కక్షసాధింపు ఉండదు… మాది జగన్ పాలనలాగా సైకో పాలన కాదు… ప్రజావేదిక శిథిలాలను ఆ పాలనకు గుర్తుగా అలాగే ఉంచుతాను…. అని ఏవేవో చెప్పిన చంద్రబాబు తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చేశాడు… జగన్, బాబు… ఎవరూ జేసీబీ పాలనకు అతీతులు కారని నిరూపించాడు…
ప్రతి జిల్లాలో నిర్మించిన పార్టీ ఆఫీసుల బొమ్మలు వేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో ఆనందం పొందాయి గానీ… టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోలేదా..? అసలు హైదరాబాదు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కథేమిటి..? రెండు తెలుగు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీల భవనాల సంఖ్య ఎవరికైనా తెలుసా..? సరే, ఇప్పుడు ఆ చర్చను అలా వదిలేస్తే… చంద్రబాబు మరో నిర్ణయమూ అలాంటిదే…
వాలంటీర్లకు దినపత్రిక కొనడానికి ఇచ్చే అలవెన్స్‌ను రద్దు చేశాడు… నిజానికి అనవసరం ఈ నిర్ణయం… బాబు గారి బాబు లోకేష్ బాబు రెడ్‌బుక్ హిట్ లిస్టు ప్రకారం ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు… అంతేతప్ప యుక్తాయుక్త విచక్షణను ఉపయోగించి ఉండరు… ఎందుకంటే..? ఓసారి నేపథ్యంలోకి వెళ్దాం…
Ads
ఎస్, జగన్ తీసుకున్నది ఓ పిచ్చి నిర్ణయం ఒక సీఎంగా… ప్రతి జిల్లాలోనూ వేలాది మంది జగన్ నియమించిన వాలంటీర్లు ఉన్నారు… వాళ్లు నెలనెలా డెయిలీ పేపర్ కొనడానికి డబ్బులు ఇస్తూ ఓ జీవో కూడా ఇచ్చాడు… అసలు ఉద్దేశం తన సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచడమే… డౌట్ లేదు… తన వ్యతిరేక పత్రికను ఈనాడును తొక్కడం కోసమే, అందులోనూ డౌట్ లేదు…
ఈనాడును నంబర్ వన్ స్థానం నుంచి కూలదోస్తే… తన వ్యతిరేక ప్రచారం తగ్గుతుంది, సాక్షి నంబర్ వన్ కాగానే ప్రభుత్వ యాడ్స్ దానికే ఇచ్చేసి, ఈనాడుకు కట్ చేసేస్తే మరోరకంగానూ ఈనాడుకు నష్టం కలిగించవచ్చునని ఓ ప్లాన్ వేశాడు… కానీ జగనొకటి తలిస్తే అన్నట్టుగా… అదేమీ ఫలితం ఇవ్వలేదు… అదీ ఎందుకంటే..?
ఈ అలవెన్స్ ఉద్దేశం సాక్షిని లేపడమే అయినా… నేరుగా ఫలానా పత్రికే కొనాలని జీవో ఇవ్వలేరు… ఏదో ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పించడం తప్ప..! కానీ వాలంటీర్ ఏ పత్రిక వేయించుకుంటున్నాడు అని ఏమైనా ఆడిటింగ్ ఉంటుందా..? ఉండదు కదా… తమకు ఇష్టం వచ్చిన పత్రికే వేయించుకున్నారు వాలంటీర్లు… దీంతో జగన్ ఉద్దేశం నెరవేరలేదు… ఏపీలో ఈనాడు 7.4 లక్షలతో స్టిల్ నంబర్ వన్… సాక్షి 6.5 లక్షలు… సాక్షి ఈనాడుకన్నా లక్ష దూరంలోనే ఉండిపోయింది… (ఏబీసీ అధికారిక గణాంకాల మేరకే…)
చివరకు జగన్ సొంత జిల్లా కడపలో కూడా ఈనాడుకన్నా సాక్షి చాలా మైనస్… కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కొద్దిగా ఈనాడుకన్నా బెటర్, కాగా ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో ఈనాడుకన్నా కాస్త ఎక్కువే… మిగతా ఏ జిల్లాలోనూ ఈనాడును బీట్ చేయలేకపోయింది…
అయ్యో, అయ్యో, ఈ జీవోతో నా నంబర్ వన్ స్థానం పోతుంది, జనంలోకి తాము తీసుకుపోయే జగన్ వ్యతిరేక ప్రచారం తగ్గుతుంది, జగన్ డప్పు సాక్షి పెరుగుతుంది అనుకుని ఈనాడు కోర్టుకెక్కింది… తరువాత ఆ జీవో ప్రభావం సర్క్యులేషన్ మీద పెద్దగా లేదని తేలాక తెల్లమొహం వేసింది…
మొన్నటి ఎన్నికల ముందు రాజకీయాల్లో వేలాది మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు… మారిన స్థితిలో మిగతా వాలంటీర్లు కూడా ఎవరైనా సాక్షి వేయించుకున్నట్టయితే ఈనాడు వైపు టర్న్ అయిపోతారు, లేదా సాక్షి కంటిన్యూ చేస్తారు… ఏతావాతా ఆ అలవెన్స్ జీవో ప్రభావం ఏమీ ఉండదు… అలాంటప్పుడు ఆ జీవో రద్దు చేయడం ఉద్దేశపూర్వకమే అవుతుంది తప్ప అనవసర ఖర్చును తగ్గించడం కాదు…
ఈనాడు సంతోషం కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు… కానీ జగన్ జీవోతో సాక్షికి ఏ ప్రయోజనం ఎలా రాలేదో, జీవో రద్దుతో ఈనాడుకూ ఆ ఫాయిదా ఏమీ ఉండదు కదా… ఏ పత్రికైనా సరే ప్రభుత్వ సపోర్టుతో నిలబడదు, వ్యతిరేకిస్తూ కూలిపోదు… అవి జనక్షేత్రంలో పోరాడాల్సినవే… ఈ జీవోల జారీ, జీవోల రద్దు అనేవి దిక్కుమాలిన నిర్ణయాలు..!!
జగన్ మూర్ఖంగా నియమించిన వందల మంది సలహాదారుల్ని తీసేయడం ఓ మంచి నిర్ణయం, గుడ్… లెక్కకుమిక్కిలి కార్పొరేషన్లు, వాటి పదవులు మరో దండుగ… అవీ తీసేయండి, గుడ్… మళ్లీ భర్తీ చేయకండి, అవి కేవలం కొందరు నాయకులను మేపడానికి తప్ప దేనికీ పనికిరావు… ఇలాంటి నిర్ణయాలు తీసుకొండి బాబూ, జనం హర్షిస్తారు… కానీ ఆఫీసులు కూలగొడతాం, పత్రిక కొనే అలవెన్సులు రద్దు చేస్తాం వంటివి కాదు..!!
Share this Article