.. ఈనాడు దినపత్రికలో సాహిత్య పేజీ ఎప్పుడూ లేదు. పెట్టరు. నేను ఈనాడుకు వెళ్లిన కొత్తలో ఆ విషయం గమనించి మా ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారికి ఒక లెటర్ రాశాను. ఆయన దాన్ని ఎండీ గారికి ఇస్తానన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు గడిచిపోయాయి. ఆ లెటర్ సంగతి ఏమైందో తెలియదు.
… కానీ ఆ తర్వాత నేను సాహిత్యమనే మహాసముద్రంలోకి దూకాక అసలు సంగతి అర్థమైంది. దినపత్రికల్లో సాహితీ చర్చల (I repeat సాహితీ చర్చలు మాత్రమే)కు ఎంత తక్కువ స్పేస్ ఇస్తే ఆ పత్రిక అంత ఎక్కువ కాలం మన్నుతుంది. పదికాలాలపాటు బతికి బట్ట కడుతుంది. కథ, కవిత్వం, బుక్ రివ్యూల వరకూ ఓకే! ఎప్పుడైతే సాహితీ చర్చలు మొదలు పెడతామో ఇంక పత్రిక మెల్లగా అవసానదశకు చేరుతుంది. ఆపై సమాధి స్థితికి వెళ్తుంది.
రచయితల వల్ల పత్రికలు నడవవు. పత్రికలను నడిపించేంత శక్తి రచయితలకో, వాళ్ల రచనలకో లేదు. పైగా తమ రచనలు తప్ప మరొకరివి కనీసం కంటితోనైనా చూడని సుగణమొకటి కొందరు తెలుగు రచయితల్లో ఉంది. కాబట్టి సాహిత్యాన్ని మించి పాఠకులను ఆకట్టుకునే అంశాలపై దృష్టి పెట్టే పత్రికలే మన దగ్గర ఎక్కువకాలం మన్నుతాయి.
Ads
... తెలుగు వాళ్లకు సాహిత్యం మీద ఎంత ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఉన్నాయో తెలుసు కాబట్టే ఈనాడు వారు పెద్దగా సాహిత్యం జోలికి పోలేదు. ఆ విషయంలో వారి నిర్ణయం 100 శాతం కరెక్ట్. జనం కూడా ఎప్పుడూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చతుర, విపుల, తెలుగు వెలుగు కూడా పాఠకుల కోసం, వారిలో పఠనాసక్తి పెంచే అంశాల కోసం చక్కగా తయారు చేశారు. అంతే తప్ప రచయితల చర్చోపచర్చలు, వాదోపవాదాలు, వాళ్ల మీద వీళ్ల విసుర్లు, వీళ్ల మీద వాళ్ల ఆరోపణలు అనే కోణంలో డెవలప్ చేయలేదు. కాబట్టే వాటిని అందరూ గుర్తు పెట్టుకున్నారు.
రచయితల రచనలు వేసి, వాళ్లను తృప్తి పరిచే పద్ధతిలో కాకుండా, ఏవి వేస్తే పాఠకులు చదువుతారో, ఏవి జనాన్ని కొంతలోకొంత ఎడ్యుకేట్ చేస్తాయో అవే ఏరి కోరి వేసే పత్రికలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ బతుకుతాయి. Like Eenadu… PS: ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!…. (సాయి వంశీ… విశీ)
ఈ ఫేస్ బుక్ పోస్టుకు బెల్లంకొండ ప్రసేన్ చేసిన ఓ కామెంట్ కూడా ఇంట్రస్టింగు… ఇలా… ‘‘ఈనాడు పెట్టిన కొత్తలోనే రామోజీ మీద వత్తిడి వచ్చింది సాహిత్య పేజీ పెడదామని. కానీ ఆయన ససేమిరా అన్నారట. అయినప్పటికీ ఒక సర్వే చేయించారట. కేవలం రెండు శాతం పాఠకులు మాత్రమే సాహిత్యం చదువుతారని, ఆ రెండు శాతం కూడా పేపర్ కొని చదవరని తేలిందట. ఆ రెండు శాతంలో కూడా రాసేవాళ్ళే ఎక్కువట. అందుకే ఆయన ఆ ఆలోచన మానుకున్నారు. ఆ తరవాత కూడా ఆయన మళ్ళీ అలాంటి ఆలోచన చెయ్యలేదు. ఆయనది ఫక్తు వ్యాపార బుర్ర…’’
Share this Article