జగన్‌ది ఘోరమైన పరాజయమే… మరీ 11 సీట్లే రావడం తలకొట్టేసినట్టే… సందేహం లేదు… పదో వంతు సీట్లు కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని టీడీపీ కూటమి చెబుతోంది… అంటే జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించే అవకాశమే లేదని కూటమి వాదన… ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రోటోకాల్ పరంగా ఓ కేబినెట్ మంత్రికి ఉండే గౌరవం దక్కుతాయి…
పదో వంతు సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది ఏ చట్టంలోనూ లేదనీ, ఎలాగూ టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా పోటీచేశాయి కాబట్టి, ఇక ఆ కూటమికి విపక్షంగా మేమే ఉన్నాం కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ ఓ లేఖ రాశాడు… రాయడం వరకూ వోకే, కానీ అందులో కొన్ని తప్పులు దొర్లినట్టు ఆంధ్రజ్యోతి పట్టుకుంది… జగన్‌కు కౌంటర్లు ఇవ్వడంలో అది చంద్రబాబుకన్నా ఎక్కువ యాక్షన్ ప్రదర్శిస్తుంది కదా… పత్రికలో కౌంటర్ రాసేసింది… పైగా జగన్ బెదిరింపు ధోరణి అని వ్యాఖ్యానించింది…
జగన్ రాసిన లేఖలో… 1984లో పర్వతనేని ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని, 1994లో పి.జనార్ధన్‌రెడ్డికి కూడా ఇచ్చారని పేర్కొన్నాడు… నో, నో, అసలు 1984లో ఉపేంద్ర లోకసభ సభ్యుడే కాదు, జనార్ధన్‌రెడ్డిని కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని రాసుకొచ్చింది జ్యోతి… 1980-84, 1984-89 నడుమ ఎవరికీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు లోకసభలో… అలాగే 2014, 2019 లలో కూడా ఎవరికీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అని జ్యోతి గుర్తుచేసింది…
Ads
ఎస్, జ్యోతి చెప్పినట్టు చట్టసభలు విలువలు, సంప్రదాయాల మేరకు నడుస్తాయి… నిరాకరించే అవకాశం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకిస్తుంది..? అంతటి ఉన్నత గౌరవ మర్యాదలు పరస్పరం ప్రదర్శించుకునే రాజకీయాలు కావు నేడు… పైగా కుసంస్కార పంకిలంలో పొర్లాడే ఏపీ పాలిటిక్సులో దీన్ని ఎలా ఊహించగలం..? అదీ విపక్ష నేతపై ట్రెజరీ బెంచ్ బూతులు, విమర్శలతో పడిపోయే సభలో..!
నిజంగానే పదోవంతు సభ్యులు తప్పనిసరి అని చట్టంలో ఉందా..? సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ సోషల్ మీడియా పోస్టు దీన్ని కొంత చర్చించింది… ఇలా… ‘‘మొదటగా అసలు ప్రధాన ప్రతిపక్షం గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు. మరి ఈ పదోవంతు సీట్ల ప్రస్తావన ఎలా వచ్చింది? 1950ల ప్రాంతంలో సభ్యులకు సీట్లు కేటాయించడానికి అప్పటి స్పీకర్ ఒక ఏర్పాటు చేసుకున్నారు. పదోవంతుకు పైగా సీట్లు వచ్చిన పార్టీలను మాత్రమే పార్టీలుగా గుర్తించి వారికి ముందు వరసల్లో సీట్లు కేటాయించి, మిగిలిన వాటిని కేవలం గ్రూపులుగా పరిగణించేవారు.
కానీ ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఈ గ్రూపుల పద్ధతిని తిరస్కరించి, ప్రతి పార్టీని పార్టీగానే గుర్తించింది. దీంతో ఆ పదోవంతు నిబంధనలకు కాలం చెల్లింది. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని దేన్ని బట్టి గుర్తించాలి?
దీనికి పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కు జీతభత్యాల చట్టం-1977 ఆధారం… దీని ప్రకారం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ని గుర్తించాల్సిన చట్టబద్ధ బాధ్యత స్పీకర్ కు వుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ని గుర్తించాలంటే, ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని గుర్తించాలి. సభలో అధికార పక్షానికి వ్యతిరేకంగా వుండే పార్టీలలో అతి పెద్ద పార్టీ (ఎక్కువ సభ్యులున్న పార్టీ) నేతనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఎన్నుకోవాలని ఈ చట్టం నిర్వచిస్తోంది. కనుక . అతి పెద్ద ప్రతిపక్ష పార్టీనే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. దీన్ని బట్టీ పదోవంతు సభ్యులకి ప్రధాన ప్రతిపక్ష హోదాకి సంబంధం లేనట్టే…
.
గతంలో ఢిల్లీ అసెంబ్లీలో కేవలం ముగ్గురే సభ్యులు వున్న బిజెపికి ఈ చట్టం ప్రకారమే ఆ సభ స్పీకర్ , ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ పార్టీ నేతకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా దక్కింది.. . ఇక ఇప్పుడు ఆఃంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రత్యేకమైన లెజిస్లేచర్ నిబంధన ఏదైనా వుంటే తప్ప, అమలులో వున్న పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకి పదోవంతు సీట్లకి సంబంధం లేదు…’’
కానీ దీనికి విరుద్ధమైన వాదన, వివరణలు కూడా వినిపిస్తున్నాయి… 1977 చట్టంలోనే కనీసం పదోవంతు సీట్లున్న పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే క్లాజ్ ఉందని సంబంధిత చట్టంలోని భాగాన్ని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు… ఇలా…
చట్టపరమైన, సాంకేతికమైన వాదనలు, వివరణలు, సూచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే… జగన్‌ను గౌరవించండి అని చంద్రబాబు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నా సరే… ప్రస్తుత ఏపీ రాజకీయాల ట్రెండ్ ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అసాధ్యంగానే కనిపిస్తున్నాయి..! కాకపోతే శాసనసభకు రాకుండా ఉండటానికి ఓ సాకు అవసరమని అనుకుంటే జగన్‌కు ఈ ఇష్యూ కొంత ఉపయోగపడవచ్చు..!!
Share this Article