సొంతంగా 370… ఎన్డీయేగా 400… అని ఓ మైండ్ గేమ్‌కు సంబంధించిన స్లోగన్ తీసుకున్నది బీజేపీ… అయోధ్య రాముడున్నాడు, ఆ మోడీ ఉన్నాడు అనుకుని బరిలో తలపడింది… కానీ ఏమైంది…? మోడీ గెలిచాడా..? ఓడిపోయాడా..? ఓడి గెలిచాడా..? గెలిచి ఓడాడా..? ఎలా ఉందంటే… నాడు కురుసభలో ద్రౌపది నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..? అన్నట్టుంది ఈ ప్రశ్న…
ఎస్, మోడీ ప్రజాప్రధాని కాదు, ప్రజలకు నిత్యజీవిత వ్యవహారాల్లో… అంటే ధరలు, సబ్సిడీలు వంటి జనంపై కరుణ చూపే పథకాలు తనకు చేతకావు, వాయించి వదిలేయడమే… చివరకు నిత్యావసర మందుల మీదా ఓ విధానం లేదు… జీఎస్టీ ఆదాయం చూసుకోవడమే తప్ప జనం మీద బాదబడుతున్న పన్నులు సగటు మనిషి జీవనాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తున్నాయో పట్టలేదు… ఐనా సరే… ఒక్క ప్రశ్న, ఈ ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయాడా..? గెలిచాడా..?
Ads
ముందు పాజిటివ్ చూద్దాం… బీజేపీని సంకీర్ణాల శకం నుంచి, మిత్రులు శాసించే కాలం నుంచి సొంత మెజారిటీకి తీసుకొచ్చింది మోడీ… తరువాత 2019లో దాన్ని ఇంకాస్త పెంచింది మోడీ… ఈరోజుకూ బీజేపీలో మోడీ తప్ప మరో ప్రధాన వక్త లేడు… ప్రజలు తన మాటే విన్నారు తప్ప మరో స్టార్ క్యాంపెయినర్ లేడు… గిరగిరా కాలికి బలపం కట్టుకుని తిరిగాడు… ప్రధాని స్థాయి నుంచి దిగిపోయి ఏవేవో వ్యాఖ్యలు చేశాడు… ఇంకా ఎవరున్నారు ఆ పార్టీలో ఇలా..? కొన్నేళ్లుగా ఎన్నడూ లేనట్టుగా ప్రతిపక్ష ఐక్యత కనిపించింది… ఈ స్థితిలోనూ మోడీ ఒక్కడే ఢీకొట్టాడు ఒకరకంగా…
ఇప్పుడు గడ్కరీ, రాజనాథ్‌సింగ్, యోగి ఎట్సెట్రా పేర్లతో మీడియా కాలక్షేప విశ్లేషణలు చేస్తోంది… వాళ్ల రాష్ట్రాల్లో వాళ్లు ఉద్దరించిందే ఏమీ లేదు… ఏరకంగా చూసినా బీజేపీ ఈసారి కూడా పూర్తిగా మోడీ పాపులారిటీ, చరిష్మా మీదే ఆధారపడింది… ఎస్, 300 నుంచి ఏ 240-250 కో బీజేపీ బలం పడిపోవడం అంటే ఒకరకంగా మోడీ ఓటమే… అయితే ఎక్కువ బలం నుంచి తక్కువ బలానికి పడిపోయాడు తప్ప, పూర్తిగా ఓడిపోలేదు… అంటే 56 ఇంచుల ఛాతీ కాస్తా ఏ 45 ఇంచులకో కుదించుకుపోయింది… బరువు తగ్గిపోయాడు…
ఇప్పుడూ ఎన్డీయేదే అధికారం… కాకపోతే మళ్లీ సంకీర్ణం… అదీ అత్యంత చంచల స్వభావం, వెన్నుపోట్లు, నమ్మకద్రోహాల చరిత్ర ఉన్న నితిశ్, చంద్రబాబు, షిండే, అజిత్ పవార్ వంటి నేతల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలి… అదీ డ్రా బ్యాక్… పైగా చంద్రబాబుకు బీజేపీలోకన్నా కాంగ్రెస్ కూటమిలోనే మిత్రులెక్కువ… గంటలో ప్లేటు తిప్పేయగలడు… సో, కీలకమైన విధాన నిర్ణయాలకు సంబంధించి బీజేపీకి ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు తప్పవు… ఇప్పుడు ఎన్డీయేలో మిత్రులు నిజంగా మిత్రులేనా అనే సందేహాలతోనే మోడీ గడపాలి…
నేను దేవుడు పంపిన మనిషిని వంటి విపరీత వ్యాఖ్యల దాకా ప్రధాని మోడీ వెళ్లాడంటే… ఎక్కడో తేడా కొడుతోంది, చిప్ దెబ్బతిన్నట్టుంది ఫ్రస్ట్రేషన్‌తో అనిపించింది… ‘నేను’ అనే అహం ఆవరించిన ఏ నేతా బాగుపడ్డట్టు, జనం మెచ్చినట్టు చరిత్రలో లేదు… కేసీయార్ కూడా ఓ ఉదాహరణే… మోడీ చాలామంది మిత్రులను దూరం చేసుకున్నాడు, చివరకు పార్టీకి తల్లి వంటి ఆర్ఎస్ఎస్‌ను కూడా మించి వ్యవహరించడంతో ఆర్ఎస్ఎస్ కూడా కినుకగా ఉంది… హిందీ బెల్టులో నిరాశాఫలితాలకు అదే కారణమట…
పెద్దగా బలం లేని ఒడిశా, అసలు ఉనికే సరిగ్గా లేని ఆంధ్రా… ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తెలంగాణ… ఇవే ఇప్పుడు మోడీని ఆదుకున్నాయి… సర్వస్వం త్యజించి, ఇంకెవరికో పగ్గాలు అప్పగించి తను నిష్క్రమిస్తాడని అనుకోవడం లేదు… అలా తేలికగా వదిలేసేరకం కాదు గుజరాతీ మోడీ అండ్ షా… తదుపరి కార్యాచరణను వేచి చూడాల్సిందే… ఎటొచ్చీ చంద్రబాబు, నితిశ్, షిండేల పాలనభాగస్వామ్యాన్ని ఈ దేశం భరించాల్సిందే కొన్నాళ్లు..!!
Share this Article