ఒక వార్త కనిపించింది… దక్షిణ కొరియా మాంసపు బియ్యం తయారు చేసిందట… అంటే హైబ్రీడ్, జెనెటికల్లీ మోడిఫైడ్, టెక్నికల్లీ ఇంజినీర్డ్ అని ఏ పేరయినా పెట్టుకొండి… ఈ బియ్యం స్పెషాలిటీ ఏమిటిట అంటే..?
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన బీఫ్ మాంస కణాన్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి, సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించారన్నమాట… దాంతో ఉపయోగం ఏమిటీ అంటే..? సాధారణ బియ్యంలోకన్నా 8 శాతం అధిక ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు ఉంటాయట… మీటీ రైస్ అంటారట ఈ బియ్యాన్ని…
ఇదీ బియ్యమే… కాకపోతే గులాబీ రంగులో ఉంటాయి, బాస్మతికి ఉన్నట్టే దీనికీ ఓ స్పెషల్ యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది… జంతువుల్ని వధించకుండానే, ప్రయోగశాలల్లో జంతుకణజాలాన్ని డెవలప్ చేసి జంతు ప్రొటీన్‌ను పొందేందుకు ఈ ప్రయోగం అన్నమాట… సో, మంచి పౌష్టికాహారం…
Ads
సింపుల్‌గా చెప్పాలంటే… ఆ బియ్యంతో వండిన ఆహారం తింటుంటే మటన్ బిర్యానీ తింటున్నట్టే అన్నమాట… కాకపోతే అది జీవ మాంసం కాదు… దాని కణజాలం నుంచి ల్యాబుల్లో డెవలప్ చేసిన కణజాలం ప్లస్ బియ్యం… ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే..? కొరియన్లు ఏదైనా తింటారు… వాళ్లే కాదు, జపనీయులు, చైనీయులు… తూర్పు దేశాలన్నీ సకల జీవకోటినీ తింటాయి…
ఎగిరేవి, పాకేవి, దూకేవి, నడిచేవి, ఈదేవి… అన్నీ… కనిపించవు గానీ లేకపోతే బ్యాక్టీరియా, వైరసుల్ని కూడా వండకుండానే మింగేసే చైనీయులు సరేసరి… ఈ బియ్యం ప్రయోగాలు కొత్తేమీ కావు… మన ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరొటిన్‌ను బియ్యంలో కలిపేసే జెనెటికల్ మోడిఫైడ్ రైస్… గోల్డ్ కలర్… రకరకాల పోషకాలు, విటమిన్లతో కలిపేసే ఫోర్టిఫైడ్ రైస్ ఆల్రెడీ మన ఆహారభద్రత పథకంలోకి వచ్చేసింది…
రేప్పొద్దున అయోడిన్, పొటాషియం కూడాా కలిపేసి కొత్త వెరయిటీ తీసుకొస్తారేమో… సరే గానీ, ఆ మీటీ రైస్‌ను ఇండియా అనుమతిస్తుందా..? అది నేరుగా బీఫ్ బియ్యం కావు… ల్యాబుల్లో డెవలప్ చేసిన కణజాలం… ఐనాసరే, సెంటిమెంట్ సెంటిమెంటే కదా… బీఫ్ రైస్ అని ముద్రేసి, దాని ఎంట్రీకి నో అంటుందా ప్రభుత్వం..? ఐనా ఇదింకా ప్రయోగదశలోనే ఉంది… బీఫ్ మాత్రమే కాదు, ఫిష్, ఇతర మాంస కణజాలాల్ని కూడా ఉపయోగిస్తారని మరో కథనం… (బీఫ్ అనగానే గోమాంసం అని రాసినవాళ్లూ ఉన్నారు…)
మనిషికి ఆరోగ్య సమస్యలు ఎక్కువై చాలామంది సుగర్, ఒబేసిటీ పేషంట్లు మొత్తానికే అన్నం మానేస్తున్నారు… కార్బోహైడ్రేట్లు అధికం కాబట్టి… కొందరు దంపుడు బియ్యంతో సరిపెడుతున్నారు… ఇంకొందరు ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే బాస్మతి బ్రౌన్ రైస్ వాడుతున్నారు… బ్లాక్ రైస్ వంటి వెరయిటీలూ పాపులర్ అవుతున్నాయి… గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న వెరయిటీలను కూడా డెవలప్ (సుగర్ రైస్) చేస్తున్నారు…
మరొక వార్త కనిపించింది… మనుషులకు ఇప్పుడు అయోడిన్ తక్కువ అవుతుందంటూ ఉప్పులో అయోడిన్ కలిపి వాడుతున్నాం కదా… ఇకపై రక్తపోటు సమస్య నివారణకు పొటాషియం కలిపిన ఉప్పు రాబోతోందట… నిజానికి ఇది కంట్రవర్సీ… అందరికీ అయోడిన్ అక్కర లేకపోయినా బలవంతంగా తినిపిస్తున్నామనే విమర్శ ఉంది… అందుకే చాలామంది గళ్ల ఉప్పు వాడుతున్నారు… హిమాలయన్ పింక్ సాల్ట్ వీథుల్లో అమ్ముతున్నారు… సైంధవ లవణం సరేసరి…
మరి రక్తపోటు ఉన్నవాళ్లకు పొటాషియం కలపడం బెస్ట్… అది ఎక్కువ సోడియంను దేహం నుంచి బయటికి పంపిస్తుంది… గుడ్… కానీ పొటాషియం అవసరం లేనివాళ్లకు తినిపించడం అవసరమా..? ఆల్రెడీ పొటాషియం క్లోరైడ్ బయట దొరుకుతుంది… అదీ ఉప్పుకు ప్రత్యామ్నాయమే…
ఇప్పుడు ఇమ్యూనిటీ ఘోరంగా పడిపోయింది, చాలామంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు… పనిలోపనిగా దాన్నీ ఉప్పులో కలిపేయాలనే సూచన కూడా వస్తుందేమో… సో, రాబోయే రోజుల్లో ఉప్పు, బియ్యంలపై ఇంకా చాలా ప్రయోగాలు సాగుతాయన్నమాట… అప్పుడిక ఒరిజినల్ సోనా మశూరి, హెచ్ఎంటీ రైస్ వెరయిటీలు కాదు… ఏయే పోషకాలు కలిసిన వెరయిటీలో బ్యాగులపై చూసి, మన అవసరాన్ని బట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో..!!
Share this Article