Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేపే కదా కౌంటింగ్… ఈ సినిమా చూశాకే టీవీ రిమోట్‌కు పనిచెప్పండి…

June 3, 2024 by M S R

Subramanyam Dogiparthi….. ప్రతి భారతీయుడిని కట్టేసయినా చూపించాల్సిన సినిమా . 1968 ప్రాంతంలో ఇదే పేరుతో చో రామస్వామి నాటకం వ్రాసి , తమిళనాడు అంతా సంచలనం సృష్టించారు . 1971లో సినిమాకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి తానే తుగ్లక్ పాత్ర వేసి మరోసారి సంచలనం సృష్టించారు . 1972 లో మన తెలుగులోకి రీమేక్ అయింది . తమిళంలో సృష్టించినంత సంచలనం తెలుగులో సృష్టించలేదు . కారణం తమిళంలో చో రామస్వామి కరుణానిధిని మనసులో పెట్టుకుని వ్రాయటం వలన పేలింది . ఒక గొప్ప విషయం ఏమిటంటే 1970s లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు బ్రహ్మాండంగా సూటవుతుంది . అందుకే ప్రతి ఎలక్షన్ ముందు పౌర సంఘాలు ఈ సినిమాను ఉచితంగా చూపాలి . చూడం అంటే కట్టేసి చూపాలి .

దేశంలో రాజకీయ నాయకులు ప్రజల్ని మాయ మాటలు చెప్పి , ఓట్లు వేయించుకుని , పదవిలోకి వెళ్ళాక , ఇచ్చిన వాగ్దానాలను మరచి , ప్రజాశ్రేయస్సును విడిచి ఎలా మోసం చేస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఒక ప్లాన్ వేస్తారు . తన శిష్యులయిన ఇద్దరిని తుగ్లక్ , తుగ్లక్ మంత్రిగా తవ్వకాలలో ఒక హిస్టరీ ప్రొఫెసరుకు దొరికేలా ప్లాన్ చేస్తారు . దేశానికి ప్రధాని అయిన తుగ్లక్ , పదవి వాసనకు లోనై , గురువుకిచ్చిన మాటలను తుంగలో తొక్కి , శాశ్వతంగా పదవిలో కొనసాగే క్రమంలో మిత్రుడిని అమాయక ప్రజల చేతనే రాళ్ళతో కొట్టించి చంపుతాడు . గాడ్సే గాంధీని హత్య చేసే సీనుతో సినిమాను ముగిస్తారు . టూకీగా కధ ఇది .

సినిమాను చూస్తుంటే మనకు ఎందరెందరో నాయకులు , ఎవరెవరో నాయకులు గుర్తుకొస్తూ ఉంటారు . పదవిని కాపాడుకోవటానికి ప్రధాని సీట్లో కూర్చున్న తుగ్లక్ తన సహచర లోకసభ సభ్యుల్ని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాడు , ప్రజల మనోభావాలను ఎలా తనకు అనుకూలంగా తిప్పుకుంటాడు వంటి సీన్లు నిత్యనూతనంగా కనిపిస్తాయి . సహచర సభ్యుల చేత ఎలా భజన చేయించుకుంటాడో చూస్తుంటే మన ప్రస్తుత నాయకులు చాలామంది గుర్తుకొస్తారు . ఈ సినిమాకు దాసరి నారాయణరావు వ్రాసిన మాటలు తూటాలయి పేలాయి .

Ads

తుగ్లక్ గా నాగభూషణం , ఆయన మంత్రిగా కృష్ణంరాజు అద్భుతంగా నటించారు . బహుశా ఆ డైలాగులు , ఆ నటన ఆయన మాత్రమే చేయగలరు అని అనిపిస్తుంది . కృష్ణంరాజుకు మంచి గుర్తింపు వచ్చిన పాజిటివ్ రోల్ . స్వాతంత్ర్య సమరయోధునిగా నాగయ్య , ఆయన కుమార్తెగా రమాప్రభ బాగా నటించారు . ఇతర పాత్రల్లో ఛాయాదేవి , రావి కొండలరావు , రాజబాబు , సంధ్యారాణి , లీలారాణి , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు .

సాలూరి హనుమంతరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . కొన్ని బాగా హిట్టయ్యాయి కూడా . అల్లా అల్లా యా అల్లా ఏమిటయ్యా నీ లీలా పాట బాగా హిట్టయింది . మరో వ్యంగ్య పాట జోహారు జోహారు ఢిల్లీశ్వరా ఆరోజుకీ ఈరోజుకీ వీర సూటవుతుంది . అలాగే మరో వ్యంగ్య పాట యస్ పి బాలసుబ్రమణ్యమే పాడి , నటించారు కూడా . అది : హేపీ బర్త్ డే టు యు అనే పాటలో మంత్రి రమాప్రభను ఉద్దేశించి పాడే వ్యంగ్య పాట తమిళంలో వివాదాస్పదం అయింది కూడా . ఇందిరాగాంధీని పోలేలా ఆ పాత్రను మలిచారని , ఆ పాటలోని సాహిత్యం కూడా ఆమెని ఉద్దేశించే వ్రాసారని సంచలనం , వివాదమూ అయ్యాయి . సచ్చు , జయకుమారి డాన్సులు హుషారుగా ఉంటాయి . తేనె మనసులు జంట రామ్మోహన్ , సంధ్యారాణిల మీద కొంటె చూపుల చిలకమ్మా పాట బాగుంటుంది .

చలన చిత్ర బేనర్లో బి వి ప్రసాద్ దర్శకత్వంలో ఫిబ్రవరి 1972 లో వచ్చిన ఈ సినిమా మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడింది . యూట్యూబులో ఉంది . రేపు పొద్దున కౌంటింగ్ మొదలయ్యే లోపు ఎట్టి పరిస్థితుల్లో అయినా చూసేయండి . ఇంతకుముందు చూసిన వాళ్ళు కూడా రిఫ్రెషింగుగా మళ్ళా చూసేయండి . ఇంత గొప్ప నిత్యనూతన , ఎవర్ గ్రీన్ రాజకీయ వ్యంగ్య సినిమా కౌంటింగ్ ముందు రోజు చూడకపోతే ఎలా ? మనం ఎలా మోసబోయి ఓట్లు వేసామో , వేస్తున్నామో తెలుసుకోపోతే ఎలా ? #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions