లో అకున్ సభర్వాల్ పెట్టిన కేసులు ఎన్నేళ్లు సా-గా-యో తెలుసు కదా… అదంతా చట్టం, దర్యాప్తు, కోర్టు, విచారణ గట్రా వ్యవహారం…
కేసుల మీద పోరాటం ఆమె వ్యక్తిగతం, మా సంస్థతో ఏం సంబంధం..? పైగా గతంలో ఎవరి మీదనైనా నేరాల కేసులు బుక్కయితే మా అండగా నిలబడిందా..? మద్దతు ప్రకటించిందా..? పోలీసులు మీకు ఆధారాలు ఎందుకిస్తారు..? కోర్టుకు చెబుతారు… మా అసోసియేషన్ చర్య తీసుకుంటే పోలీసులకు ఎందుకు..? తీసుకోకపోతే వాళ్లకెందుకు..? పోలీసులు చెప్పిన వివరాలు, ఇతరత్రా సేకరించిన వివరాల మేరకు మీడియా వార్తలు రాస్తుంది… నిరాధార ఆరోపణలని మీడియాను నిందించడం దేనికి..? ఫేక్ వార్తలు అంటే ఎలా..? వేటిని ఫేక్ వార్తలు అంటారో తెలుసా..?
ఏమో… మీరూ అర్థం కారు, మీ మాటలూ అర్థం కావు, మీ చేష్టలు అస్సలు అర్థం కావు..! ఆమె మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి నానా ప్రయత్నాలూ చేసింది, ఐనా దొరికిపోయింది… పోనీ, వీటి మీద కూడా ఏమైనా చెప్పు విష్ణు భాయ్..!! అన్నట్టు, లోకంలో ఆమె మాత్రమే తల్లి కాదు, ఆమె మాత్రమే భార్య కాదు… మోపబడిన నేరారోపణలకూ దానికీ సంబంధం లేదు… నేరగాళ్లకు కూడా కుటుంబాలుంటయ్..!! అన్నట్టు… ఆమే కాదు, ఇలాంటి కేసుల్లో స్టార్ తారలు, హీరోలు దొరికినా ఇలాగే రాస్తుంది మీడియా…!! అవునూ, తొట్టెంపూడి వేణు, కాదంబరి కిరణ్, పరుచూరి వెంకటేశ్వరరావులకు బాసటగా నిలవలేదెందుకు..? వాళ్లు కూడా దోషులు కాలేదు ఇంకా… వాళ్లకూ కుటుంబాలున్నయ్..!!
Share this Article