క్రైం స్టోరీలకు సోషల్ ఇష్యూస్ ముడిపెట్టి… మరీ సినిమాటిక్ గాకుండా రియలిస్టిక్ దర్యాప్తు కోణంలో కథనం నడిపిస్తూ… థ్రిల్లర్ జానర్ ప్రజెంట్ చేయడం మలయాళ దర్శకులకు బాగా అలవాటు… అదీ తక్కువ ఖర్చుతో.., ప్రధానంగా కంటెంట్, తమ కథన సామర్థ్యాలపై ఆధారపడి వర్క్ చేస్తారు… గ్రిప్పింగ్‌గా, లాగ్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకుంటారు…
కీడం అని రెండేళ్ల క్రితమే మలయాళంలో రిలీజైన ఓ సినిమా… పైన చెప్పుకున్న బాపతే… దాన్ని ఇప్పుడు కీచురాళ్లు పేరుతో తెలుగులోకి తీసుకొచ్చి ఈటీవీ విన్‌లో ఉంది… కీచురాళ్లు అనగానే మనకు ఓ పాత సినిమా గుర్తొస్తుంది… 1991 బాపతు తెలుగు సినిమా… భానుచందర్, శోభన హీరోహీరోయిన్లు… మొహంలో ఏ ఉద్వేగమూ అర్థం గాకుండా నటించడంలో ఇద్దరూ ఘనాపాఠీలు…
సరే, ఈ కీచురాళ్ల సంగతికొస్తే హీరోయిన్ బాగా పేరున్న స్టార్ నటి కాదు, కానీ 2013 నుంచీ టీవీలు, సినిమాల్లో కనిపిస్తున్నదే… గతంలో రామారావు ఆన్ డ్యూటీ అనే తెలుగు సినిమాలో కూడా చేసింది… తన పాత్రలో అచ్చంగా ఒదిగిపోయింది… కథ విషయానికొస్తే…
Ads
ఒక అమ్మాయి, పేరు రాధిక… టెక్నికల్ అంశాలపై మంచి గ్రిప్ ఉంటుంది… ఎథికల్ హ్యాకర్ కూడా… పోలీసులు కూడా ఆమె సాయం తీసుకుంటూ ఉంటారు కొన్ని కేసుల్లో… కానీ ఆమెకే ఓ ప్రాబ్లం వస్తుంది… అనుకోకుండా తారసపడిన ఓ కాలర్ ఆమె గొంతు బాగుందని తరచూ కాల్స్ చేసి సతాయిస్తుంటాడు… వాడికి ఓ గ్యాంగ్, ఈమె ఫోటో ఎక్కడో చూసి, అందంగా ఉంది కదాని ఆ గ్యాంగ్ వేధిస్తుంటారు…
పోలీసులకు చెప్పినా వర్కవుట్ కాదు, ఇలాంటి కేసులు అంతే కదా… వదిలేయండి మేడమ్ అంటారు… దాంతో ఆమే తను సొంతంగా వాళ్లతో ఓ ఆట ఆడుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది… వాళ్ల ఫోన్లను హ్యాక్ చేస్తుంది… ఆ గ్యాంగ్ ఓ మాఫియా అనీ, పేరుకు స్క్రాప్ బిజినెస్ చేస్తూ లోలోపల మర్డర్లు సహా అన్నీ చేసేసే బాపతు అని అర్థమై… ఒక్కోచోట దెబ్బ కొడుతూ ఉంటుంది… అర్థం గాక ఈ గ్యాంగ్ పిచ్చెక్కిపోతుంది, తరువాత తెలుస్తుంది… తరువాత ఏమిటీ అనేదే కథ…
విభిన్నమైన స్టోరీ యాంగిల్… ప్రజెంట్ జనరేషన్‌కు కంప్యూటర్లు, ఫోన్లు, హ్యాకింగ్, ఈ కాల్స్ వేధింపులు బాగా కనెక్టయ్యే కథ… పైగా హ్యాకింగ్ గట్రా కాస్త డిటెయిల్డ్‌గా ఓ క్రైం కథకు జతచేయడంతో ఆసక్తికరంగా మారింది కంటెంట్… తక్కువ లొకేషన్లు, కొన్నే పాత్రలు… కాకపోతే రెగ్యులర్, రొటీన్, ఊకదంపుడు కథలు చూసేవాళ్లకు కాస్త బోర్ కొట్టొచ్చు…
ఎక్కడా అసభ్యత లేకుండా తీశారు… పర్లేదు, ఎక్కడా బిగి సడలనివ్వలేదు సినిమా చివరి వరకూ… తెరపై పదే పదే కనిపించే మొహం హీరోయిన్‌దే… కెమెరా, బీజీఎం పెద్దగా పట్టించుకునే పనే లేదు… కథ మనల్ని లాక్కుపోతుంది అలా… ఆ హీరోయిన్ రజీషా విజయన్ కూడా..!! ప్రస్తుతం థియేటర్లలోనూ చూడబుల్ సినిమాలేమీ లేవు కదా… దీనిపై ఓ లుక్కేయొచ్చు..!!
Share this Article