.
THE FOUNTAIN HEAD
రామోజీరావు
………………………….
ప్రజల మనిషా? డబ్బు మనిషా?
………………………..
నిస్సందేహంగా రామోజీరావు ప్రజల మనిషి.
నిత్యం ఈనాడు చదివినా, ఈటీవీ చూసినా, మార్గదర్శికి వెళ్ళినా, పొడులూ పచ్చళ్ళూ కొన్నా, కళాంజలిని చూసి మురిసిపోయినా, ఫిల్మ్ సిటీలో షూటింగులు చేసినా, ‘అన్నదాత’కి అభిమానులైనా, విపుల చతురలు దాచుకున్నా, ‘పాడుతా తీయగా’ అంటూ పరవశించి పాడినా…వాళ్ళంతా ప్రజలే! -ప్రజలే అతని టార్గెట్!
ప్రజలే అతని పెట్టుబడి.
ప్రజలే అతని సంపద.
ప్రజలే అతని వ్యాపార రహస్యం!
మహామహా ఎన్టీ రామారావునే రాజకీయాల్లో నిలబెట్టగలడు. నచ్చకపోతే పదిరోజుల్లో పడగొట్టగలడు. చంద్రబాబు నాయుడనే
గౌరవ ముఖ్యమంత్రిని పెంపుడు కుక్కపిల్లలా తన చుట్టూ తిప్పుకోగలడు.
మచ్చ లేని తెల్లని పాల తెలుపు చొక్కా ప్యాంటు వేసుకుని,మెరిసే తెల్లని చెప్పులతో, హాయిగా తెల్లగా నవ్వుతూ పలకరించే రామోజీరావును
చూస్తే వైట్ మనీ కరెన్సీ కట్టల్లా ముద్దొస్తాడు.
పగటిపూట ఆయనొక తెల్లని తెలుగు వెలుగు.
రాత్రిపూట ఒక నల్లని ముసుగు దొంగ!
వ్యాపారం అంటేనే అదే కదా మరి!
నిన్ననే రామోజీరావనే మహామనిషి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు.
Ads
వెంటనే ఇలా ఆడిపోసుకోవడం సరైనదేనా? ఏదైనా, ఎవరి గురించైనా, నిజం మాట్లాడుకోవడం ప్రధానం. తెలుగు రాష్ట్ర ప్రజల్ని యాభై సంవత్సరాల పాటు ప్రభావితం చేసిన మనిషి, ప్రతి రాజకీయ మలుపులోనూ తానేంటో చూపించి నిరూపించి గెలిచి నిలబడిన సూపర్ హీరో గురించి నిజాలు మాట్లాడుకోవడమే ఆయనకు నిజమైన నివాళి.
మనకో దరిద్రపు సాంప్రదాయం ఉంది.
ఎవరైనా చనిపోతే చాలు! మనకిక వొళ్ళు తెలీదు. 88 ఏళ్ళవాడు మరణించినా,94 ఏళ్ళవాడు కన్ను మూసినా మనం దిగ్భ్రాంతితో అవాక్కయిపోతూ వుంటాం . పూర్తి జీవితం అనుభవించి, ఒంటి చేత్తో వంద విజయాలు సాధించి, హద్దుల్లేని అపారమైన వ్యాపార
సామ్రాజ్యం నిర్మించి, ముందు తరాల కోసం డబ్బు సంపాదించడం ఎలా? అనే ఒక ధనవద్గీత రాసి, సంతృప్తితో విజయగర్వంతో వెళ్ళిపోతే,
మనం ‘దిగ్భ్రాంతి’ చెందడం ఎందుకో?
ఆంధ్రజ్యోతి అనే పాపులర్ దినపత్రిక ‘అక్షరయోధుడు’ రామోజీరావు అని ఆవేశపడింది. ‘అక్షరసూర్యుడు’ అని ఈటీవీ వాళ్ళు ప్రేమ కురిపించారు. రామోజీరావు అక్షరయోధుల్ని పోగేశాడు. ప్రోత్సహించాడు. నిజమైన అక్షర యోధుల్ని తయారు చేయడానికి తోడ్పడ్డాడు.
డిగ్రీ మాత్రమే చదువుకున్న, తెలివైన, ముందుచూపున్న, దూకుడుతో దూసుకు వెళ్ళగల సమర్థుడైన వ్యాపారస్తుడు రామోజీరావు. అంతే.
మరి ఆయనే గనక అక్షర యోధుడైతే….
నార్ల వెంకటేశ్వరరావు ఏమౌతాడు?
నండూరి రామ్మోహన్ రావు ఏమౌతాడు?
తాపీ ధర్మారావుని ఏమనాలి?
రామోజీరావే అక్షరసూర్యుడైతే…
శ్రీశ్రీ అనేవాడు గాడిద అవుతాడా?
అక్షర కూలీ అవుతాడా?
భద్రిరాజు కృష్ణమూర్తి అనేవాడు
అక్షర బానిస అవుతాడా?
జాషువా అనేవాడు జోకర్ అవుతాడా?
మంచి, సరళమైన, సుబోధకమైన భాష కోసం ‘ఈనాడు’ తపించింది. ఆచరణలో నిరూపించింది. భాష మీది ప్రేమతో ‘తెలుగువెలుగు’ పత్రిక పెట్టింది రామోజీ. ఆయన చనిపోతే, ఈనాడు, ఈటీవీ భాషని దుర్వినియోగం చేశాయన్నదే నా ఫిర్యాదు. బాధ.
రామోజీ కీర్తి అజరామరం అని రాసిపారేశారు. అజరామరం అనే మాటకు అర్థం తెలిసే వాడారా? అనిర్వచనీయం, అజరామరం, న భూతో న భవిష్యతి….లాంటి వెర్రిమొర్రి మాటల్ని విచ్చలవిడిగా వాడటం మనం చూస్తూనే వున్నాం. రామోజీరావు పరిమితంగా చదువుకున్నారు. వ్యాసాలూ, సంపాదకీయాలూ ఆయన రాయలేరు. అసలవి రాసే పని ఆయనది కాదు.
అలా రాయడానికి జీతాలు తీసుకుని పని చేసేవాళ్ళు వేల మంది ఎప్పుడు సిద్ధంగా వుంటారు. తెలుగునీ, అక్షరాన్ని ప్రేమించినంత మాత్రాన ఆయన్ని అక్షరయోధుడు అనకూడదు. తేనెలూరు తెలుగు, మీగడ తరకల తెలుగు అని రాసిన ఈనాడు వాళ్ళే ఇలాంటి అత్యాచారాలకు పాల్పడటం ఒకింత విచారకరమూ, మరింత హాస్యాస్పదమూ!
రామోజీరావుని మెచ్చుకోడానికీ, పొగడ్డానికీ, కీర్తించడానికీ సవాలక్ష మార్గాలున్నాయి. ‘విజయానికి ఇన్ని మెట్లు’ అంటూ వ్యక్తిత్వ వికార నిపుణులు రాసిన అన్ని మెట్లూ ఎక్కి జెండా ఎగరేసిన ఘనుడు రామోజీ. అవన్నీ వొదిలేసి ‘అక్షర యోధుడు’ అని రెక్ లెస్ గా రాసి పారేస్తే, “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక” అని రాసిన రాంభట్ల కృష్ణమూర్తి ఆత్మ క్షోభించదా?
ఒకటా రెండా… ఎన్ని విజయాలో … విశాఖలో 1974 లో ‘ఈనాడు’ అనే చిన్న మొక్కను నాటి కొన్నేళ్లలోనే దాన్ని మహావృక్షం చేసి, వందలమంది జర్నలిస్టులకు నీడనివ్వడం-ఒకటి. మార్గదర్శి అనే ఒక పిచ్చి వడ్డీ వ్యాపార బడ్డీ కొట్టుని ఫైనాన్షియల్ కార్పొరేట్ జెయింట్ గా తీర్చిదిద్దడం- రెండు. వార్తా, వినోదం అనే ఈటీవీ చానళ్లతో హోరెత్తించడం- మూడు. ప్రపంచం అసూయపడేలా అంతర్జాతీయ ఫిల్మ్ సిటీని
అందరికీ అందుబాటులోకి తేవడం- నాలుగు. ఇంకా సినిమాలు, పచ్చళ్ళు, కళాంజలి, రియల్ ఎస్టేట్, రహస్య పెట్టుబడులు…. చెప్పలేనన్ని-ఇక్కడితోనే అయిపోలేదు…
‘ఉదయం’ దినపత్రిక పెట్టిందెవరు?
దాసరి నారాయణరావే కదా అనుకుంటున్నారా? కాదు. రామోజీరావే!
‘వార్త’ దినపత్రిక పెట్టిందెవరు?
గిరిష్ సంఘీ కానే కాదు, రామోజీరావే!
చివరికి సాక్షి డైలీ పెట్టిందెవరు?
రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేగా మీ జవాబు. సాక్షి పెట్టింది సాక్షాత్తూ చెరుకూరి రామోజీరావే!
ఆ రోజుల్లో…. అంటే 1981-82 సంవత్సరాల్లో,
దక్షిణ భారతదేశంలో అగ్రదర్శకునిగా వెలిగిపోతున్న దాసరి నారాయణరావుతో, రామోజీకి ‘ఏదో’ ఈగో ప్రాబ్లం వచ్చింది. ‘ఈనాడు’లో ఎక్కడా,
సినిమా పేజీలో కూడా దాసరి పేరు కనబడకూడదని మాకు ఆదేశం వచ్చింది. సినిమా వార్తలు చూసి, దర్శకుడు దాసరి నారాయణరావు అనే లైన్ మాత్రం పెన్నుతో కొట్టేసేవాణ్ణి- ఎన్నోసార్లు. సినిమాపేరు, నిర్మాత, హీరో హీరోయిన్ల పేర్లు వుంటాయి. దర్శకుడి పేరొక్కటే వుండదు.
ఇది సహజంగానే దాసరిని బాగా హర్ట్ చేసింది. గతంలో రామోజీతో పడక, ఈనాడు నుంచి బైటకు వచ్చేసి, కోపంతో పగతో రగిలిపోతున్న సంపాదకుడు ఎబికె ప్రసాద్ రెడీగా ఉన్నారు. దాసరీ, ఎబికె ఓ రోజు కలిసి, కసిగా మాట్లాడుకున్నారు. రామోజీరావుని చాచికొడదాం అని నిర్ణయించుకున్నారు. ‘ఉదయం’దూసుకొచ్చింది.
నాలుగేళ్లు ఉర్రూతలూగించిన ‘ఉదయం’ ఆర్ధిక అరాచకం వల్ల చతికిలపడింది. కొన్ని రోజుల తర్వాత, “టాంక్ బండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నాకిచ్చిన 1200 గజాల స్థలం వుంది. నువ్వు డబ్బు పెట్టు. పేపర్ పెడదాం. ఈనాడుకి మాడు పగిలిపోద్ది” అని ఎబికె ప్రసాద్, గిరిష్ సంఘీని రెచ్చగొట్టాడు. చేతిలో న్యూస్ పేపర్ వుంటే పెద్ద పెద్ద పనులు తేలిగ్గా చేసుకోవచ్చని ఈనాడు అప్పటికే రుజువు చేసి చూపించినందువల్ల గిరీష్ ఓకే అన్నారు.
ఆధునిక హంగులతో ‘వార్త’ అవతరించింది. ఇప్పుడిక రాజశేఖర్ రెడ్డి వంతు.
పాతికేళ్ళు ప్రతిపక్షంలో మగ్గి, ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయిన వైస్సార్ కి దినపత్రిక అత్యవసరం అని తెలిసొచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డీ, జగన్మోహన్ రెడ్డీ రంగంలోకి దిగారు. కొడితే ‘ఈనాడు’ రెండు కాళ్ళూ చచ్చుబడిపోవాలి అనే మల్టీకలర్ వ్యూహంతో, రెండు వేల కోట్ల పెట్టుబడితో ఆల్ట్రా మోడర్న్ ‘సాక్షి’ రంగు రంగుల గండభేరుండ పక్షిలా వచ్చి తెలుగు జర్నలిజం చరిత్రని తిరగరాసింది. షోకు పిల్లి ‘సాక్షి’ ముందు
పాత ప్రభుత్వ పత్రికలా ‘ఈనాడు’వెలవెలబోయింది.
అంచేత రామోజీరావు ఒక వ్యక్తి కాదు. వేలమంది నవతరం జర్నలిస్టుల్ని తయారు చేసిన ఈ కొత్త దినపత్రికల వెనుక వున్న ఒక చోదక శక్తి!
ఒక అక్షర సిసిలియన్ మాఫియా డాన్, గాడ్ ఫాదర్ రామోజీరావు. కనుక రామోజీని అక్షరయోధుడు, దార్శనికుడు, ఆదర్శమూర్తి అనడం బహుత్ అన్యాయ్ హై! కందుకూరి వీరేశలింగం పంతులు దార్శనికుడు. గురజాడ వెంకట అప్పారావు అక్షరయోధుడు. సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శమూర్తి. అల్లూరి సీతారామరాజు, గుడిపాటి వెంకట చలమూ విప్లవకారులు.
ఈనాడు గొప్ప సంయమనం పాటించి రష్యాలో అక్టోబర్ మహావిప్లవం తెచ్చింది చెరుకూరి రామోజీరావే అని రాయకపోవడం నాకెంతో
సంతృప్తి కలిగించింది.
ఓ 30-35 సంవత్సరాల క్రితం, బాగా పాపులర్ అయిన OUTLOOK అనే ఇంగ్లీషు వారపత్రిక, రామోజీరావు సక్సెస్ గురించి ఒక పెద్ద వ్యాసంలో “హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఇల్లిటరేట్ “అని రాసింది. అది పూర్తిగా నిజం కాకపోయినా, అబద్ధం కూడా కాదు. OUTLOOK కి రామోజీ మీద కోపం గానీ, ప్రెజుడీస్ గానీ వుండే అవకాశం లేనే లేదు.
‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ని ఒక మహా సంస్థగా మలిచి, ముందుండి నడిపించిన ది అన్ స్టాపబుల్ రామనాథ్ గోయెంకా ఒక వ్యాపారి, పారిశ్రామికవేత్త అవుతాడు గానీ, జర్నలిస్టో, అక్షరయోధుడో అవ్వడు. ఇది కామన్ సెన్స్‌కి సంబంధించిన వ్యవహారం.
ఈనాడు పత్రిక సారావ్యతిరేకోద్యమ ఛాంపియన్‌గా మారి, మద్య నిషేదం కోసం పెద్ద పోరాటం చేస్తున్నప్పుడు … మొదటి పేజీలో ఆ ఉద్యమ వార్తలు, చివరి పేజీల్లో బీరు, విస్కీ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపి హేళన చేస్తూ అప్పట్లో కె.ఎన్ .వై.పతంజలి ‘ఉదయం’ లో సంపాదకీయం రాశారు. అది చదివి ఇబ్బంది పడిన రామోజీ , మర్నాటి నుండి ఈనాడులో ఆల్కహాల్ యాడ్స్ ప్రచురించడం ఆపేశారు. రామోజీకి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎప్పుడు ఉన్నాయి.
తన సొంత ప్రయోజనాలూ , తనకు నచ్చిన రాజకీయాలూ… రాష్ట్ర ప్రజలందరి సమస్యలుగా ప్రొజెక్ట్ చేసి నమ్మించడంలో గొప్ప విజయం సాధించిన వాడాయన.
Behind every successful man there is a Nationalised Bank అనే వెటకారం లాంటి వాస్తవం మనందరికీ తెలుసు. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత సక్సెస్ ఫుల్ అయినట్టు అని మన దిక్కుమాలిన పెట్టుబడిదారీ విధానం చెబుతోంది. ఒక వ్యక్తి వేగంగా వందల వేల కోట్లకు పడగలెత్తడం వెనుక కొన్ని బ్యాంకులో , అడ్డదారులో , పిల్లి మొగ్గలో వుండి తీరతాయి. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ దీక్షతో పట్టుదలతో చేసి సక్సెస్ అయిన ప్రతివాడూ చండ్ర రాజేశ్వరరావో, పుచ్చలపల్లి సుందరయ్యో కాలేరు. వాళ్ళు ప్రజల మనుషులు. ఎన్నటికీ డబ్బు మనుషులు కాలేకపోయినవాళ్ళు.
ప్రజల డబ్బు మనిషి రామోజీ … రామోజీరావు ఏ పని చేసినా లాభం కోసమే చేశాడు. సొంత లాభం, స్వార్థ ప్రయోజనం మాత్రమే ముందు, అదే ఆయన ప్రయారిటీ. ఈ మాట రామోజీరావే స్పష్టంగా చెబుతారు. ఆయన చాలా ప్రాగ్మాటిక్. డౌన్ టు ఎర్త్. ఓపెన్ గానే మాట్లాడతాడు.
ఆ మాత్రం ధైర్యమూ, ముక్కుసూటిదనమూ ఆయనలో మొదటినుంచీ వుంది. మనమే ఆయన్ని అనవసరంగా దేవుడు అని ప్రొజెక్ట్ చేయడానికి తొందరపడుతున్నాము.
ఆయన సంపద సృష్టించాడు. కేవలం తన కోసం. తానేంటో లోకానికి చూపించడం కోసం. తన కీర్తి పతాకాన్ని తానే ఎగరవేసుకోవడం కోసం. మాలాంటి ఎందరో మిడిల్ క్లాస్ వాళ్ళం ప్రొఫెషనల్ జర్నలిస్టులు కావడం కోసం పునాది వేసినవాడాయన. ఆ గట్టి పునాదుల మీద మబ్బులను తాకే విలాసవంతమైన సొంత భవనాలు నిర్మించుకున్నదీ ఆయనే!
ఇలా…రామోజీరావు ఒక్కడే కాదు, అబ్సెసివ్ కంపల్సరీ కేష్ డిజీజ్ అనే తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళని ఏమంటారో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎక్కడన్నా రాసే వుంటాడు. “నేను నాస్తికుణ్ణి, దేవుణ్ణి నమ్మను” అని స్పష్టంగా చెప్పిన రామోజీరావుకి, నారాయణ, నారాయణ అంటూ గోవిందా గోవిందా అంటూ అంత్యక్రియలు చేయడం అపచారం అని ఆయన ఆత్మీయులకు తేలియకపోవడం విషాదం! “రామోజీరావు ఆశయం సాధిస్తాం” అంటూ ఫిల్మ్ సిటీలో నినాదాలు యిచ్చిన ఉద్యోగులకి ఆయన నిజమైన ఆశయం ఏమిటో తెలియకపోవడం మరింత ట్రాజెడీ!
By… Taadi Prakash… 97045 41559
https://telangana.thefederal.com/…/is-ramoji-a-people…
Share this Article