విజయ్ సేతుపతి… మంచి నటుడు… డౌట్ లేదు, కాకపోతే మొహమాటాలకో, స్నేహం కోసమో అప్పుడప్పుడూ ఏవో పిచ్చి పాత్రలు చేసి విసిగిస్తుంటాడు… కానీ సరైన పాత్ర పడాలే గానీ ఎమోషన్స్ పండించడానికి, తనదైన నటన ప్రతిభను ప్రదర్శించడానికి తిరుగుండదు…
ఇప్పుడు కొత్తగా వచ్చిన తన సినిమా… తనే ప్రధాన పాత్ర… సహాయ పాత్ర కాదు, విలన్ కాదు, సైడ్ కేరక్టర్ అసలే కాదు… ఆ పాత్రలోకి దూరిపోయాడు.,. తనకుతోడుగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెెగెటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్ చేశాడు… ఇద్దరూ రెచ్చిపోయారు… ఎమోషన్స్ పండించే సందర్భాల్లో… నిథిలన్ స్వామినాథన్ దర్శకుడిగా ఈ కథను భలే డీల్ చేశాడు…
పైగా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్… రీసెంట్ పాపులర్… తనూ ఇరగేశాడు… ఏదో అల్లరిచిల్లరగా మొదలై… ప్రధాన పాత్రధారి చెప్పే ఏదో కట్టుకథ, సిల్లీకథతో మొదలై… సీరియస్ నోట్ తీసుకుని, అనుకోని ట్విస్టులతో, చివరలో కర్మఫలం మీద ఓ మెసేజుతో ముగిస్తాడు దర్శకుడు… ఎక్కడా ల్యాగ్ లేదు, పిచ్చి పాటల్లేవు… రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్‌ను ఏ గందరగోళం లేకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా కథ చెబుతాడు దర్శకుడు…
Ads
నిజానికి ఇవే కదా ఇప్పటి సినిమాకు కావల్సిన లక్షణాలు… మూల కథను వందల సార్లు చూసుంటాం… కానీ తాజాగా ఎలా ప్రజెంట్ చేశారనేదే ముఖ్యం… క్లైమాక్సులో కథ కుదిపేయాలి… అలాగే మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు… అలాగే క్లైమాక్స్ లో చిన్నారి అడుగులో రెడ్ డైమండ్ రిఫరెన్స్ తో సినిమాను ముగించిన తీరు చిన్నపాటి ఝలక్ ఇస్తుంది… అనురాగ్ కశ్యప్ ముందు ధైర్యంగా కూర్చొని చిన్నారి సచన నమిదాస్ మాట్లాడే సన్నివేశం ఈమధ్యకాలంలో ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు…
తెలివైన దర్శకుడు దొరికితే, పట్టుపడితే… 24 క్రాఫ్ట్స్ ఎలా ప్రతిభావంతంగా పనిచేస్తాయో కూడా చెప్పొచ్చు ఈ సినిమా ద్వారా… ఆఫ్టరాల్ సినిమా అంటేనే టీం వర్క్ కదా… విజయ్ సేతుపతికి నటనపరంగా వంక పెట్టడానికి ఏముంటుంది… ఇరగేశాడు… ఓ సగటు ఆడపిల్ల తండ్రి కనెక్టయ్యేలా చేశాడు…
తను ఓ బార్బర్… చిన్నపాటి సెలూన్ పెట్టుకొని జీవిస్తుంటాడు… ప్రమాదంలో భార్య చనిపోతే కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు… ఓ రోజు ఇంట్లో దొంగలు పడి ఇనుముతో చేసిన ఓ చెత్త బుట్టను ఎత్తుకెళ్తారు… ఆ చెత్త బుట్ట పోయిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు ఫైల్ చేయమని అడిగితే… అందరూ అతడిని చూసి గేలి చేయడమే కాకుండా తీవ్రంగా అనుమానిస్తారు… ఆ చెత్త బుట్ట తెచ్చి ఇస్తే 7 లక్షల లంచం ఇస్తానని మహరాజ (హీరో పాత్ర పేరు) ఆశ చూపుతాడు… ఇంతకు మించిన వైవిధ్యమైన స్టోరీ ఏం కావాలి మనకు..?
నిజానికి హీరో అంటే వీర తోపు, మహా తోపు, రొటీన్ ఇమేజీ బిల్డప్పులు, స్టెప్పులు, ఫోజులు మాత్రమేనా..? కాదు అనే బదులిస్తుంది ఈ మహారాజా సినిమా… అవునూ, మనవాళ్లకు ఈ కథాకథనాలు ఎందుకు చేతకావు…? మన బురదజీవులకు ఇలాంటి పాత్రల పోషణ ఎందుకు తెలియదు… చాలా ఏళ్లుగా జవాబు దొరకని ప్రశ్న ఇది..!!
Share this Article