ప్రాణం విలువ తెలిసినవాడు ప్రాణం కాపాడతాడు.. ప్రాణం విలువ తెలియనివాడు చెలగాటమాడుతాడు. మనిషంటే లెక్కలేనివాడు సాటి మనిషేమైపోయినా పట్టించుకోడు.. మనిషి విలువ తెలిసినవాడు సాటి మనిషిగా చేయూతనందిస్తాడు. ఇప్పుడీ కొటేషన్స్ ఎందుకంటే… ఓ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు 400 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి.! అందుకు!!
అంతకుముందు మనమో బ్లడ్ గ్రూప్ గురించి చెప్పుకోవాలి. అదే హెచ్ హెచ్ బ్లడ్ గ్రూప్. దాన్నే బొంబాయి బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఇదొక అరుదైన రక్త నమూనా. లక్షల్లో ఒకరికుండొచ్చు బహుశా! 1952లో ముంబైకి చెందిన డాక్టర్ వై.ఎం. బెండే ఈ బ్లడ్ గ్రూప్ ను కనుగొన్నారు. ఈ రక్తనమూనా కేవలం భారత ఉపఖండమైన ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు.. ఇరాన్ వంటి చోట్ల మాత్రమే అరుదుగా కనిపిస్తుంటుంది.
అయితే, ఇలాంటి రక్తం అవసరమున్న ఓ మహిళ కోసం… ఓ వ్యక్తి 440 కిలోమీటర్ల ప్రయాణమే ఈ స్టోరీ.
Ads
జస్ట్ 30 ఏళ్లు… బొంబాయి బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక్క మనిషి రక్తం దొరికినా.. ఆ మహిళ బతుకుతుంది. పెద్దఎత్తున వాట్సప్ తో పాటు.. సోషల్ మీడియాలోనూ వీలైనంత ప్రచారం చేశారు. కానీ, దగ్గరలో అందుబాటులో మాత్రం ఆ బ్లడ్ లభించలేదు. అయితే, చేసిన ప్రచారం ఊరికే పోలేదు. ఎక్కడో మహారాష్ట్ర షిర్డీలోని ఓ వ్యక్తిని కదిలించింది. ఏకంగా మధ్యప్రదేశ్ కు 400 కిలోమీటర్ల ప్రయాణం చేయించి.. ఏకంగా ఆ మహిళ ప్రాణాలు కాపాడేలా చేసింది.
ఈ పని చేసింది ఫ్లోరిస్ట్ గా… అంటే టోకు చొప్పున పూలమ్మే షిర్డీకి చెందిన ఓ వ్యాపారి రవీంద్ర అష్టేకర్ అనే ఓ 36 ఏళ్ల వ్యక్తి. అయితే, బాధిత మహిళది ఇండోర్. సాధారణంగా ఎవరికైనా బ్లడ్ అవసరముందంటే… రక్తదాతలు ఈ కాలంలో సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకోవడంతో చాలా సులభంగా అపాయం నుంచి గట్టెక్కుతున్నారు. మానవత్వమున్న ఎవరో ఒకరు కచ్చితంగా స్పందిస్తున్నారు. కానీ, చాలా అరుదైన బొంబాయి బ్లడ్ గ్రూప్ దొరకడమంటే ఆషామాషీ కాదు. కానీ, మహారాష్ట్ర షిర్డీకి చెందిన అష్టేకర్ రూపంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మరో మహిళ ప్రాణాలు కాపాడగల్గటం కూడా.. ఇప్పుడు, సోషల్ మీడియా సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పుకోవాల్సిందే!
షిర్డీ నుంచి నేను బయల్దేరేటప్పుడు నాకు తెలుసు.. సరిగ్గా నేను 440 కిలోమీటర్లు ప్రయాణించాలి. అసలే ఎండాకాలం.. తీవ్రత ఎక్కువగా ఉంది. అయినా సరే, ఒకరి ప్రాణం కాపాడాలనుకున్న సంకల్పం… నన్ను నా మరో స్నేహితుడితో కలిసి ఇండోర్ ప్రయాణానికి నడుం బిగించేలా చేసిందంటున్నారు అష్టేకర్. తనవల్ల ఒకరి ప్రాణం దక్కడం తనకు ఎనలేని సంతృప్తిని… మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందంటున్నాడు. ఇప్పటికే తన రాష్ట్రం మహారాష్ట్రతో పాటు… గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి వివిధ చోట్ల… అరుదైన బొంబాయి బ్లడ్ అవసరమైన వారెందరికో రక్తదానం చేసి సాటి ప్రాణుల ఆయుష్షు పెంచాడు.
సదరు మహిళ పరిస్థితి చావు, బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు ఇండోర్ లోని మహారాజా యశ్వంత్ రావ్ ఆసుపత్రి ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ అశోక్ యాదవ్ చెప్పుకొచ్చారు. ప్రసూతి కోసం వచ్చిన సదరు మహిళకు వైద్యులు అనుకోకుండా ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించేసరికి… ఆమె ఆరోగ్యం క్షీణించింది. మూత్రపిండాలు కూడా దెబ్బతిన్నాయి.
దాంతో సదరు మహిళను ఇండోర్ లోని రాబర్ట్స్ నర్సింగ్ హోమ్ కు తరలించారు. కానీ, ఆమె హిమోగ్లోబిన్ స్థాయి డెసీలీటర్ కు.. కేవలం 4 గ్రాములు మాత్రమే ఉండటంతో… వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. డెసీలీటర్ కు కనీసం 12 నుంచి 13 గ్రాములైనా హిమోగ్లోబిన్ కంటెంట్ ఉండాలి. ఆ సమయంలో బొంబాయి బ్లడ్ గ్రూప్ నాల్గు యూనిట్లు ఎక్కించిన తర్వాతగానీ.. ఆ మహిళ మామూలు పరిస్థితికి రాలేకపోయిందన్నారు డాక్టర్ అశోక్.
అయితే, ఓ మహిళ ప్రాణం కాపాడటంతో వైద్యులెంతగా కృషి చేశారో… రవీంద్ర అష్టేకర్ ది ఎంత కీలకపాత్రో… ఈ మొత్తం వ్యవహారంలో సదరు మహిళ బతికి బట్ట కట్టడానికి ఇండోర్ సామాజిక సంస్థ దామోదర్ యువ సంఘటన్ ప్రయత్నమూ అంతే కొనియాడదగింది. దామోదర్ యువ సంఘటన్ నాగపూర్ నుంచి రెండు యూనిట్ల రక్తాన్ని తెప్పించగా… సదరు మహిళ సోదరి మరో యూనిట్ అందించింది. ఇక రవీంద్ర అష్టేకర్ రాకతో.. కావల్సిన రక్తం మహిళకు అంది.. ఆమె ఇప్పుడు తిరిగి మృత్యుంజయురాలైంది…… (రమణ కొంటికర్ల)
Share this Article