ఆహా… సబ్‌స్క్రయిబర్ల చందాలు, నవీకరణలకు సంబంధించి అతి తెలివి ప్రదర్శిస్తోంది… అందులో కంటెంట్ ఏమిటో, దాని కథాకమామిషు ఏమిటో ఇక్కడ ప్రస్తావించడం లేదు… రియాలిటీ షోల కంటెంట్ వరకూ వోకే… అదేదో చెఫ్, నవదీప్ చేసే డగవుల్ అనే మరో షో వేస్ట్… కానీ సర్కార్, ఇండియన్ ఐడల్ వంటివి వోకే…
కొన్ని సినిమాలు కూడా పర్లేదు… అయితే ఇండియన్ ఐడల్ తెలుగు సినిమా సాంగ్స్ కంపిటీషన్ షో స్టార్టవుతోంది కదా, మూడు నెలల చందా 99 రూపాయలే అంటున్నాడు కదా అని ట్రై చేస్తూ వివరాలు చూస్తే… ఒకటే మొబైల్‌కు పనిచేస్తుందని ఉంది… సరే, వోకే, వారానికి రెండు రోజులే కదా… చూద్దాం అని సబ్‌స్క్రయిబ్ బటన్ క్లిక్ చేస్తే… రకరకాల పేమెంట్ ఆప్షన్స్ కనిపించాయి…
సరే, ఈమధ్య బాగా అలవాటైపోయింది కదాని ఓ యూపీఐ బటన్ నొక్కాను… Pay 149 అని కనిపించింది… ఇదేమిటి..? 99 రూపాయలే అన్నాడు కదాని అటూఇటూ చెక్ చేస్తే, కాసేపు జుత్తు పీక్కున్నాక, అది కొత్త సబ్‌స్క్రయిబర్లకే 50 రూపాయల రాయితీ అట… సరే, ఆ షో కోసం ఆమాత్రం పెట్టొచ్చు, అడ్డమైన సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే దోపిడీ స్కీమ్‌లకన్నా నయమే కదా అనుకుని క్లిక్ చేద్దామంటే…
Ads
ఆటో పే అని కనిపిస్తోంది… అదీ 2034 వ సంవత్సరం వరకూ అట… అంటే పదేళ్లపాటు… ఆటోమేటిక్‌గా మన ఖాతా నుంచి కటయిపోతాయన్నమాట… ఈమధ్య ప్రతి చెల్లింపుకూ… అంటే ఫోన్ బిల్లులు, కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు ఎట్సెట్రా అన్ని బిల్లులకూ ఈ ఆటో పే వాడుకొండి, మీకు గుర్తున్నా, గుర్తుండకపోయినా, మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కటయిపోతాయి, మీకు నిశ్చింత, మరిచిపోతే డిస్‌కనెక్షన్ బాధ ఉండదు కదాని ఆయా సంస్థలు ఊదరగొడతాయి…
కానీ అదంతా ఆప్షనల్… మనిష్టం ఉంటే ఆటో పే, లేకపోతే అప్పటికి పే చేసి వదిలేయడమే… కానీ ఆహా వాడి వికారం ఏమిటంటే… తప్పకుండా ఆటో పే ఆప్ట్ చేసుకోవాలట… వెనక్కి వెళ్తే పేమెంట్ ఫెయిల్డ్ అని కనిపిస్తోంది… పోనీలే, పాపం ఈ 149 రూపాయల చౌక స్కీమ్‌కే ఇది పెట్టాడేమో కాస్త ఎక్కువ చందాకు వెళ్దాం అనుకుంటే, అన్నింటికీ అదే పైత్యం…
చందాల్లో కూడా రకరకాలున్నాయి లెండి. గోల్డ్ అని, యాన్యువల్ అనీ ఎట్సెట్రా… అంటే ఆటో పేను వద్దనుకునేవాడికి ఇక సబ్‌స్క్రయిబ్ చేసుకునే అవకాశమే లేనట్టా..? ఇదెక్కడి మార్కెటింగ్ పైత్యం..? నిర్బందంతా ఆటో పే పెట్టించడం ఏమిటి మాస్టారూ..?
అసలే 1000 కోట్లు లాస్, ఎవడైనా దొరికితే అమ్మేస్తాం అనుకుంటున్న స్థితిలో ఎవరూ రెన్యువల్ చేసుకోకుండా, కొత్త సబ్‌స్క్రయిబర్లు రాకుండా ఇలా కాళ్లలో కట్టెలు పెట్టడం దేనికి..? పైగా ఈ సంస్థలో భాగస్వాములు వ్యాపారాల్లో సిద్ధహస్తులు, వెరీ బిగ్ షాట్స్, కనీసం ఇవి కూడా చూసుకోరా..? లేక వదిలేశారా..? లేక నాలాంటోళ్లకే చందా ఎలా కట్టాలో తెలియడం లేదా..? ఏమో, ఇదే నిజమేమో..!!
Share this Article