డిసెంబరు 22, 2000… అంటే రెండు పుష్కరాలు గడిచిపోయాయి… అప్పుడు ఈ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతలపై దాడి అన్నట్టుగా ఎర్రకోటపై టెర్రరిస్టుల దాడి జరిగింది… ఈ దేశ ప్రతిష్ఠాత్మక, పురాతన చిహ్నాలపై దాడి ద్వారా దేశ రక్షణ, భద్రత వ్యవస్థలను అపహాస్యం చేసి, మాదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం, జాతిని భీతావహం చేయడానికి జరిగిన కుట్ర అది…
ఆ దాడిలో ఎర్రకోటలో కాపలాగా ఉన్న రాజపుతానా రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు భారతీయ ఆర్మీ సిబ్బంది మరణించారు… ఈ దాడి తరువాత నాలుగు రోజులకు మహ్మద్ ఆరిఫ్ పట్టుబడ్డాడు… తను పాకిస్థాన్ జాతీయుడు… లష్కరే తోయిబా టెర్రరిస్టు… సీమాంతర ఉగ్రవాదంలో భాగంగా పాకిస్థాన్ పంపించిన కుట్రదారు… మరి ఒక జాతి, ఒక దేశం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన ఈ దోషిని ఏం చేయగలిగాం..?
ఏమీలేదు… ఈరోజుకూ తను సజీవం… భారతీయ న్యాయవ్యవస్థలోని డొల్లతనాన్ని ఆసరాగా చేసుకుని, రివ్యూలు వేసుకుంటూనే ఉన్నాడు… తనకు అన్నిరకాలుగా సహకరించేవారికి కూడా ఢోకా లేదు కదా దేశంలో… కనీసం ఇలాంటివారిని వేగంగా శిక్షించి, భద్రత విషయంలో జాతిజనానికి ఓ భరోసా కల్పించే వ్యవస్థను మనం నిర్మించుకోలేకపోయామా..? మనం ఇంత దద్దమ్మలమా..? నిస్సహాయులమా..? అనిపిస్తుందా..? నిజమే…
Ads
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ టెర్రరిస్టు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చింది అనే వార్త చదివాక అనిపించింది ఇదే… క్షమాభిక్ష కావాలట… అసలు ఇలాంటి కేసుల్లో అసలు ఈ క్షమలు, ఈ భిక్షల పిటిషన్లే రాష్ట్రపతి దాకా పోవద్దు, కాలహరణం… ఇప్పుడు తన చివరి ‘వాయిదాల అస్త్రం’ కూడా అయిపోయింది కాబట్టి ఇక మరణశిక్ష అమలు చేయాలి… ఏమో, అదెంత కాలమో…
ఒక సీమాంతర ఉగ్రవాదిని జైలులో పెట్టి మనం 24 సంవత్సరాలుగా మేపుతూనే ఉన్నాం, ఇదీ మన వ్యవస్థ గొప్పదనమని మురిసిపోదామా..? మన అసమర్థతను దాచుకుని కుమిలిపోదామా..? బహుశా ఇలాంటి దేశం మరొకటి ప్రపంచంలో ఉండదేమో… ఏ దేశమైనా తమపైకి దాడికి వచ్చేవాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది… పోనీలే, అత్యంత ఉదారులమని భుజాలు చరుచుకుందాం… ఏమో, మరణశిక్ష రేపనగా ఏ కపిల్ సిబలో అర్ధరాత్రి సుప్రీం తలుపుతట్టి ఇంకేదో లా పాయింట్ ప్రయోగిస్తాడేమో…!
2000లో దాడి జరిగితే… 2005లో దోషిగా ఖరారు చేసింది కోర్టు… మరణశిక్ష విధించింది… 2007లో ఢిల్లీ హైకోర్టు శిక్షను సమర్థించింది… 2011లో సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది… రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకుంటే దాన్ని కూడా 2012లో తిరస్కరించింది… 2014లో ఆరిఫ్ క్యురేటివ్ పిటిషిన్ వేసుకున్నాడు… చెప్పుకున్నాం కదా ముందే, మరణాన్ని వాయిదా వేసుకునేందుకు బోలెడు మార్గాలు మన వ్యవస్థలో…
త్రిసభ్య ధర్మాసనం 2022 నవంబరులో ఆరిఫ్ పిటిషన్‌ను తిరస్కరించి మరణశిక్ష సబబే అని చెప్పింది… ఆరిఫ్‌తోపాటు పాకిస్థాన్ నుంచి వచ్చి, శ్రీనగర్‌లో అడ్డా వేసి, పక్కా ప్రణాళికతో ఎర్రకోట మీద దాడిచేసిన మరో ఇద్దరు సహ ఉగ్రవాదులు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు… కానీ ఈ ఆరిఫ్ మాత్రం ఇంకా మనతో ఆడుకుంటూనే ఉన్నాడు…
రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషిన్‌ను తిరస్కరించడం ద్వారా ఇక అన్నిరకాల న్యాయపరమైన మార్గాలూ మూసుకుపోయినట్టే, ఈ సుదీర్ఘ జాప్యానికి, కాలహరణానికి తెరపడ్డట్టే అని భావించాలి… మరణశిక్షను ఎప్పుడు అమలు చేస్తారనేది పక్కన పెడితే… అసలు ఇలాంటి టెర్రరిస్టులకు అన్నిరకాలుగా ఈరోజు వరకూ సాయపడుతున్నది ఎవరు..? ఉగ్రవాదానికి సాయపడటం కూడా నేరమే కదా… మరి వాళ్లనెందుకు ఉపేక్షిస్తున్నాం..?!
Share this Article