ఇటు కేసీయార్… అటు జగన్… ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తల్ని ఎవడూ నమ్మడం లేదనీ, సోషల్ మీడియా ఈ ఎన్నికల్ని డామినేట్ చేస్తుందని అందరు రాజకీయ నాయకుల్లాగే వీళ్లూ గ్రహించారు… అత్యంత భారీ సాధన సంపత్తి ఉన్న పార్టీలాయె… వదిలిపెడతారా..?
ఎంత ఖర్చయినా పర్లేదు, తడాఖా చూపిద్దాం సోషల్ మీడియా కోణంలో అనుకున్నారు… కాకపోతే ఎటొచ్చీ వాళ్లు ఈ పనికి ఎంచుకున్న వ్యక్తులు రాంగ్… వాళ్లు ఎంచుకున్న టీమ్స్ రాంగ్… కోట్లకుకోట్లు గుమ్మరించారు… వరదైపారింది డబ్బు… తెలంగాణలో, ఏపీలో… చివరకు ఈ ఇద్దరు నేతలూ నిండా మునిగారు…
కేసీయార్ టీం చాలా ముందు నుంచే రంగంలోకి దిగింది… బోలెడు యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లను ఓ చిత్రమైన ఒప్పందాల్లో ఇరికించి, కొంత సొమ్ము ముట్టజెప్పి, వాళ్లతోనే పాజిటివ్ భజన చేయించుకునే ఎత్తుగడ… నిజానికి అనేక మంది అమ్ముడుబోయారు… ఇదేదో తేడాగా ఉందీ అనుకున్నవాళ్లు సైలెంటుగా ఉండిపోయారు…
Ads
అదేగాకుండా తమకు అనుకూలమని భావించిన సోషల్ మీడియా ప్రొఫైళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లకు కూడా డబ్బు ముట్టజెబుతూ అనుకూల ప్రచారం జోరుగా సాగించుకున్నారు… చివరకు మీమ్స్, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ పాపులర్ వీడియోలు చేసేవాళ్లను కూడా వాడుకున్నారు… ఒకరకంగా ఇది కరెక్టు ఎత్తుగడే… కానీ కీర్తనలు రాజకీయాల్లో కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయనే నిజాన్ని కేసీయార్ గానీ, ఆయన టీం గానీ గ్రహించలేదు… అందరినీ నమస్తే తెలంగాణలాగే మైకుల్లా మార్చేస్తే జనానికి విసుగొచ్చింది…
ఇక జగన్ బాపతు సోషల్ మీడియా వైఫల్యాలను (కొందరైతే స్కాం అనీ అంటున్నారు) వీరవిధేయ జగన్ సైట్లు కూడా ఇప్పుడు విమర్శిస్తున్నాయి… జగన్ కూడా యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లను మేనేజ్ చేసే బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవకు అప్పగించాడు… ఆయనేమో ఒక ఫిమేల్, ఒక మేల్ కేరక్టర్‌కు చానెళ్లు, సైట్ల ఎంపిక బాధ్యతను వదిలేశాడు…
చిన్నాచితకా, జనం పెద్దగా పట్టించుకోని వాళ్లను కూడా ఎంపిక చేసి భార్గవ వద్దకు తీసుకెళ్లేవాళ్లు… కమీషన్ల కక్కుర్తి అట… మంచి రీచ్, నాణ్యమైన ప్రజెంటేషన్ ఉన్న సైట్ల వాళ్లనేమో భార్గవను కలవనిచ్చేవాళ్లు కాదట… ఇంకేముంది… కోట్లకుకోట్లు అలా వరదైపారాయి… కానీ నయాపైసా ఫలితం లేకపోగా, కౌంటర్ ప్రొడక్ట్ అయ్యాయి వాళ్ల ప్రచారాలు… నిలువునా మునిగిపోయాడు జగన్…
నిజం చెప్పాలంటే… జగన్‌కు కూడా తెలియదు సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కడ తప్పు జరిగిందనేది… గుడ్డిగా నమ్మాడు, దెబ్బతిన్నాడు… కేసీయార్, జగన్ ప్రత్యేకంగా ఈ సానుకూల ప్రచారాల కోసం, ప్రత్యర్థుల మీద బురద జల్లడం కోసం కొందరు వ్యక్తుల్ని నియమించుకుని భారీగా ఖర్చు పెట్టారు… కానీ అక్కడా వాళ్ల మీద పెత్తనాలకు మళ్లీ సరుకులేని వాళ్లనే ఎంపిక చేసుకున్నారు… వీళ్ల దెబ్బకు చాలామంది వీడియో ఎడిటర్లు . కంటెంట్ రైటర్లు ( సీనియర్ జర్నలిస్టులు,. డిజైనర్లు) పారిపోయారు… ఇప్పుడు దుకాణం షట్ డౌన్… కనీసం రెండు నెలల జీతమైనా అదనంగా ఇవ్వలేదు … బజారున పడ్డారు…
కేసీయార్, జగన్ మళ్లీ గెలవాలని నిజాయితీగా భావించినా చాలామంది వాళ్ల టీమ్స్ నిర్వాకాలతో దూరం ఉండిపోయారు… మొత్తానికి ఈ టీమ్స్ బాగానే ఉంటాయి, కోట్లకుకోట్ల కమిషన్లు కొట్టినవాళ్లూ బాగానే ఉంటారు… ఎటొచ్చీ మరీ తలదించుకునే స్థాయిలో పరాజయాల పాలైంది మాత్రం ఆ ఇద్దరు నేతలు…!! ఐప్యాక్ వంటి సోషల్ వ్యూహకర్తల టీమ్స్‌కు చెల్లింపులు వేరే కథ… అది మరింత భారీ ఖర్చు..!!
Share this Article