ఈ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆ హిందీ సినిమా పాటల కాలం ఏమిటండీ బాబు?
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ,
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ…
చెల్లని రూపాయికే గీతలెక్కువ…
… అన్నట్టు, ఏమీ తెలియనివాడికే అందరికీ అన్నీ నేర్పించాలని వుంటుందట.. వాడికి వేదికనిచ్చేది ఇంకా ఏమీ తెలియనివాళ్ళట!
ఎంత చూడకూడదనుకున్నా ఎవరో ఒకరు చూపిస్తారు.. చూసిన తరువాత ఎంత వద్దనుకున్నా తిట్టకుండా వుండలేను.. పోనీ తిడితే వాళ్ళు పద్ధతి మార్చుకుంటారా? మా జర్నలిస్టు ఏం చెప్పినా కరెక్ట్… మధ్యలో ఈ పనికిమాలిన వాళ్ళగోల ఏమిటని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో జర్నలిస్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్.. రైట్టెర్, రైట్టేస్ట్ … అన్నట్టు ప్రవర్తిస్తారు…
Ads
ఈ వారం పాట మొదటి పాదం చూడగానే ఏడ్వాలో, నవ్వాలో తెలియలేదు…
యే జో మొహబ్బత్ హై, యె ఉన్కా హై కామ్,
మహెబూబ్ కా జో బస్ లేతే హువె నామ్,
మర్ జాయే , మిట్ జాయే, హోజాయే బద్నామ్
ఈ ప్రేమ ఇదంతా ఆమె పనే సుమా! అరె ఓయ్.. ప్రియతముని నామ స్మరణ చేస్తూ ఆమె ప్రాణమే పోనీ.. అట…. ఆమె ప్రాణం పోతే ఈయనకేం ఆనందమట.. ఇదేనా ప్రేమంటే… అయ్యబాబోయ్! ఏమిటిది?
ప్రియురాలి నామస్మరణ చేస్తూ, ప్రాణాలు విడవటం, నాశనమైపోవటం, చెడ్డ పేరు సాధించటం … ఇది ప్రేమించేవాళ్ళపని.. అందుకే అందమైన అమ్మాయిలను దూరం నుంచే చూస్తూ నమస్కారం పెట్టి వెళ్తాను కానీ, ఈ ప్రేమ గోల నాకొద్దు వదిలేయండి… అన్న అర్ధం వచ్చే పల్లవికి ఈ గొప్ప హిందీ, ఉర్దూ, హిందీ పాటల పండిట్ ఇచ్చిన అర్ధం చూడండి.. మధ్యలో అరె ఓయ్.. ఎక్కడనుంచి తెచ్చిపెట్టాడో….. అరె… అంటే, అరె ఓయ్ అనుకున్నట్టున్నాడు…
అయ్యా…. హిందీ పాటలు అర్ధం చేసుకోవాలంటే, కాస్త కవితా స్పృహ వుండాలి. సాహిత్య చైతన్యం వుండాలి. కామస్ సెన్స్ వుండాలి…
ఇక టూటే అగర్ సాఘర్ , నయా సాఘర్ కొయీ లేలే… అంటే…ఒక సాగరం ఆగిపోతే, కొత్తగా మరో సాగరాన్ని కలుపుకోవాలిట!
ఎక్కడ కలుపుకోవాలి? ముక్కులోనా? మూతిలోనా? తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుని రాయాలి. లేకపోతే వదిలేయాలి.. అంతేకానీ, జర్నలిస్టుని కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తే, చుట్టూ చేరిన భజన బృందాలు పొగడవచ్చుకానీ, ఆ పొగడ్తలు దేవతావస్త్రాలే!
అది సాగర్ కాదు.. నా బుజ్జి పండిట మేధావీ, అది సాఘర్… సాగర్ అంటే, సాగరము.. సాఘర్ అంటే, మధుపాత్ర.. చషకము…..
ఒక సాగరం ఆగిపోతే కొత్త సాగరం కలుపుకోవాలి అని రాసేటప్పుడన్నా ఏమిటిది? అన్న అనుమానం, ఆలోచనలు రచయితకు రాకున్నా కాకి పిల్ల అనుకుంటున్న కోకిల పిల్లకు రావాలి కదా? (ఇది అర్ధం కావాలంటే, మరో గొప్ప జర్నలిస్ట్ ఉపన్యాసం తెలియాలి.. ఆయనింకో గొప్పాతిగొప్పాతిజర్ర్ర్నలిస్టోస్ట్…) ఈ అనుమానం ఎవరికీ రాలేదంటేనే ఆంధ్రజ్యోతి స్టాండర్డ్ తెలుస్తోంది. మరి తెలుగు పత్రికలెవరూ చదవటం లేదు, విశ్వసించటం లేదు అంటే అర్ధం వుంది కదా!
ఒక మధుపాత్ర విరిగిపోతే కొత్త మధుపాత్ర తీసుకో అని అర్ధం. అంటే, ఒక అమ్మాయి దొరక్కపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. కానీ, గుండె పగిలితే….. అందుకే మేరే ఖుదా.. దిల్ సే కోయీ కిసీ కే నా ఖేలే… దేవుడా.. ఎవ్వరూ ఎవరి హృదయంతో ఆటలాడకూడదు. హృదయం పగిలితే…… ఇక్కడ దివ్యమూర్తి ప్రసక్తి లేదు… ఖుదా.. అంటే, దేవుడే కానక్కరలేదు… అయ్యో రామా అన్నట్టన్న మాట.. ఆరి దేవుడా, నా దేవుడా.. ఇలా…
.. ఓనా దివ్య మూర్తి, ఎవరి హృదయంతో ఎప్పుడూ ఆటలాడకు, అస్సలు అర్ధం లేని అర్ధం…
ఇంత గొప్ప పాండిత్యం వున్న జర్నలిస్టు కనుకనే ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఈయన ఎన్నెన్ని రాంబాబు డైరీలో రాంబాబు తలదన్నే బాబులాంటి హాస్య చతురతను ప్రదర్శిస్తున్నా అక్కున చక్కగా చేర్చుకుని పాఠకులపైకి వదిలి ఎంత బాగా అందరినీ పిచ్చోళ్లను చేస్తున్నామనుకుంటూ వారం వారం నవ్వుకుంటూ ఉంటున్నట్టున్నారు. ..
ఇది చదివిన తరువాత కొందరు సూచించినట్టు కథ చదివే ఓపిక లేక పత్రికను ఎదురింటి కుక్క ముందుకు విసిరితే అది విస్తరిలా చింపి, పనికిరానిదని పక్కకు తన్ని పోయింది. వర్షం ముందు వీచిన గాలి ఆ ముక్కల్లో కొన్ని నా ముఖాన కొట్టింది.. ఇంకొన్ని మా ఇంటి ముందు పడేసి పోయింది.. ఎంతయినా ప్రకృతి కూడా జర్నలిస్టుల పక్షపాతే కదా! (By… మురళీకృష్ణ కస్తూరి)
Share this Article